Eating Chicken Biryani Is Healthy: టేస్ట్‌ బావుంది కదా అని బిర్యానీ కుమ్మేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ముట్టుకోరు!

16 Aug, 2023 13:08 IST|Sakshi

బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా,పెద్దా అని తేడా లేకుండా చాలామంది ఫేవరెట్‌ ఫుడ్‌ లిస్ట్‌లో బిర్యానీ ముందుంటుంది. అందులోనూ హైదరాబాద్‌ బిర్యానీ అంటే సెలబ్రిటీలు కూడా మనసు పారేసుకుంటారు. నాన్‌వెజ్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నా చికెన్‌ బిర్యానీ ప్రత్యేకతే వేరు. అందుకే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ సర్వీస్‌ యాప్స్‌లోనూ బిర్యానీ మోస్ట్‌ సేలబుల్‌ డిష్‌. అయితే టేస్ట్‌ బాగుంది కదా అని రోజూ బిర్యానీ కుమ్మేస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు డాక్టర్లు. తరచూ బిర్యానీ తింటే ముప్పు తప్పందని హెచ్చరిస్తున్నారు. 


చాలామందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ఏదైనా అకేషన్‌, పార్టీ ఉంటే కశ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే. ఈ క్రేజ్‌కు తగ్గట్లే ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడపడితే అక్కడ బిర్యానీ పాయింట్లు వెలిశాయి. అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రెస్టారెంట్స్‌లో దొరికే బిర్యానీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వాటిలో వినియోగించే మసాలా దినుసులు,నాసీరకం పదార్థాల వల్ల కడుపులో లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కలర్స్‌తో క్యాన్సర్‌

అసలే మార్కెట్‌లో ఇప్పుడు కల్తీ బాగా పెరిగిపోయింది. కాదేదీ అనర్హం అన్నట్లు తినే తిండి దగ్గర్నుంచి తాగే నీళ్ల వరకు అన్నింటిని కల్తీ చేసి పడేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఇష్టమొచ్చినట్లు రంగులు, ఆర్టిఫిషియల్‌ ఎసెన్సులు వాడేస్తున్నారు. ఇలాంటి కలర్స్‌ వాడటం వచ్చే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది. బిర్యానీ అధికంగా తింటే ఊబకాయం, గ్యాస్‌, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

చికెన్‌పై బాక్టీరియా

చికెన్‌పై సాధారణంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియా ఉంటుంది. కాబట్టి వండేముందు శుభ్రంగా కడిగి బాగా ఉడికిన తర్వాత మాత్రమే తినాలి. లేకపోతే ఈ బాక్టీరియా శరీరం లోపలికి చేరి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ రెస్టారెంట్స్‌, హోటల్స్‌లో ఎంతవరకు హైజీన్‌ మెయింటైన్‌ చేస్తారన్నది చెప్పలేం. దీనివల్లే ఒక్కోసారి ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. 

తరచూ బయట బిర్యానీ తింటే గుండె సమస్యలు కూడా వస్తాయట. మేం రోజూ చికెన్‌ తింటున్నాం. మాకేం కాలేదు కదా అని వాదించే వాళ్లూ ఉంటారు. అయితే ఇప్పుడు సమస్యలు రాకపోయినా ప్రతిరోజూ బిర్యానీ, మసాలాలు ఎక్కువగా ఉండే వంటలు తింటే దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయట.

ప్రోటీన్‌ సంగతి సరే, మరి కొవ్వు?

సాధారణంగా చికెన్‌లో ప్రోటీన్‌ అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జిమ్‌, వర్కవుట్స్‌ చేసే వాళ్ల డైట్‌ లిస్ట్‌లో ప్రతిరోజూ చికెన్‌ ఉంటుంది. దీనివల్ల ప్రోటీన్‌ అధికంగా శరీరంలో చేరిపోయి కొవ్వు రూపంలో మారిపోతుంది. దీంతో మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు. కాబట్టి రోజూ తినే అలవాటు మానుకొని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటే మంచిదంటున్నారు వైద్యులు. 

మరిన్ని వార్తలు