ఉత్తమనటి..బ్రహ్మపుత్రిక

1 Jul, 2021 01:46 IST|Sakshi
‘బ్రిడ్జ్‌’ చిత్రం పోస్టర్‌ : నాగలి పట్టిన జానకి పాత్రధారి శివరాణి. ఈ పాత్రకే ఆమెను ఉత్తమ నటి అవార్డు వరించింది.

బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండే ఆ గ్రామంలోని అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు రావు. వరదలు రావడం, గ్రామం కొట్టుకుపోవడం యేటా మామూలే. ఇక ఆ గ్రామానికి, మిగతా ప్రపంచానికీ రాకపోకల కోసం ఒక్క వంతెనైనా లేదు. అలాంటి గ్రామానికి రెండేళ్ల క్రితం ఒక మంచి ‘సంబంధం’ కోసం నానా కాలి బాటల్లో పడి ఒక బృందం వచ్చింది! ఇంటి పని, పొలం పనీ చేయగలదు అనిపించిన 20 ఏళ్ల శివరాణి అనే మొరటు పిల్లను చూసి మరీ ఎంపిక చేసుకుంది. ఆ వచ్చిన వాళ్లు సినిమా వాళ్లు! వారి సినిమా ‘బ్రిడ్జ్‌’లో నటించిన ఆ బ్రహ్మపుత్రిక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటి!

నదికి, నది ఒడ్డున నివాసం ఉన్నవారికి మధ్య ‘బాంధవ్యం’ ఎలా ఉంటుంది? ముంచెత్తే వరదలు సైతం విడదీయలేనంత బలంగా ఉంటుంది. అస్సామీలో వచ్చిన ‘బ్రిడ్జ్‌’ సినిమా కథాంశం ఈ బాంధవ్యమే. బ్రహ్మపుత్ర నదికి ఉత్తరం వైపున బలిగావ్‌ అనే గ్రామం ఉంది. అస్సాంలోని లఖింపూర్‌ జిల్లా పరిధిలోని ధకువాఖన సబ్‌–డివిజన్‌ కిందికి వస్తుంది ఆ గ్రామం. వరదలు వస్తే అసలే లేకుండా పోతుంది! బ్రహ్మపుత్రకు ఏటా వరదలు తప్పవు. బలిగావ్‌ గ్రామానికి ముంపు తప్పదు. వరద తగ్గుముఖం పట్టాక, సూర్యుడు మేఘాల్లోంచి పైకి వచ్చిన విధంగా ఊళ్లోంచి వెళ్లిన వాళ్లు మళ్లీ ఆ ఒడ్డున ఉదయిస్తారు.

పడిపోయిన ఇళ్లను పునర్నించుకుంటారు. అంతే తప్ప ఊపిరి లాంటి ఆ ఊరిని వదిలి ఎక్కడికీ వెళ్లరు. ఊరు నదితో బాంధవ్యం కలుపుకుందనే ఆ ఒక్క కారణంతో ఆ ఊరితో పొరుగూళ్లవారెవరూ సంబంధం కలుపుకోరు! ఇంకో కారణం కూడా ఉంది. బలిగావ్‌కు మిగతా ప్రాంతాలను కలిపే వంతెన లేదు. అలాంటి చోటుకు పిల్లను ఎలా ఇస్తారు? అక్కడి పిల్లను ఎలా తెచ్చుకుంటారు? ఇదంతా సినిమాలో అంతర్లీనంగా ఉండే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది చిత్ర కథ కాదు. ఆ చిత్రంలో ‘జానకి’ ప్రధాన పాత్ర పోషించిన అస్సామీ యువతి శివరాణి కథ. ‘బ్రిడ్జ్‌’ చిత్రం 2020 లో విడుదలైంది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి 28 అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులు వచ్చాయి. తాజాగా కెనడాలో జరిగిన ‘అట్టావా నాల్గవ భారత చలన చిత్రోత్సవం’లో శివరాణిని ‘ఉత్తమ నటి’ అవార్డు వరించింది.
∙∙
‘బ్రిడ్జ్‌’ చిత్రీకరణ జరిగే సమయానికి శివరాణి వయసు 22. ఆ సినిమాకు  కథానాయిక గా ఆమె దొరికి, సినిమా పూర్తయ్యేసరికి రెండేళ్లు పట్టింది. 89 నిముషాల ఈ చిత్రాన్ని తియ్యడానికి డైరెక్టర్‌ కృపాల్‌ కాళిత సహా టీమ్‌ మొత్తం దాదాపుగా ప్రతిరోజూ నీటిలోకి దిగవలసి వచ్చేది. రెండు నిముషాల సీన్‌ షూటింగ్‌కి ఎనిమిది గంటల సమయం పట్టిన అనుభవం కూడా వారికి ఉంది. నీళ్లలోకి దిగడం, కరెక్ట్‌ షాట్‌ కోసం గంటలు గంటలు పనిచేయడం పెద్ద కష్టమైతే కాలేదు కానీ, జానకి పాత్రకు శివరాణిని వెతికి పట్టుకోవడమే వారికి కష్టమైంది. వాళ్లకు కావలసింది చూడ్డానికి మొరటుగా, పొలం పనుల వల్ల చేతుల కాయలు కాసి ఉన్న అమ్మాయి. అలాగే ఆమెకు పొలం దున్నడం తెలిసుండాలి.

