అడవుల్లో ఉండిపోయింది

11 Jun, 2022 04:13 IST|Sakshi

‘ఒక సమయం వస్తుంది. ఈ నగరాలకు దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. కాకుంటే నేను ఆ పిలుపు ముందు విన్నాను’ అంటుంది 35 కావ్య. నోయిడాలో ఫ్యాషన్‌ ఉత్పత్తుల రంగంలో పని చేసిన కావ్య గత పదేళ్లుగా సెలవుల్లో భారతీయ పల్లెలను తిరిగి చూస్తూ తన భవిష్యత్తు పల్లెల్లోనే అని గ్రహించింది. ‘ఒరిస్సా అడవులకు మారిపోయాను. ఈ ఆదివాసీల కోసం పని చేస్తాను’ అంటోంది కావ్య. ఆమెలా బతకడం ఎందరికి సాధ్యం.

చుట్టూ దట్టమైన అడవులు. అమాయకంగా నవ్వే ఆదివాసీలు. స్విగ్గి, జొమాటో, అమెజాన్‌ల గోల లేకుండా దొరికేది తిని సింపుల్‌గా జీవించే జీవనం, స్వచ్ఛమైన గాలి, స్పర్శకు అందే రుతువులు... ఇంతకు మించి ఏం కావాలి. నగరం మనిషి సమయాన్ని గాయబ్‌ చేస్తోంది. మరో మనిషిని కలిసే సమయం లేకుండా చేస్తుంది. కాని పల్లెల్లో? సమయమే సమయం. మనుషుల సాంగత్యమే సాంగత్యం. ‘ఆ సాంగత్యం అలవాటైన వారు అడవిని వదల్లేరు’ అంటుంది కావ్య సక్సెనా. 35 ఏళ్ల కావ్య ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దులో ఉండే కోరాపుట్‌ ప్రాంతంలో సెటిల్‌ అయ్యింది. ఒక్కత్తే. అక్కడి పల్లెల్లో ఆమె నివాసం. ఆ ఊరివాళ్లే ఆమె మనుషులు. అక్కడి ఆహారమే ఆమె ఆహారం. కాని ఆ జీవితం ఎంతో బాగుంటుంది అంటోంది కావ్య.

నోయిడా నుంచి
జైపూర్‌లో జన్మించిన కావ్య చదువు కోసం అనేక ప్రాంతాలు తిరిగింది. కొన్నాళ్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో పని చేసింది. ఆ తర్వాత నోయిడాలో ఫ్యాషన్‌ ఉత్పత్తుల కార్పొరెట్‌ సంస్థకు మారింది. అయితే ఎక్కడ పని చేస్తున్నా పల్లెలను తిరిగి చూడటం ఆమెకు అలవాటు. ‘అందరూ అందమైన బీచ్‌లను, టూరిస్ట్‌ ప్లేస్‌లను చూడటానికి వెళతారు. నేను కేవలం పల్లెటూళ్లు చూడటానికి వెళ్లేదాన్ని. పల్లెల్లో భిన్నమైన జీవితం ఉంటుంది. అది నాకు ఇష్టం’ అంటుంది కావ్య. అయితే 2020లో వచ్చిన లాక్‌డౌన్‌ ఆమె కాళ్లకు బేడీలు వేసింది.

అక్టోబర్‌లో ఆంక్షలు సడలింపు మొదలయ్యాక ‘మహీంద్రా’ వారితో కలిసి ‘కావ్యాఆన్‌క్వెస్ట్‌’ అనే సోలో ట్రిప్‌కు బయలుదేరింది. దీని ఉద్దేశ్యం పల్లెల్లో ఉండే హస్తకళలను డాక్యుమెంట్‌ చేయడమే. ఆ దారిలో ఆమె అనేక పల్లెల్లో గ్రామీణులు, ఆదివాసీలు చేసే హస్తకళలను గమనించింది. ‘కాని వాటిని మార్కెట్‌ చేసే ఒక విధానం మన దగ్గర లేదు. పల్లెల్లోని ఉత్పత్తులకు పట్నాల్లోని మార్కెట్‌కు చాలా గ్యాప్‌ ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలి అనిపించింది’ అంది కావ్యా. ఇక ఆమెకు జీవిత గమ్యం అర్థమైంది. ‘నగరానికి తిరిగి వచ్చాక నాకు ఊపిరి ఆడలేదు. జూలై 2021లో ఇక నేను శాశ్వతంగా నగరానికి వీడ్కోలు చెప్పేశాను. ఒరిస్సాల్లోని ఈ అడవులకు వచ్చి ఉండిపోయాను’ అంటుంది కావ్య.

క్రాఫ్ట్‌ టూరిజం
ఇది కొత్తమాటగా అనిపించవచ్చు. కాని హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా ప్రోత్సహించడమే క్రాఫ్ట్‌ టూరిజం. కావ్య ఇప్పుడు కోరాపుట్‌ ప్రాంతంలోని నియమగిరి కొండల దగ్గర నివశిస్తోంది. ఆ ప్రాంతంలో డోంగ్రియా తెగ ఆదివాసీలు ఎక్కువ. ‘వారు గడ్డితో చాలా అందమైన వస్తువులు చేస్తారు. అవి బాగుంటాయి. అంతేకాదు వారు 47 రకాల బియ్యాన్ని పండిస్తారు. వారి వంటలు మధురం. అవన్నీ నగరాల్లో ఎక్కడ తెలుస్తాయి. ఈ తెగవారు ‘కపడగంధ’ అనే శాలువాను అల్లుతారు. అది చాలా బాగుంటుంది. చెల్లెలు శాలువా అల్లి అన్నకు ఇస్తే అన్న తాను వివాహం చేసుకోదలిచిన అమ్మాయికి దానిని బహుమతిగా ఇస్తాడు.

ఆ శాలువాలకు మంచి గిరాకీ ఉంది’ అంటుంది కావ్య.  అయితే గ్రామీణ హస్తకళల ఉత్పత్తుల పేరుతో మార్కెట్‌లో డూప్లికేట్లు ఉండటం గురించి ఆమెకు బెంగ ఉంది. ‘ఒరిజినల్‌ ఉత్పత్తులను కస్టమర్లకు అందించడానికి ‘క్రాఫ్ట్‌ పోట్లీ’ అనే సంస్థ స్థాపించి పని చేస్తున్నాను. ఒక గ్రామాన్ని నా వంతుగా దత్తత చేసుకున్నాను. ఆ గ్రామంలో ఉండే 50 మంది మహిళలకు హస్తకళల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాను’ అంది కావ్య. ఈమె చేస్తున్న పని చూసి హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తమ హస్తకళల ప్రమోషన్‌కు ఆహ్వానించింది. అక్కడి ఆదివాసీలను తరచూ కలిసి వస్తోంది కావ్య. త్వరలో ఆమె దేశంలోని అందరు ఆదివాసీలను ఒక ప్లాట్‌ఫామ్‌ మీదకు తెచ్చినా ఆశ్చర్యం లేదు.
ఎందరో మహానుభావులు అని మగవాళ్లను అంటారు. కాని ఎందరో మహా మహిళలు. కావ్య కూడా ఒక మహా మహిళ.

మరిన్ని వార్తలు