వినూత్న ఆలోచన: పాత చీరలతో కొత్త పుంతలు!

22 Jun, 2021 10:33 IST|Sakshi

పంట పొలంలో నీటి వాడకాన్ని తగ్గించడంతోపాటు.. మొక్కల చుట్టూ మట్టి ఎండకు ఎండకుండా.. వానకు తడిసి కొట్టుకుపోకుండా రక్షించుకోవడానికి ఆచ్ఛాదన (మల్చింగ్‌) కల్పించటం ఉత్తమం. కొన్నాళ్లకు కుళ్లి మట్టిలో కలిసిపోయే పంటల వ్యర్థాలను ఆచ్ఛాదనగా వాడటం సాధారణంగా రైతుల పొలాల్లో కనిపిస్తూ ఉంటుంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులతో పాటు రసాయన వ్యవసాయం చేసే రైతులు సైతం మల్చింగ్‌ చేస్తూ ఉంటారు. అయితే, ఆచ్ఛాదనగా వాడే పంట వ్యర్థాల సేకరణ, లభ్యత, నిర్వహణలో ఇబ్బందుల కారణంగా ప్లాస్టిక్‌ మల్చింగ్‌ షీట్‌ వాడకం విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది. ప్లాస్టిక్‌ షీట్‌తో మల్చింగ్‌ చేయటం ఆర్థికంగా రైతుకు భారమే కాకుండా పర్యావరణపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కాబట్టి, దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని అనేక విధాలుగా ప్రయత్నించే రైతులు వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇద్దరు ఉన్నారు. అటువంటి కోవకు చెందిన మొదటి మహిళా ప్రకృతి వ్యవసాయదారు ఇసుకపల్లి నారా సుబ్బమ్మ (72889 82960). ఒంటిమిట్ట మండలంలోని మల్కాటిపల్లి గ్రామంలో ఆమె గత (2020–21) రబీ సీజనులో ఒక ఎకరా విస్తీర్ణంలో బంతి, చామంతి, మిరప పంటలలో పాత కాటన్‌ చీరలను ఆచ్ఛాదనగా తొలిసారి వినియోగించి మంచి ఫలితాలు సాధించారు. కలుపు నివారణ ఖర్చులు బాగా తగ్గాయని ఆమె తెలిపారు. అదే మాదిరిగా బొచ్చు వీరమోహన్‌ కూడా మార్కెట్‌లో అతి తక్కువ ధరకు దొరికే పాత నూలు (కాటన్‌) చీరలను టమాటో తోటలో మల్చింగ్‌ చేస్తూ చక్కని ఫలితాలు పొందుతున్నారు. 

వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు మండలం మిట్టమానిపల్లె గ్రామానికి చెందిన వీరమోహన్‌ గత ఏడాది నుంచి పాత చీరలను ఆచ్ఛాదనగా వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకార ప్రకృతి వ్యవసాయ విభాగం ఐసీఆర్‌పి రామానందరెడ్డి సహకారంతో ఈ వినూత్న ఆలోచనను ఆయన ఆచరణలో పెట్టారు. గత ఏడాది 20 సెంట్ల స్థలంలో పాత కాటన్‌ చీరతో మల్చింగ్‌ చేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో టమాటో సాగు చేసి సత్ఫలితాలు పొందారు. ఆ స్ఫూర్తితో ఈ ఏడాది తొలకరి వానలు పడగానే అరెకరం పొలంలో ఎత్తు మడులపై పాత నూలు చీరలను ఆచ్ఛాదనగా కప్పి టమాటో మొక్కలు నాటారు. 

