ఇవాళే కార్తీక పౌర్ణమి! జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు? అందులోని ప్రాశస్యం

26 Nov, 2023 07:51 IST|Sakshi

సమస్త పాపాలను దగ్ధం చేసే జ్వాలా తోరణం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష. ఈ తోరణం గుండా వెళ్లకుండా ఉండాలంటే జ్వాలా తోరణ దర్శనం చేసుకోవాలి అని పెద్దలు చెప్పారు.

కార్తీక పౌర్ణమిరోజున సాయంకాలం జ్వాలా తోరణం చేస్తారు ఎందుకు ?
కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు.

ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ.. "కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ ఘోర భీకర యమద్వార తోరణంబు..’’ అంటాడు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష.

ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే -

‘‘శివా ! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని ప్రతీకాత్మకంగా చెప్పటం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి - ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనోపెడతారు.అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం...

కార్తీకపౌర్ణమి నాడు ఏం చేయాలి?
" సమస్త ప్రాణులకూ నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చెయ్యలేవు. నేను ఏమి చెయ్యగలను? దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం. యధార్ధానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించాలి. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, " దామోదరమావాహయామి " అనిగాని, " త్రయంబకమావాహయామి " అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఈ శ్లోకం చెప్పాలి...

కీటాఃపతంగా మశకా శ్చ వృక్షాః జటేస్ధలే... ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్వాప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః"

ఈ దీపము దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి ఈ దీపం వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటకములు, పురుగులు, పతంగాలు, దోమలు, వృక్షాలకు వెళ్ళాలి. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది. కాబట్టి దామోదరుడి చెయ్యి దానిమీద పడినట్టే! త్రయంబకుని చెయ్యి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ళ వంటి వాటిపై ఈ దీపపు వెలుతురు పడినప్పుడు, ఆ ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో వాటి పాపపుణ్యాలన్నీ నశించుపోవుగాక! ఇక వాటికి జన్మ లేకుండుగాక! ఉదర పోషణార్ధమే బ్రతుకుతున్న భయంకరమైన స్ధితిలో ఉన్న వాడిమీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించి వాడు వచ్చే జన్మలో అభ్యున్నతిని పొందుగాక!

నువ్వు ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. మనం ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి "కార్తీక పౌర్ణమి". అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం ఆవునేతిలో ముంచి వెలిగిస్తుంటారు. దీపాలు ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టి.వి చూస్తాను అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించాలి. ఇంట దీపం పెడితే కార్తీకపౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో దీపం పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావుగారి ప్రవచనం ఆధారంగా)
--డీ. వీ ఆర్ భాస్కర్

(చదవండి: అలవాటుని అధిగమించటం అతికష్టం!)

మరిన్ని వార్తలు