పశువులు మేపగలగాలి. ఈ ‘క్వాలిటీ’లన్నిటి కోసం బలిగావ్‌ గ్రామం మొత్తం గాలించి 300 మంది యువతులకు ఆడిషన్‌ నిర్వహించి చివరికి శివరాణిని ఎంపిక చేసుకున్నారు. కథకు, కథనానికి సరిపోయేలా ఉంది శివరాణి. ఫ్రెష్‌గా కాలేజ్‌ నుంచి వచ్చినప్పటికీ, అప్పుడే నాగలి పట్టి పొలం దున్ని ఇంటికి వచ్చినట్లుగా ఉంది. సినిమాకు అంతవరకు చాలు. అయితే ఆమె వదనంలో లీలగా విషాదం కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు వరదల్లో చనిపోయారు. తమ్ముడు, తను.. ఇద్దరే మిగిలారు. తమ్ముణ్ణి చదివిస్తూ, తన బి.యస్సీ పూర్తిచేసుకుని ఉన్న సమయంలో ఊళ్లోకి ఈ సినిమా టీమ్‌ వచ్చింది. వారి సినిమాలోని ప్రధాన పాత్రకు తను ఎంపికైన వార్త వినగానే శివరాణి ఎలాగైతే మేఘాలలో తేలిపోయిందో.. ఆ పాత్రకు ఉత్తమ నటిగా తనకు అవార్డు వచ్చిందని తెలిసి ఇప్పుడూ అంతే ఆనందంలో మునిగిపోయింది. ముంచడం, తేల్చడం బ్రహ్మపుత్ర యేటా చేస్తుండే పనే. ఈ మునగడం, తేలడం మాత్రం ఆమెకు కొత్త అనుభవం.

సీమా బిస్వాస్‌ తర్వాత ఉత్తమ నటి అవార్డు పొందిన మరొక అస్సామీ నటి శివరాణి. 2019లో ఇదే ‘అట్టావా’ చిత్రోత్సవంలో మలయాళీ చిత్రం ‘ఇదం’కి ఉత్తమ నటి అవార్డు పొందారు సీమ. ఈ ఏడాది అదే చిత్రోత్సవంలో ‘బ్రిడ్జ్‌’తో శివరాణి ఉత్తమ నటి అయింది. 56 ఏళ్ల విలక్షణ నటితో తనకు పోలిక రావడం కూడా శివరాణిని ఆనంద డోలికల్లో విహరింపజేస్తోంది. తండ్రే ఆమెకు నాగలితో పొలం దున్నడం నేర్పించాడు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే సినిమాలో పొలం దున్నుతూ కనిపిస్తున్న తనను చూసి, ఆయనతో పాటు తల్లీ సంతోషించే ఉండేవారని శివరాణి అంటోంది. ప్రస్తుతం ఆమె తన గ్రామానికి దగ్గరగా ఉండే ఉత్తర లక్ష్మీపూర్‌లోని ఒక డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తోంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు