పొరుగింట్లో అల్లాను చూసింది

31 May, 2022 00:28 IST|Sakshi
కేరళ మంత్రి వీణా జార్జ్‌కి తమ ఇంటి పత్రాలు అందజేస్తున్న జాస్మిన్, హనీఫా

హజ్‌ చేయడాన్ని ముస్లింలు జీవిత పరమావధిగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఇందుకోసం కలలు కనే పెద్దలు లక్షల్లో ఉంటారు. కేరళకు చెందిన జాస్మిన్‌కు 28 సెంట్ల భూమి (1350 గజాలు) ఉంది. దాన్ని అమ్మి భర్తతో హజ్‌కు వెళ్లాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. కాని ఆ సమయంలో ఆమె దృష్టి పొరుగింటిపై పడింది.

ఆ ఇంట్లో ఉంటున్న నిరుపేదలు సొంతిల్లు లేక అవస్థ పడుతూ కనిపించారు. పొరుగువారికి సాయం చేయమనే కదా అల్లా కూడా చెప్పాడు అని హజ్‌ను మానుకుంది. తన స్థలం మొత్తాన్ని కేరళ ప్రభుత్వం చేపట్టిన నిరుపేదల గృహపథకానికి ఇచ్చేసింది. కొందరు పొరుగువారిలో దేవుణ్ణి చూస్తారు. మానవత్వమే దైవత్వం అని చాటి చెబుతారు.

బాల సాహిత్యంలో ఈ కథ కనిపిస్తుంది.
అరేబియాలోని ఒక ఊళ్లో చాలా పేద కుటుంబం ఉంటుంది. ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారి ఆడపిల్లలకు ఆ వేళ చాలా ఆకలిగా ఉంటుంది. తల్లికి ఏం వండి పెట్టాలో తెలియదు. ఇంట్లో ఒక్క నూక గింజ కూడా లేదు. పని వెతుక్కుంటూ దేశం మీదకు వెళ్లిన తండ్రి ఏమయ్యాడో ఏమో. ఆకలికి తాళలేని ఆ పిల్లలు ఏం చేయాలో తోచక వీధిగుండా నడుచుకుంటూ వెళుతుంటే ఒక పిట్ట చచ్చిపడి ఉంటుంది.

ఇస్లాంలో చనిపోయిన దానిని తినడం ‘హరాం’ (నిషిద్ధం). కాని విపరీతమైన ఆకలితో ఉన్న ఆ పిల్లలు ఆ చనిపోయిన పిట్టను ఇంటికి తీసుకొస్తే తల్లి చూసి ‘అయ్యో... బంగారు తల్లులూ మీకెంత ఖర్మ పట్టింది’ అని వేరే గత్యంతరం లేక ఆ  పిట్టనే శుభ్రం చేసి, పొయ్యి రాజేసి, సట్టిలో ఉప్పుగల్లు వేసి ఉడికించడం మొదలెడుతుంది. ఆశ్చర్యం... సట్టిలో నుంచి ఎలాంటి సువాసన రేగుతుందంటే చుట్టుపక్కల వాళ్లందరికీ ‘ఆహా.. ఎవరు ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనిపించింది.

ఈ పేదవాళ్ల ఇంటి పక్కనే ఉన్న షావుకారు భార్యకు కూడా అలాగే అనిపించి, కూతురిని పిలిచి ‘పొరుగింట్లో ఏదో ఒండుతున్నారు. అదేమిటో కనుక్కునిరా’ అని పంపిస్తుంది. షావుకారు కూతురు పొరుగింటికి వచ్చి ‘ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనడిగితే ‘చచ్చిన పిట్టను వండుకుని తింటున్నాం’ అని చెప్పడానికి నామోషీ వేసిన ఆ తల్లి ‘మీకు హరాం (తినకూడనిది)... మాకు హలాల్‌ (తినదగ్గది) వండుతున్నాం’ అంటుంది. వెనక్కు వచ్చిన షావుకారు కూతురు అదే మాట తల్లితో అంటే ఆమెకు కోపం వస్తుంది.

