Mayank Vishnoi Love Story: తొలి పిలుపే మిసెస్‌ విష్ణోయి; తనను ఆ స్థితిలో చూసి గుండె పగిలింది.. ఇక విశ్రాంతి తీసుకో..

17 Nov, 2021 13:00 IST|Sakshi

Swathi Vishnoi And Mayank Vishnoi Emotional Love Story: He Want To Be Dad But Never Came Back: అమృత తుల్యమైన ప్రేమను నిర్వచించడం ఎవరికీ సాధ్యం కాదు... నిజమైన ప్రేమలో ఆశించడాలు.. అనుమానాలు.. అవమానాలకు తావుండదు... అనుభూతులు మాత్రమే పదిలంగా మదిలో కొలువుంటాయి... మనస్ఫూర్తిగా ఇష్టపడిన వ్యక్తి భౌతికంగా వేల మైళ్ల దూరంలో ఉన్నా అనుక్షణం మన చెంతనే ఉన్నారన్న పవిత్ర భావన మనసును పులకింపజేస్తుంది.. తనతో పెనవేసుకున్న అనుబంధం అజరామరంగా నిలిచిపోతుంది.. 

శ్రీమతి విష్ణోయి ప్రస్తుతం ఇదే మానసిక స్థితిని అనుభవిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్‌ మయాంక్‌ విష్ణోయి సతీమణి ఆమె. తన భర్త తనను గర్వపడేలా చేశారని, ఆయన లేరన్న విషయం తలచుకుని బాధపడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదంటున్నారు. అత్తామామలకు తానే కొడుకుగా మారి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ప్రాణంగా ప్రేమించే భర్త దూరమై రెండు నెలలు కావొస్తున్న వేళ ఆయనతో తన బంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన అందమైన జ్ఞాపకాలు పంచుకున్నారు.


PC: Humans Of Bombay

తొలి పిలుపే మిసెస్‌ విష్ణోయి అంటూ..
‘‘నాలుగేళ్ల క్రితం.. సూర్యకిరణంలా నా జీవితంలో ప్రవేశించాడు మయాంక్‌. నా సహోద్యోగి కజిన్‌ ఆయన. తొలిసారి నన్ను చూసినపుడే... ‘‘నువ్వు ఏదో ఒకరోజు మిసెస్‌ విష్ణోయి అవుతావు’’! అన్నారు. నాకు నవ్వొచ్చింది. కానీ... మయాంక్‌ మాత్రం ఆ మాట సీరియస్‌గా తీసుకున్నారు. ఎప్పుడు కలిసినా శ్రీమతి విష్ణోయి అని పిలిచేవారు. ‘‘హే.. నువ్వు పిచ్చోడివి బాబూ’’ అని బదులిచ్చేదాన్ని. మెల్లగా మాటలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. 

అప్పుడు ఇన్‌ఫాంట్రీలో మయాంక్‌ కెప్టెన్‌గా ఉండేవారు. డెహ్రాడూన్‌లో పోస్టింగ్‌. నేనేమో ఢిల్లీలో! ప్రతి శనివారం నన్ను చూసేందుకు 5 గంటల ప్రయాణం చేసేవారు. కానీ.. మేం కలిసి ఉండేది మాత్రం కేవలం రెండు గంటలే!! మయాంక్‌తో ఉంటే సమయమే తెలియదు! నా పుట్టినరోజైతే ఇక చెప్పనక్కర్లేదు. అకస్మాత్తుగా వచ్చి ఇప్పుడు మనం నేపాల్‌ వెళ్తున్నాం! మరోచోటుకు వెళ్తున్నాం అంటూ సర్‌ప్రైజ్‌ చేసేవారు. 


PC: Humans Of Bombay

శ్రీమతి విష్ణోయి గారూ.. నన్ను పెళ్లి చేసుకుంటారా?
ఒక్కోసారి అత్యంత శీతల ప్రదేశాల్లో తను విధులు నిర్వర్తించే వారు. అలాంటప్పుడు నెలల పాటు కనీసం నేరుగా చూసే వీలు కూడా ఉండేది కాదు.  అలా ఓసారి రెండు నెలల ఎడబాటు. ఆ చేదు అనుభవాన్ని దూరం చేసేందుకు తన బర్త్‌డే రోజు తన దగ్గరికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశాను. వెంటనే నన్ను ఆత్మీయంగా హత్తుకుని.. నువ్వు వచ్చావు కదా.. నా పుట్టినరోజు పరిపూర్ణమైంది అంటూ సంబరపడ్డారు.

మరోసారి.. నన్ను నిజంగానే అమితాశ్చర్యాలకు గురిచేశారు. ఆరోజు నా పుట్టినరోజు. స్నేహితులు, బంధువుల ముందు మోకాళ్లపై కూర్చుని.. ‘‘శ్రీమతి విష్ణోయి గారూ.. నన్ను పెళ్లి చేసుకుంటారా?’’అంటూ ఎంతో గోముగా అడిగారు. అంతే ఇక! పెళ్లి భాజాలు మోగాయి!