చీరను ఒకసారి వేస్తే ఏడాది వరకు కలుపు ఇబ్బంది ఉండదని, ప్లాస్టిక్‌ షీట్‌ వేసినప్పటి కన్నా చీరను వాడటం వల్ల దిగుబడి కూడా పెరిగిందని అంటున్నారు వీరమోహన్‌. రైతాంగానికి పర్యావరణ హితమైన కొత్త మల్చింగ్‌ విధానాన్ని పరిచయం చేసిన ఏపీసీఎన్‌ఎఫ్‌ సిబ్బందికి, కొత్త పుంతలు తొక్కుతున్న ప్రకృతి వ్యవసాయదారులు సుబ్బమ్మ, వీరమోహన్‌లకు ‘సాక్షి సాగుబడి’ శుభాభినందనలు తెలుపుతోంది!
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ప్లాస్టిక్‌ షీట్‌ ‘వర్సెస్‌’ పాత చీర
► ఎకరానికి ఎత్తు మడులపై పంటకు మల్చింగ్‌ చేసే స్థలం 2,400 మీటర్లు. 
► ప్లాస్టిక్‌ షీట్‌ (21 మైక్రాన్స్‌) ఒక మీటరు ధర రూ. 4.50. ఎకరానికి ఖర్చు రూ. 10,800. 
► పాత నూలు చీర (6 మీటర్లు) ధర రూ. 15. మీటరు పాత చీర ఖర్చు రూ. 2.50. ఎకరానికి ఖర్చు రూ. 6 వేలు. 
► పాత చీరతో మల్చింగ్‌ వల్ల ఖర్చు ఎకరానికి సుమారు రూ.5 వేలు తగ్గించుకోవచ్చు. పంట పొలాన్ని ప్లాస్టిక్‌ కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చు. 
► ప్లాస్టిక్‌ షీట్‌ మట్టిలో కలిసిపోవడానికి సుమారు 60 నుంచి 80 ఏళ్లు పట్టవచ్చు. పంట ముగిసిన తర్వాత ప్లాస్టిక్‌ షీట్‌ ముక్కలను పూర్తిగా ఏరెయ్యడానికి వీలుకాదు. చిన్న ముక్కల్ని వేరటం కష్టం. 
► ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలు పొలంలో వాన నీరు ఇంకకుండా, పంట మొక్కల వేరు వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది. 
► పాత చీరలు, గోనె సంచులు, పంట వ్యర్థాలను మల్చింగ్‌ కోసం వాడటం వల్ల కలుపు నివారణ జరగడంతోపాటు.. నీటి తేమ మట్టిలో త్వరగా ఆరిపోకుండా ఉంటుంది. 
► పాత కాటన్‌ చీర ఏడాది పాటు పంటలకు మల్చింగ్‌గా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కొంత మేరకు చీకిపోతాయి కాబట్టి తీసేయవచ్చు. కాటన్‌ చీర పేలికలు మట్టిలో మిగిలిపోయినా.. మూడేళ్లలో పూర్తిగా కుళ్లి మట్టిలో కలిసిపోతాయి. 
► వాడేసిన చీరలు ఏ ఊళ్లో అయినా దొరుకుతాయి. కాటన్‌ చీరలే కాదు.. సిల్క్‌ చీరలను కూడా మల్చింగ్‌గా వాడొచ్చు. పంట ముగిసిన తర్వాత సిల్క్‌ చీరను తీసెయ్యటం మరింత సులువు. ఇవి మట్టిలో కలిసిపోవడానికి కాటన్‌ చీర కన్నా మరికొంత ఎక్కువ కాలం పడుతుంది.  

పాత చీరల మల్చింగ్‌తో నికరాదాయం పెరిగింది
టమాటో పంటకు గత నాలుగేళ్లుగా ప్లాస్టిక్‌ మల్చింగ్‌ షీట్‌ను వాడుతున్నాను. పంట అయిపోయిన తర్వాత ప్లాస్టిక్‌ మల్చింగ్‌ షీట్‌ మొత్తాన్ని పొలం నుంచి తొలగించడానికి వీలయ్యేది కాదు. చిరిగిపోయి కొంత భూమిలోనే ముక్కలు ముక్కలుగా మిగిలిపోయేది. ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాలు పొలంలో అలాగే ఉండిపోయేవి. దీని కోసం ఖర్చు కూడా ఎక్కువగా అయ్యేది.

కానీ, గత సంవత్సరం నుంచి ఏపీసీఎన్‌ఎఫ్‌ సిబ్బంది సహకారంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో భాగంగా చీరలతో మల్చింగ్‌ చేయటం ప్రారంభించాను. గత సంవత్సరం 20 సెంట్ల స్థలంలో ప్రారంభించి ఈ సంవత్సరం 50 సెంట్ల స్థలంలో చీరలతో మల్చింగ్‌ చేసి టమాటో మొక్కలు నాటాను. ఈ పద్ధతిలో సాగు చేయటం ద్వారా పంట దిగుబడి పెరిగింది. కాయ నాణ్యత కూడా బాగా వచ్చింది. మల్చింగ్‌ ఖర్చు కూడా తగ్గింది. నికరాదాయం పెరిగింది. 
– బొచ్చు వీరమోహన్‌ (99813 13983), టమాటో రైతు, మిట్టమానిపల్లె, మైదుకూరు మండలం, వైఎస్సార్‌ కడప జిల్లా

రంగు వెలవని కాటన్‌ చీరలు అత్యుత్తమం 
ప్లాస్టిక్‌ షీట్‌ను ఆచ్ఛాదనగా వాడటం వలన భూమి లోపలి పొరల్లో ఉన్న జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది. మొక్క ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మజీవరాశి, వానపాములు నశిస్తాయి. భూమి లోపలి పొరల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకదు. రంగు వెలవని కాటన్‌ చీరలను మల్చింగ్‌గా వాడటం అత్యుత్తమం. 
– ఎం. నాగరాజ (86886 67258), జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్, ఏపీ సహకార ప్రకృతి వ్యవసాయ విభాగం, కడప

మరిన్ని వార్తలు