AR Rahman: 'ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’

30 Jun, 2021 11:38 IST|Sakshi

‘ఇప్పటివరకూ చాలా విన్నారు ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’ అని భూమి తల్లి పిలుస్తోంది. ‘ఈ జగతి ఆశతో నిండి ఉంది. ఈ నేల నీలిమతో నిండి ఉంది. హాయిగా ఊపిరి పీల్చుకోండి. స్వస్థత పడండి’ అని చెబుతోంది. మహమ్మారి రోజులలో మనుషులకు స్థయిర్యం ఇచ్చేందుకు గుల్జార్‌ రాసిన ‘మేరి పుకార్‌ సునో’ పాటను రహమాన్‌ కంపోజ్‌ చేశారు. ఆరుగురు గాయనులు గానం చేశారు. ఈ కాలానికి అవసరమైన గీతం ఇది.

కరోనా మహమ్మారి వేళ ప్రజలందరూ ధైర్యాన్ని కోల్పోయారు. స్థయిర్యాన్ని జార్చుకున్నారు. వారిని తిరిగి వారిలా చేయాలి. అందుకు అమ్మే పూనుకోవాలి. అలా భూమి తల్లి తన పిల్లలకు ధైర్యం చెప్పడానికి పిలుస్తున్న పిలుపునే ‘మేరి పుకార్‌ సునో’ పాటగా ఆస్కార్‌ అవార్డు గ్రహీత గుల్జార్‌ రాశారు. మరో ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రహమాన్‌ ట్యూన్‌ చేశారు. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన గాయనీమణులు– అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషాల్, సాధనా సర్గం, చిత్ర, షాషా తిరుపతి, అసీస్‌ కౌర్‌ ఆ భూమితల్లికి గొంతునిచ్చారు. సోనీ మ్యూజిక్‌ ఈ పాటను విడుదల చేసింది.

ఈ వెలుతురు తీసుకోండి
గుల్జార్‌ ఈ పాటను గొప్పగా రాశారు. ‘నా నేల మీది బతికే పిల్లలారా... నా మాట వినండి... ఇప్పటి దాకా చాలా విన్నారు... ఈసారి నన్ను వినండి’ అనే పల్లవితో మొదలెట్టారు. చరణంలో భూమి తల్లి చేత ‘సూర్యుని దగ్గర ఎంతో వెలుతురు ఉంది. తీసుకొని పంచుకోండి. ఆకాశం నిండా గాలే. గుండెల నిండా పీల్చుకోండి’... అని అనిపిస్తారు. రెండో చరణంలో ‘ఈ అనంత విశ్వంలో ఈ భూమి ఒక్కటి మీది... ఎన్ని మోకరింపులు ఎన్ని ప్రార్థనలో దీని మీద... జీవితం చాలా ఉంది... మీ మీ మట్టి పొత్తిళ్లను జీవితంతో నింపుకోండి’... అని రాశారు. ఇలా పాటంతా భూమి తన పిల్లలతో మాట్లాడుతుంది.

ఏమిటి సందేశం?
ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళన ఉంది. ప్రతి ఒక్కరిలో సంవేదన ఉంది. అయినా పర్వాలేదు. అందరం ఒక్కతాటిపై రావచ్చు. ఒకరికి ఒకరు తోడుగా నిలవచ్చు. ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు. మళ్లీ జీవితాన్ని నిర్మించుకోవచ్చు... మానవులు ఎన్నో కష్టాలు దాటి వచ్చారు... ఈ కష్టం కూడా దాటేస్తారు... అందుకు భూమి తల్లే సాక్ష్యం... అని ఈ పాట చెబుతోంది. ‘ఈ పాట ఒక స్వాంతనం... ఓదార్పు. భూమి తల్లి తన కూతుళ్ల (గాయనుల) ద్వారా జనంతో మాట్లాడుతోంది. ఆమె గొంతును మహిళా సింగర్లు తప్ప ఇంకెవరు వినిపించగలరు. గుల్జార్‌ గారూ నేను కలిసి చేసిన ఆలోచన ఈ పాట’ అని దీనిని కంపోజ్‌ చేసిన ఏ.ఆర్‌.రహమాన్‌ అన్నారు. ‘ఈ నేల మన నుంచి వాగ్దానం అడుగుతోంది... జీవితాన్ని కోల్పోవద్దని. మనమంతా భూమికి వాగ్దానం చేయాలి... అవును.. మేము లేచి నిలబడతాం... ఈ గాలులు వీచనిస్తాం... ఈ కెరటాలు విరిగి పడుతూనే ఉండేలా చూస్తాం అని చెప్పాలి. ఆ మాటలే పాటలో రాశాను’ అంటారు గుల్జార్‌.

బాధను మర్చిపోవడానికి
‘ఈ లాక్‌డౌన్‌ల కాలంలో ఇంట్లోనే ఉండటం కొన్నాళ్లు బాగానే ఉండింది. కాని ఆ తర్వాత బాధ మొదలైంది’ అంటారు చిత్ర. ఆమె ‘మేరి పుకార్‌ సునో’ పాటలో దక్షణాది ప్రతినిధిగా కనిపిస్తారు. ‘నేను ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను. ఎందుకంటే నా కూతురు నందన (మరణించింది) జ్ఞాపకాలు చుట్టుముడతాయి’ అంటారామె. ‘నాలాగే ఎందరో ఈ కరోనా కాలంలో ఎంతో బాధను, కష్టాన్ని భరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ పాటలాంటిది ఒక పెద్ద ఓదార్పు. రహమాన్‌ ఎప్పుడు పాడమన్నా నేను మూడు నాలుగు రకాలుగా పాడి వినిపిస్తాను. ఈసారి నేరుగా రికార్డింగ్‌ లేదు. ఇంటి నుంచి పాడి పంపించాను.’ అన్నారు చిత్ర. ‘అయినవారిని కోల్పోవడం కంటే మించిన బాధలేదు. నా కూతురు మరణించాక అలాంటి దుఃఖమే ఎదురైన వారు నా దగ్గరికొచ్చి ఆ బాధ ఎలా మర్చిపోవాలో చెప్పమ్మా అని అడుగుతుంటారు. నేనేం చెప్పగలను? పనిలో పడితే అదే కొంచమైనా తగ్గుతుంది అంటాను. నా కూతురు పోయిన దుఃఖాన్ని పనిలో పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాను. కాని అప్పుడప్పుడు కడుపు భగ్గుమన్న భావన కలుగుతూనే ఉంటుంది’ అంటారు చిత్ర. కష్టకాలంలో కళే మనిషికి ఓదార్పు. ఈ సమయంలో ఇలాంటి పాట స్త్రీల గొంతుక నుంచి వినడం నిజంగానే ఒక అమ్మ నుంచి విన్న నిశ్చింత. తల్లి ఒడిలో తల పెట్టుకున్నంత నెమ్మది. ఇక ఏ భయం లేదన్న దిటవు. ఆ దిటవే ఇప్పుడు కావాలి.
– సాక్షి ఫ్యామిలీ 

మరిన్ని వార్తలు