నాకింకా గుర్తు... పెళ్లిలో పూజారి మంత్రాలు చదువుతున్నపుడు.. మయాంక్‌ తనకు తానుగా కొన్ని ప్రమాణాలు చేశారు. ‘‘నాకు ఎల్లప్పుడూ నా దేశమే ప్రథమ ప్రాధాన్యం’’... ‘‘ఒకానొక రోజు నేను తిరిగి రానన్న వార్త వస్తుంది. సైనికుడి భార్యగా నువ్వు చేదు నిజాన్ని  వినడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి’’ అని చెప్పారు. తనతో మాట్లాడుతూ సమయం గడపటం నాకెంతో ఇష్టం.


PC: Humans Of Bombay

నాన్నను కావాలని ఉందన్నారు.. కానీ
పెళ్లైన కొత్తలో రోజులు ఎంతో మధురంగా గడిచాయి. ఆయనతో పాటు విధులు నిర్వర్తించే చోటుకు వెళ్లాను. అక్కడే మా పొదరింటిని నిర్మించుకున్నాం. అయితే, తను మేజర్‌ అయిన తర్వాతి ఏడాదికి కశ్మీర్‌లోని షోపియాన్‌లోని ఘర్షణాత్మక ప్రాంతంలో పోస్టింగ్‌ వచ్చింది. అక్కడ ప్రతిరోజూ కత్తిమీద సామే. కానీ మయాంక్‌ వీలు చిక్కినప్పుడల్లా... నన్ను చూడటానికి వచ్చేవారు.

నాలుగేళ్ల బంధంలో తనతో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. చివరిసారిగా ఏప్రిల్‌లో ఆయన ఇంటికి వచ్చారు. వెళ్లేటపుడు.. ‘‘స్వా.. మన కుటుంబాన్ని పెంపు చేసుకోవాలని భావిస్తున్నా.. నాన్నను కావాలని ఉంది’’ అని ఆయన అన్న మాటలు ఇంకా గుర్తు. కానీ.. నా మయాంక్‌ తిరిగి రాలేదు.. తన గురించిన వార్త మాత్రం వచ్చింది.

నా గుండె పగిలింది.. విశ్రాంతి తీసుకో
రెండు నెలల క్రితం... నాకొక కాల్‌ వచ్చింది. ‘‘సర్‌... తలమీద ఎవరో గన్‌తో కాల్చారు’’.. అవతలి గొంతు. ఒక్కసారిగా నా ప్రపంచం కుప్పకూలింది. ఆరోజు ఉదయమే తనతో మాట్లాడాను. కానీ అంతలోనే ఇలా.. వెంటనే శ్రీనగర్‌కు బయల్దేరాను. తనను ఆ పరిస్థితిలో చూసి నా గుండె పగిలింది. బ్రెయిన్‌డెడ్‌ అని డాక్టర్లు చెప్పారు. అయినా.. తను నా మాటలు వింటున్నాడనే ఆశ.. 15 రోజుల పాటు నా మయాంక్‌ ఎంతో ధైర్యంగా మృత్యువుతో పోరాడాడు. 

‘‘ఐ లవ్‌ యూ.. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను.. ఇక నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో మయాంక్‌’’తనతో నేను చెప్పిన చివరి మాటలు ఇవే. తనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు బెటాలియన్‌ మొత్తం కదిలి వచ్చింది. సేన మెడల్‌తో తనను గౌరవించారు.

రెండు నెలలు అవుతోంది. కానీ తను లేడన్న విషయం నమ్మలేకపోతున్నా. ఇంకా తను ఎక్కడో చోట డ్యూటీ చేస్తున్నాడనే భావనలో ఉంటా. నా జ్ఞాపకాల్లో తను సజీవం. నిద్రపోయే సమయంలో తన చేతి గడియారం పెట్టుకుంటాను. తన దుస్తులు ధరిస్తాను.. తను నన్ను గట్టిగా హత్తుకున్నట్లుగా అనిపిస్తుంది. తను నాతోనే ఉన్నాడు.. ఉంటాడు... కానీ నా భర్త లేడని నేను ఎన్నడూ శోకించను..

అందుకు బదులుగా తను నాకు మిగిల్చిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ... ఒక వ్యక్తిగా... దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడిగా తను నాకు నేర్పించిన విలువలు తలచుకుంటూ కాలం గడిపేస్తా’’ అని ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించారు. అన్నట్లు మిసెస్‌ విష్ణోయి పేరు చెప్పలేదు కదూ! స్వాతి మయాంక్‌ విష్ణోయి! ప్రేమకు నిలువెత్తు రూపమైన భర్త జ్ఞాపకాల్లో సంతోషం వెదుక్కుంటున్న ‘మయాంక్‌ జీవిత భాగస్వామి’!

ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జమ్మూ కశ్మీర్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో ఆగష్టు 27న గాయపడ్డ మయాంక్‌ విష్ణోయి పదిహేను రోజుల తర్వాత శాశ్వతంగా ఈ లోకాన్ని వీడివెళ్లిపోయారు.

-సాక్షి వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు