పెళ్లి సందడికి వేళాయె! పందిళ్లతో కళకళ లాడుతున్న ఊరు, వాడ..

14 Aug, 2023 13:42 IST|Sakshi

శుభముహుర్తాలకు వేళయ్యింది. శ్రావణమాసం.. వరుస ముహూర్తాలు వస్తుండడంతో పల్లెలు, పట్టణాల్లో మళ్లీ పెళ్లి సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి డిసెంబర్‌ వరకు సుమారు 50కి పైగాముహూర్తాలు వస్తుండడం విశేషం. ఫలితంగా అన్ని జిల్లాలు పెళ్లిళ్లతో.. పందిళ్లు సందడిగా మారనున్నాయి. వివాహ ముహూర్తాలు ఆగస్టులో 8, సెప్టెంబరులో 6, అక్టోబరులో 10, నవంబరులో 14, డిసెంబరులో 14  వరకు ఉండటంతో ముఖ్యంగా కడప జిల్లా మరింత సందడిగా మారింది. అక్కడ జిల్లా వ్యాప్తంగా కల్యాణ మండపాలు పెద్దవి 800 మీడియం 1200 చిన్నవి వాటిల్లోనే ఏకంగా 1000కి పైగా వివాహాలు జరగడమే గాక మొత్తం ఖర్చు రూ. 25కోట్లు వరకు ఉండొచ్చు.

ఏప్రిల్‌లో శుభ కార్యాలకు ముహూర్తాలు లేకపోవడం, జూన్‌లో కొన్ని మాత్రమే ఉండడం, జులైలో ఆషాఢమాసం, అధిక శ్రావణం కారణంగా ముహూర్తాలు లేక ఇన్నాళ్లు శుభ కార్యాలకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ఆగస్టు 19 నుంచి ముహూర్తాలు ఉండడంతో తమ పిల్లలకు వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబరు వరకు వరుసగా ఎక్కువ ముహూర్తాలు ఉండడంతో దాదాపు వెయ్యికి పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాల ప్రతినిధులు తెలుపుతున్నారు. ఆగస్టు 16న అమావాస్య అనంతరం నిజ శ్రావణమాసం వస్తుండడంతో 19వ తేదీ నుంచి దాదాపు 10 రోజులపాటు వరుసగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి.

ఇవి డిసెంబరు వరకు కొనసాగనున్నాయి. కడప జిల్లాలో ఈ సంవత్సరాంతం వరకు ఉన్న 50కి పైగా ముహూర్తాల్లో వెయ్యికి పైగా వివాహాలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 800కు పైగా పెద్ద కల్యాణ మండపాలు, 1200కు పైగా మీడియం మండపాలు, 1000కి పైగా చిన్న మండపాలు ఉన్నాయి. వీటికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంది. వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యే నాటికి దాదాపు అన్ని కల్యాణ మండపాలు, ముహూర్తాలుగల అన్ని రోజుల్లోనూ ముందే రిజర్వు అయి ఉండడం విశేషం. డిసెంబరు వరకు ఉన్న ఈ సీజన్‌లో వివాహాల కోసం కనీసం రూ. 15–25 కోట్లవరకు ఖర్చవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ సీజన్‌కు ముందు వివాహాలు చేయలేకపోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు మంచి ముహూర్తాలు ఆహ్వానం పలుకుతున్నా... పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. విందు భోజనాలు రెండు, మూడు నెలల క్రితం నాటికి విందు భోజనాలు ప్లేటు రూ. 150–180 వరకు ఉండగా, ప్రస్తుతం ఆ ధర రూ. 200–250కి పైగా చేరింది. దీంతో ఘనంగా వివాహాలు నిర్వహించుకోవాలని భావించిన తల్లిదండ్రులకు ధరల దడ పట్టుకుంది.

రెండు నెలల క్రితం నాటి ధరలతో పోలిస్తే ఇటీవల కూరగాయల ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. అయినా జీవితంలో ఒక్కసారే నిర్వహించే అపురూపమైన ఘట్టం గనుక వివాహాలను ఘనంగానే నిర్వహించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. వస్త్రాల ధర కూడా 20–40 శాతం పెరిగింది. శ్రావణమాసంతో పండుగల సీజన్‌ ప్రారంభమైంది గనుక డిమాండ్‌ పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది.

(చదవండి: ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్‌ మరింత స్పెషల్‌!)

మరిన్ని వార్తలు