గురకతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ఎన్నో? ఒక్కోసారి మరణానికి దాతీయొచ్చు!

26 Nov, 2023 08:22 IST|Sakshi

నిద్రలో కొంతమందికి గురక వస్తుంది. గురక మంచి నిద్రకు సూచన అని  చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. నిద్రలో అన్ని కండరాల్లాగే గొంతు కండరాలూ రిలాక్స్‌ అవుతాయి. దాంతో ఊపిరితిత్తులకు వెళ్లే నాళం ముడుచుకుపోయినట్లుగా (ఫ్లాపీగా) అవుతాయి. అందులోంచి గాలి వెళ్తున్నప్పుడూ, అంగిలికి తాకినప్పుడూ... అందులో ప్రకంపనలు కలిగి, గురక వస్తుంది. ఇలా గురక వస్తూ వాయునాళంలోంచి పది సెకండ్లకు పైగా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకపోతే... ఆ కండిషన్‌ను ‘ఆప్నియా’ అంటారు.

అప్పుడు తగినంత ఆక్సిజన్‌ అందకపోవడంతో పాటు కార్బన్‌ డై ఆక్సైడ్‌ మోతాదులు పెరుగుతాయి.. దాంతో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందక, రాత్రిళ్లు నాణ్యమైన నిద్రలేక, పగలంతా జోగుతూ ఉంటారు. ఫలితంగా రక్తపోటు పెరగడం, డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో చక్కెరలు నియంత్రణలో ఉండకపోవడం, పక్షవాతం, ఆస్తమా, సీవోపీడీ జబ్బు ఉన్నవాళ్లలో వాటి తీవ్రత పెరగడం, గుండెజబ్బులు రావడం వంటి సమస్యలూ వస్తాయి. ఒక్కోసారి స్లీప్‌ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలూ మరణానికి దారితీసే అవకాశాలూ లేకపోలేదు.  

ఆప్నియాను నివారణకు పాటించాల్సిన సూచనలివి... 

  • మంచి జీవనశైలి అలవాట్లతో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు.
  • స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి.
  • ఆల్కహాల్‌ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి.

అలవాటు మానేయలేకపోతే...  నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అయితే ఇలా మానకపోవడం చాలామందిలో ప్రమాదకరంగా పరిణమించిన దాఖలాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయడమే మంచిది.  

(చదవండి:  కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..    )                              ∙ 

మరిన్ని వార్తలు