‘అరె... వారు తినదగ్గది మేము తినకూడనిది ఏముంటుంది’ అని భర్తకు కబురు పెట్టిస్తుంది. భర్త రాగానే పొరుగింటి అవమానాన్ని చెప్పి ‘వారేదో తినదగ్గది తింటున్నారట... మనం దానిని తినకూడదట... ఏంటది’ అని కోపం పోతుంది. భర్త ఆలోచనాపరుడు. పొరుగింటికి వెళ్లి ఆరా తీస్తే ఆ పేదతల్లి ‘అయ్యా... మీరు షావుకార్లు. చచ్చినవాటిని తినకూడదు. హరాం. మేము పేదవాళ్లం.

ఆకలికి తాళలేక అలాంటివి తినొచ్చు. హలాల్‌. అందుకనే అలా చెప్పాను’ అని కన్నీరు కారుస్తుంది. ఆ సమయానికి ఆ షావుకారు హజ్‌కు వెళ్లడానికి సిద్ధం అవుతూ ఉంటాడు. అతడు తన హజ్‌ డబ్బు మొత్తాన్ని ఆ పేదరాలికి ఇచ్చి హజ్‌ మానుకుంటాడు. కాని ఆ సంవత్సరం హజ్‌కు వెళ్లిన ఇరుగుపొరుగు వారికి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆ షావుకారు కనిపించి ఆశ్చర్యం వేస్తుంది. అంటే వెళ్లిన పుణ్యం దక్కిందని అర్థం. అదీ కథ.

కేరళలో అచ్చు ఇలాగే జరిగింది. అక్కడి పత్థానంతిట్ట జిల్లాలోని అరన్‌మలలో 48 ఏళ్ల జాస్మిన్‌కు ఎప్పటి నుంచో హజ్‌కు వెళ్లాలని కోరిక. భర్త హనీఫా (57) కు కూడా అదే కల. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి కావలసినంత డబ్బు లేదు. జాస్మిన్‌కు తండ్రి నుంచి సంక్రమించిన 28 సెంట్ల భూమి అదే ఊళ్లో ఉంది. దానిని అమ్మి ఆ డబ్బుతో హజ్‌కు వెళ్లాలని భార్యాభర్తలు నిశ్చయించుకున్నారు. ఈలోపు కోవిడ్‌ వచ్చింది.

చాలామంది కష్టాలు పడ్డారు. జాస్మిన్‌ ఇరుగుపొరుగున అద్దె ఇళ్లల్లో నివసించే మధ్యతరగతి వారు అద్దె చెల్లించలేని ఆర్థిక కష్టాలకు వెళ్లారు. తినడానికి ఉన్నా లేకపోయినా నీడ ఉంటే అదో పెద్ద ధైర్యం అని వారి మాటలు జాస్మిన్‌ను తాకాయి. అదే సమయంలో కేరళలో ‘లైఫ్‌ మిషన్‌’ పేరుతో పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చే పథకం మొదలైంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రజలను కూడా స్థలాలు ఇమ్మని కోరింది.

జాస్మిన్‌ భర్తతో చర్చించి ‘పేదల ఇళ్ల కోసం మన స్థలం ఇస్తే అల్లా కూడా సంతోషపడతాడు’ అని చెప్పి, హజ్‌ యాత్ర మానుకుని, ఆ స్థలాన్ని ప్రభుత్వ పరం చేసింది. మొన్నటి ఆదివారం కేరళ ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జి స్వయంగా జాస్మిన్‌ ఇంటికి వచ్చి ఆమెను అభినందించింది. జాస్మిన్, హనీఫా చూపిన ఔదార్యానికి ప్రశంసలు లభిస్తున్నాయి.
అన్నట్టు హజ్‌కు వెళ్లాలని వెళ్లలేకపోయిన వృద్ధ జంట కథతో 2011లో మలయాళంలో తీసిన ‘అడమింటె మకన్‌ అబు’ సినిమా ప్రశంసలు అందుకుంది. అందులో ముఖ్యపాత్రలో నటించిన సలీం కుమార్‌కు జాతీయ అవార్డు దక్కింది. మన తెలుగు జరీనా వహాబ్‌ది మరో ముఖ్యపాత్ర. కేరళలో ఇప్పుడు ఈ సినిమాను కూడా గుర్తు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు