అలనాడు బ్రహ్మోత్సవాలే... కల్యాణోత్సవాలు

27 Sep, 2022 20:23 IST|Sakshi

శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిత్యకల్యాణోత్సవం జరుగుతుంది. కాని ప్రాచీనకాలంలో ఈ నిత్యకల్యాణోత్సవ సంప్రదాయం ఉన్నట్లు కనిపించదు. అప్పట్లో బ్రహ్మోత్సవాలనే స్వామివారి కల్యాణోత్సవాలుగా భావించేవారని తెలుస్తోంది. కాని బ్రహ్మోత్సవాలలో స్వామివారికి, అమ్మవారికి కల్యాణం చేసే ఉత్సవం ఏమీ ఉండదు.


శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివాహోత్సవాన్ని మొదటిసారి 1546 జూలై 17వ తేదీన తాళ్లపాక పెద తిరుమలాచార్యులు ప్రారంభించినట్లు శాసనంలో కనిపిస్తుంది. ఆనాటి సంప్రదాయంగా ఐదు రోజులు శ్రీవారి వివాహ కార్యక్రమాన్ని దగ్గరుండి ఎంతో ఘనంగా నిర్వహించారు. అనురాధ నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ వరకు ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను మార్చి, ఏప్రిల్‌ మాసాలలో నిర్వహించేవారు. ఆ రోజుల్లో 5 రోజుల వివాహంలో జరిగే అన్ని తతంగాలను, లాంఛనాలను ఈ వివాహంలో జరిపించేవారు. 

స్వామివారికి అభ్యంగనస్నానం, తిరుమంజనం, నూతన వస్త్రధారణ, తిరువీథి ఉత్సవం, నైవేద్యం, స్వామివారిని, దేవేరులను ఉయ్యాలపై ఉంచి చేసే ఉయ్యాలసేవ, పెళ్లికొడుకు పాదాలను క్షీరంతో అభిషేకించడం, ధ్రువనక్షత్ర దర్శనం, చందన వసంతోత్సవం, కల్యాణహోమం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, పూలబంతి ఆట... ఇలా అన్ని వేడుకలను ఐదు రోజులపాటు వివాహోత్సవం కార్యక్రమంలో నిర్వహించేవారు. 


తాళ్లపాక వారు ఏర్పాటు చేసిన ఈ ఉత్సవంలో తాళ్లపాక వంశీయులు ప్రధానపాత్ర వహించి స్వామివారికి కన్యాదానం చేసే సంప్రదాయం మెదలైంది. అటు తరువాత ఈ కార్యక్రమం నిత్య కల్యాణోత్సవంగా రూపాంతరం చెంది ప్రతినిత్యం నిర్వహిస్తున్నారు. కన్య తరపున తాళ్లపాక వంశీకులే కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ అన్నమయ్య వంశీకులకు టీటీడీ ప్రత్యేకంగా సంభావన, ప్రసాదాలు అందిస్తోంది.

ఐదు రోజులపాటు వైభవంగా స్వామివారికి నిర్వహించే కల్యాణోత్సవం ఖర్చుల నిమిత్తం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు కొండవీడు సీమలోని శెందళూరు అనే గ్రామం, మల్లవరం అనే గ్రామాన్ని దేవదాయం చేశాడట. అ సమయంలో మలయప్పస్వామి, దేవేరులకే కాకుండా, ఆలయంలో శ్రీకృష్ణునికి, వరాహస్వామివారికి నైవేద్య సమర్పణ జరిగింది. మనోహరం అనే ప్రసాదం కూడా అప్పుడే స్వామివారికి సమర్పించడం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన  వివరాలు కూడా స్వామివారి కల్యాణోత్సవం గురించి లిఖించిన శాసనంలోనే ప్రస్తావించారు. 


అంతకు పూర్వం ఈ నైవేద్యం గురించి ఎక్కడా ప్రస్తావన లేదట. ఇది ఒక రకమైన బెల్లపు లడ్డు, సున్నుండ లాంటిది. 16వ శతాబ్దం మధ్యభాగంలో మొదలైన ఈ ప్రసాదం 20వ శతాబ్దం మధ్య భాగం వరకు చాలా ప్రాచుర్యంలో వుండేది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే ముఖ్య భక్తులకు దేవస్థానం ఇచ్చే ప్రధాన ప్రసాదంగా పేరు తెచ్చుకుంది. దాని స్థానంలో ఇప్పుడు తిరుపతి లడ్డూగా పేరుగాంచిన శనగపిండి లడ్డూ ప్రాముఖ్యానికి వచ్చింది. రుచిలో... నాణ్యతలో తిరుపతి లడ్డూనే దానికది సాటిగా పేరు తెచ్చుకుంది. (చదవండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...)

మరిన్ని వార్తలు