మాతృత్వానికే ప్రమాదకారి పీసీఓడీ!

22 Mar, 2021 23:39 IST|Sakshi

ఈ మధ్యకాలంలో టీనేజ్‌ అమ్మాయిల నుంచి వివాహిత స్త్రీల వరకు అందర్ని బాధిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది అండాశయంలో నీటి బుడగల సమస్య. వైద్య పరిభాషలో పీసీఓఎస్‌(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌) లేదా పీసీఓడీ(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌)గా పిలిచే ఈ సమస్యతో ప్రతి పదిమందిలో ఐదుగురు బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవాంఛిత రోమాలతో ఆరంభమై చివరకు మాతృత్వ మధురిమలు దక్కకుండా చేసే ఈ పీసీఓడీపై గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండే మన భారత్‌లో అవగాహన చాలా తక్కువ. కేవలం పట్టణాల్లో ఉండే వారిలో కొందరికి మాత్రమే దీని గురించి కొంచెంకొంచెంగా తెలుసు. పీసీఓడీకి సంపూర్ణ చికిత్స అందుబాటులో లేనందున దీన్ని ఆరంభంలోనే గుర్తించి సరైన చర్యలు తీసుకోవడం ఉత్తమం. అసలు ఈ పీసీఓఎస్‌ అంటే ఏంటీ? ఎందుకు వస్తుంది? రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొవాలి?... చూద్దాం..  

సాధారణంగా ప్రతిస్త్రీలోనూ రుతుక్రమ సమయంలో అండాశయంలో అండం పరిపక్వత చెంది నెలనెలా విడుదల అవుతుంది. నెలసరి తర్వాత 11– 18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు అవసరమయ్యే హార్మోన్‌ ఈస్ట్రోజన్‌. కానీ కొందరు స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని  మేల్‌ హార్మోన్లుగా పిలిచే ‘ఆండ్రోజన్స్‌’ అధికంగా విడుదలవుతాయి. ఇది క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. పీసీఓడీతో బాధపడుతున్న వారిలో విడుదలయ్యే అండం పూర్తిగా ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. ఒక్కోక్కరిలో హర్మోన్ల అసమతుల్యతను బట్టి నీటి బుడగలు(నీటి తిత్తులు) ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలోనూ ఉంటాయి. ఇప్పటివరకు ఈ సమస్య ఎందుకొస్తుందనేది, ఖచ్చితంగా తెలియదు. కానీ టెస్టొస్టిరాన్‌ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల అండాశయంలో అండం విడుదల కాకపోవడం, విడుదలైనా పెరగకపోవడం జరుగుతుంది.

అండాలు.. అండాశయాలు
ప్రతి స్త్రీ శరీరంలో గర్భాశయానికి ఇరుపక్కలా రెండు అండాశయాలు ఉంటాయి. వీటిలో ద్రవంతో నిండిన చిన్న చిన్న సంచుల్లాంటి నిర్మాణాల్లో అండాలు తయారవుతాయి. ఈ సంచులనే వైద్య పరిభాషలో ఫాలిక్యూల్స్‌ అంటారు. ప్రతి నెలా ఒక పాలిక్యూల్‌ ఎదిగి పరిపక్వం చెందిన అండాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన  అండం, వీర్య కణంతో కలిసినప్పుడు ఫలిదీకరణం చెంది, జైగోట్‌ ఏర్పడి తర్వాతి దశలో పిండంగా ఎదుగుతుంది. ఈ ప్రక్రియ జరగని పక్షంలో ఆరోగ్యవంతమైన స్త్రీలకు నెలసరి వస్తుంది. అయితే అండం ఏర్పడి, పూర్తి స్థాయిలో ఎదిగి విడుదలయ్యే ప్రక్రియ మొత్తం హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. ఫాలిక్యూల్‌ ఎదగడానికి, ఆరోగ్యవంతమైన అండం తయారవడానికి హార్మోన్ల పాత్ర కీలకం. మెదడులోని హైపోథలామస్‌ అనే భాగం ఈ హార్మోన్ల విడుదలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

నష్టాలేంటి...
పీసీఓడీ ఉన్నవారిలో ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టిరాన్, ఇన్సులిన్‌ వంటి హార్మోన్లు స్త్రీల ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఊబకాయం, నెలసరి క్రమం తప్పడం, కొందరిలో నెలసరి రెండు లేదా మూడు నెలలకోసారి రావడం, రుతుక్రమ సమయంలో  కొందరిలో అధికంగా రక్తస్రావం జరగడం, మరికొందరిలో సాధారణ స్రావానికంటే కూడా అతితక్కువగా రక్త స్రావం జరుగుతుంది.ఈ సమస్య ఉన్నవారిలో అండం సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల సంతానం కలగడానికి ఇది పెద్ద ఆటకంగా మారుతుంది. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ అధికంగా విడుదలవుతుంది. దీంతో యుక్తవయసులో ఉన్న వారికి మొటిమలు అధికంగా రావడం, జుట్టురాలిపోవడం,  స్త్రీలలో అవాంచిత రోమాలు పెరిగి పురుష లక్షణాలు కనిపిస్తాయి. ఇన్సులిన్‌ హోర్మోన్‌ స్థాయి పెరుగుతుంది. దీంతో శరీరంలో ప్రతికూల వాతావరణంతో  ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడి డయాబెటీస్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలికంగా పీసీఓడీతో బాధపడుతున్న వారిలో టైప్‌–2 డయాబెటిస్‌ (మధుమేహం) వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భం ధరించినప్పుడు మధుమేహం రావడం, కొలెస్ట్రాల్‌ పెరగడం, రక్తపోటు వంటి ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఫలితంగా పీసీఓడీతో బాధపడేవారు ఆత్మవిశ్వాసం కోల్పోయి తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. దీనివల్ల ఇతర రకాల సమస్యలు పెరుగుతాయి.
 

మరిన్ని వార్తలు