వెండితెరపై ‘చిత్రహింసల కొలిమి’

30 Jun, 2021 00:13 IST|Sakshi

నేరాలే జీవితమైనవారి సంగతేమో గానీ... తెలిసో, తెలియకో, పెత్తందార్ల, గిట్టనివారి కుట్రల ఫలితం గానో జైలుకు పోక తప్పని స్థితిలో పడినవారి బతుకు దుర్భరమైనది. అయినవాళ్లకి దూరంగా, మొత్తం సమాజానికే దూరంగా జైలుపాలు కావడం... కేసు ఎటూ తెమలక దీర్ఘకాలం అందులోనే మగ్గడం ఆ వ్యక్తికీ, సమాజానికీ కూడా విషాదకరమైనదే. జైలు గోడల వెనక ఏం జరుగుతున్నదో దశాబ్దాలుగా చాలామంది చెప్పారు. మున్ముందు కూడా చెబుతారు. కానీ మూడు నెలలక్రితం అంతర్జాతీయంగా విడుదలై పెను సంచలనం సృష్టిస్తున్న ‘ద మారిటేనియన్‌’ చిత్రం ఒక భయానకమైన జైలు జీవితాన్ని కళ్లముందు పరిచింది. దానికి మూలమైన ‘గ్వాంటనామో డైరీ’ ఒక దురదృష్టవంతుడి చేదు జ్ఞాపకాల సమాహారం. 

పశ్చిమాఫ్రికా దేశమైన మారిటేనియాలో పుట్టి, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ... ముజాహిదీన్‌గా మారి, ఉగ్రవాదిగా ముద్రపడి 2002 ఆగస్టులో అరెస్ట యిన మహమ్మద్‌ స్లాహీ 14 ఏళ్లపాటు అనుభవించిన నరకయాతనలు ఈ చిత్రం ఇతివృత్తం. క్యూబాలో తన అధీనంలో వున్న గ్వాంటనామో తీరంలో అమె రికా నిర్మించిన నిర్బంధ శిబిరం నిజానికి చిత్ర హింసల కొలిమి. ఖైదీలను మానవమాత్రులుగా గుర్తించకపోవటం, రోజుల తరబడి ఇంటరాగేషన్‌ లతో వేధించటం దాని ప్రత్యేకత. 2005లో జైల్లో ఉంటున్నప్పుడే స్లాహీ ‘గ్వాంటనామో డైరీ’ పేరిట తన అనుభవాలు రికార్డు చేశాడు. చిత్రమేమంటే స్లాహీ ముజాహిదీన్‌గా మారింది అమెరికా చలవ తోనే! ఆనాటి సోవియెట్‌ యూనియన్‌ దన్నుతో అఫ్ఘానిస్తాన్‌లో పాలకుడైన నజీబుల్లాను గద్దె దించటం లక్ష్యంగా అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు వెనకబడిన దేశాల్లోని అమాయక ముస్లిం యువకు లను మతంపేరిట రెచ్చగొట్టి, వారిని అఫ్ఘాన్‌లో తిరుగుబాటుకు ప్రేరేపించిన కాలమది. నజీబుల్లాను గద్దె దించటం ఒక పవిత్ర కార్యమని నమ్మించి, ఆ యువకులకు స్వాతంత్య్ర సమరయోధులన్న ముద్ర వేసింది ఆ దేశాలే. అల్‌ కాయిదా పుట్టుకకూ, దాని ఎదుగుదలకూ తోడ్పడి, వారికి ఆయుధాలు, శిక్షణ అందించిన పాపం కూడా వారిదే.

కానీ నజీబుల్లా పదవీభ్రష్టుడయ్యాక అఫ్ఘాన్‌ సహజ వనరులపై కన్నుపడిన పాశ్చాత్య దేశాలకూ, అల్‌ కాయిదాకూ చెడింది.  ఆ క్రమంలో 2001 అమె రికాలో వందలాదిమంది మరణానికి కారణమైన ఉగ్ర దాడితో సీఐఏ వేట మొదలైంది. పాశ్చాత్య దేశాలతో అల్‌ కాయిదా సంబంధాలు బాగున్న రోజుల్లో ఉప యోగించిన ఫోన్‌ స్లాహీపై నేరగాడన్న ముద్రకు కారణమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ ‘ప్రత్యేక ఇంటరాగేషన్‌’కు అనుమతిం చిన 14 మంది ‘హై వేల్యూ’ నిర్బంధితుల్లో స్లాహీ ఒకడు. అతన్ని నిర్బంధించిన సెల్‌ ఒక బాక్సు కన్నా ఎక్కువేం కాదు. అందులో హఠాత్తుగా శీతల వాతా వరణాన్ని సృష్టించటం, నిర్బంధితుడు నిలువెల్లా వణుకుతుంటే నిజం చెప్పమని ఒత్తిడి చేయడం... రోజుకు 18 గంటలపాటు ఏకబిగిన ప్రశ్నించటం, కొన్నిసార్లు 24 గంటలూ కొనసాగించటం, రాత్రుళ్లు నిద్రపోకుండా చూడటం అక్కడి సైనికులకు నిత్య కృత్యం. తిండికి దూరం చేయటం, ఆకలితో అల్లాడు తున్నప్పుడు దాన్ని అందించటం, తినబోతే అడ్డు కోవటం కూడా మామూలే. నాలుగేళ్లపాటు ఇవన్నీ భరించి, గత్యంతరంలేక ‘నేరాన్ని’ అంగీకరించ టంతో అతనికి విముక్తి లభించింది. తన అనుభవా లను గ్రంథస్తం చేయడానికి 2005లో అనుమతి దొరి కింది. అంతా అయ్యాక  2015లోగానీ ప్రచురణకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత మరో ఏడాదికి ఏ కేసు లోనూ నేరారోపణలు రుజువు కాకపోవటంతో స్లాహీ నిర్దోషిగా విడుదలయ్యాడు. కానీ ఈలోగా అతను సాగించిన న్యాయ పోరాటం సుదీర్ఘమైనది. తనకు అండగా నిలిచిన న్యాయవాదినే వివాహం చేసుకుని ఇప్పుడు జర్మనీలో ఉంటున్నాడు. 14 ఏళ్ల కారాగార వాసం వ్యక్తిగా స్లాహీని ఛిద్రం చేయలేకపోవటం అతని అదృష్టం. కానీ అందరికీ అది దక్కలేదు. కొందరు పిచ్చివాళ్లుగా మారితే, మరికొందరు మృత్యు ఒడికి చేరారు. ప్రజాస్వామిక వ్యవస్థల డొల్లతనాన్ని ప్రశ్నిస్తు న్నట్టుగా ఇంకా గ్వాంటనామో బేలో 40 మంది నిర్బం ధితులున్నారు. ఒక్కో సెల్‌కు ఒక్కో పేరు! స్లాహీని నాలుగేళ్లు నిర్బంధించిన సెల్‌ పేరు ‘క్యాంప్‌ ఇండియా’. ఈ నామకరణం చేసిన వారెవరో తెలిస్తే, దాని వెనకున్న కథేమిటో వెల్లడవుతుంది. 
– తరణి.టి 

మరిన్ని వార్తలు