West Bengal: 108 గ్రాముల బంగారంతో.. గోల్డ్‌ మాస్క్‌!! జనాల్లో ధరించలేక..

13 Nov, 2021 16:41 IST|Sakshi

జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందనే సామెత వినే ఉంటారు. మరి బంగారం ఉంటే..!! అవును.. ఇతగాడు బంగారంతో ఏకంగా మాస్క్‌ చేయించుకున్నాడు. ఈ గోల్డ్‌ మాస్క్‌ ముచ్చట్లేమిటో తెలుసుకుందాం..

కోవిడ్‌ వచ్చాక మన జీవితాల్లో మాస్కులు కూడా ఒక భాగమైపోయాయి. వీటిని ధరించడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌ అనుసరిస్తున్నారు. మ్యాచింగ్‌ మాస్కులు, ఫొటో ఫ్రింట్‌ మాస్కులు, ఏ చీర కామాస్కు.. ఇలా ఎన్నో. ఐతే వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త 108 గ్రాముల బంగారంతో రూ. 5 లక్షల 70 వేల ఖరీదు చేసే గోల్డ్‌ మాస్క్‌ చేయించుకున్నాడు. దీనిని చందన్‌ దాస్‌ అనే జ్యువెలరీ డిజైనర్‌తో ప్రత్యేకంగా తయారు చేయించాడట. కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ వేడుకల సందర్భంగా సదరు వ్యాపారవేత్త ముచ్చటపడి చేయించుకున్న గోల్డ్‌ మాస్క్‌ను ధరించాడు. ఐతే జనాలు గోల్డ్‌ మాస్కును చూసేందుకు చుట్టూ మూగడంతో కాసేపట్లోనే తీసి జేబులో దాచుకున్నాడు. రీతుపర్నా చటర్జీ అనే జర్నలిస్ట్‌ గోల్డ్‌ మాస్క్‌కు సంబంధించిన ఫొటోలను ‘వాట్‌ ఈస్‌ ది పర్పస్‌ ఆఫ్‌ దిస్‌?' అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట వెరల్‌ అయ్యాయి. 

తనకు ఆభరణాల పట్ల మక్కువ ఎక్కువని, అందుకే బంగారంతో మాస్కు చేయించుకున్నాడని, మెడలో రకరకాల బంగారు గొలుసులు, రెండు చేతులకు అనేక ఉంగరాలు ధరించినట్లు స్థానిక మీడియాకు సదరు వ్యాపారవేత్త తెలిపాడు. ఏదిఏమైనా కోవిడ్‌ కాలంలో కడుపునింపుకునేందుకు జనాలు నానాఅగచాట్లు పడ్డారు. అటువంటిది ఇతగాడు తన సంపదను ప్రదర్శించుకునేందుకు ఏకంగా గోల్డ్‌తో మాస్క్‌ చేయించుకోవడంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతోందీ గోల్డ్‌ మాస్క్‌.

చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..

మరిన్ని వార్తలు