ఈ చిలగడ దుంపలతో కేన్సర్‌, షుగర్‌ దూరం!

8 Jun, 2021 16:49 IST|Sakshi

ఔషధ విలువలు కలిగిన రెండు సరికొత్త చిలగడ దుంప వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఊదా రంగులో ఉండే సరికొత్త చిలగడదుంప (పర్పుల్‌ స్వీట్‌ పొటాటో– భూకృష్ణ ) కేన్సర్‌ను, షుగర్‌ను అరికట్టే ప్రత్యేకత కలిగి ఉంది. నారింజ రంగులో ఉండే చిలగడ దుంప (ఆరెంజ్‌ స్వీట్‌ పొటాటో–భూసోనా) లో కంటి చూపును మెరుగుపరిచే బీటా కెరొటిన్‌ పుష్కలంగా ఉంది. భువనేశ్వర్‌ (ఒడిశా)లోని కేంద్రీయ దుంప పంటల పరిశోధనా స్థానం(సిటిసిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఏడేళ్లు పరిశోధన చేసి ఈ వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. 

ఊదా రంగులో ఉండే 100 గ్రాముల చిలగడ దుంపలో 90–100 గ్రాముల మేరకు ఆంథోశ్యానిన్‌ వర్ణద్రవ్యం ఉంటుంది. కేన్సర్‌ను అరికట్టే, రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించే లక్షణం కలిగిన యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయని సిటిసిఆర్‌ఐ అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. ఎం. నెడుంజెళియన్‌ చెప్పారు. 100 గ్రాముల నారింజ ‘భూసోనా’ చిలగడ దుంపలో 14 ఎంజిల బీటా–కెరొటిన్‌ ఉందని, క్యారట్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడొచ్చన్నారు. అమెరికా, మెక్సికో ప్రాంతాల నుంచి తెప్పించిన రకాలను స్థానిక వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి చేసి, తాము 2 రెండు విశిష్ట వంగడాలను రూపొందించామన్నారు. 


సాగు విధానం

వీటి సాగు కాలం 100–120 రోజులు. ఎర్ర, దుబ్బ నేలలు అనుకూలం. ఈ దుంప పంటలు మంచి దిగుబడి ఇవ్వాలంటే సగటు ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉండాలి. దుంప పెరిగే కాలంలో రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటే మేలు. 

ఖరీఫ్‌లో వర్షాధారంగా సముద్ర మట్టానికి 400 మీటర్లకన్నా ఎత్తు ఉండే అరకు, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వంగడాలను ఎర్ర, దుబ్బ నేలల్లో సాగు చేయవచ్చు. జూలై 15 వరకు మొక్కలు నాటుకోవచ్చు. హెక్టారుకు 12–15 టన్నుల దిగుబడి వస్తుంది. రబీలో మైదాన ప్రాంతాల్లోని ఎర్ర, దుబ్బ నేలల్లో సెప్టెంబర్‌– అక్టోబర్‌లలో ఈ మొక్కలు నాటుకోవచ్చు. పంట పూర్తయ్యాక తీగ ముక్కలను సేకరించి నర్సరీ పెంచుకోవచ్చు. దుంప ముక్కలతోనూ మొక్కలను పెంచుకొని నాటుకోవచ్చన్నారు డా. నెడుంజెళియన్‌. 


మొక్కలు ఇస్తాం
ఖరీఫ్‌లో సాగుకు భూకృష్ణ, భూసోన రకాల చిలగడదుంప మొక్కలు భువనేశ్వర్‌లోని సిటిసిఆర్‌ఐలో అందుబాటులో ఉన్నాయి. మొక్కలను కొరియర్‌ ద్వారా పంపటం సాధ్యం కాదు. రైతులు స్వయంగా వచ్చి తీసుకెళ్లాలి. జూలై 15 లోగా నాటుకోవచ్చని డా. నెడుంజెళియన్‌ చెప్పారు. రబీలో సాగు కోసం అక్టోబర్‌లో మొక్కలు / విత్తన దుంపలు ఇస్తామని, సాగు పద్ధతులనూ తెలుగులోనే వివరంగా చెబుతామన్నారు. ఊదా, నారింజ రంగుల్లోని చిలగడదుంపలకు విదేశాల్లో గిరాకీ ఉంది. మన దేశంలోనూ ఆదరణ పెరుగుతోందని డా. నెడుంజెళియన్‌ (79784 88514) ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.


భువనేశ్వర్‌లోని సిటిసిఆర్‌ఐ అధిపతి,
ప్రధాన శాస్త్రవేత్త డా. నెడుంజెళియన్‌  

mnedun@gmail.com

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు