‘ఉరికంబంపై’ ప్రభుత్వరంగం?!

3 Aug, 2021 03:35 IST|Sakshi

రెండో మాట

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న శుభ సమయంలో ప్రభుత్వ (పబ్లిక్‌) రంగ పరిశ్రమలను పాలకులు ఒక్కటొక్కటిగా ప్రైవేట్‌ గుత్త పరిశ్రమాధిపతులకు కుదువ పెట్టాలని విధాన నిర్ణయంగానే ప్రకటించడం హాస్యాస్పదమే గాదు, పారిశ్రామికంగా, వ్యవసాయికంగా రానున్న పెను అనర్థాలకు, మార్పులకు నిదర్శనంగా నిలవబోతోంది! ఏ ప్రపంచ బ్యాంక్‌ విషమ షరతుల్ని వర్ధమాన దేశాల తరఫున నైరేరి కమిషన్‌ తన నివేదికలో ఎండగట్టిందో ఆ షరతులనే ఆ తరువాత భారత ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్‌ తలదాల్చవలసి రావడం ఒక విషాదం. విదేశీ పాలనను పారదోలిన నాటి ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమస్ఫూర్తి... రేపటి భారత స్వాతంత్య్ర సందేశం కావాలి.

అమ్మా నాకు చలివేస్తోందే, మంట వేయవూ? / నాయనా బొగ్గులు లేవురా! / అమ్మా బొగ్గులెందుకు లేవే?! / మీ నాన్నకు పని పోయింది, బొగ్గులు కొనడానికి డబ్బు లేదురా బాబూ / నాన్నకు పనెందుకు పోయిం దమ్మా / బొగ్గు ఎక్కువగా ఉందిటరా బాబూ!
– రాషే స్డల్‌ (‘కార్మికులు – రాక్షసి బొగ్గు’ నవల) 

నిత్య దోపిడీపై ఆధారపడిన పెట్టుబడిదారీ – ధనిక వర్గ వ్యవస్థల్లో పారిశ్రామిక, వ్యవసాయక, తదితర వస్తూత్పత్తి రంగాల్లో పని చేసే శ్రమజీవులందరూ దఫదఫాలుగా నిత్యం ఎదుర్కునే సమస్య ఇదే. శ్రామిక తల్లీబిడ్డల మధ్య పరిష్కారం కనబడని ఈ దుస్థితిని ఒక నవలాకారుడు వర్ణించిన తీరు లోతుపాతుల్ని మరింతగా అర్థం చేసు కోవాలంటే– నేటి భారత దేశంలో నడుస్తున్న చరిత్రకు దాఖలాగా దేశ పాలకులు ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా చాపచుట్టేయడానికి ఎలాంటి ఆలోచనా వెరపూ లేకుండా ఆగమేఘాలపై కొన్ని రోజులుగా తీసు కుంటున్న నిర్ణయాలే నిదర్శనం. ఈ క్రమ పరిణామానికి, ఆకస్మిక నిర్ణయాలకూ కాంగ్రెస్‌– బీజేపీ పాలకులు, పాలనాయంత్రాంగాలూ గడిచిన 75 ఏళ్లలో తొలి పదిహేనేళ్లలో తప్ప మిగిలిన సంవత్సరాలలో నేటి వరకూ అమలు జరుపుతున్న విధానాలే కారణం అంటే బాధ పడాల్సిన పని లేదు! ఈ పరిణామానికి పరాకాష్టగా లాభాల బాటలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా ఎదుగుతూ, దేశ ఉక్కు పారి శ్రామిక రంగానికే గర్వకారణంగా రూపొందిన విశాఖ ఉక్కు పరి శ్రమను ప్రైవేట్‌ రంగానికి ధారాదత్తం చేయాలని నేటి కేంద్ర ప్రభుత్వం తిరుగులేని నిర్ణయం తీసుకుంది. ఎవరెంత గింజుకున్నా తన నిర్ణయానికి తిరుగులేదని కేంద్ర పాలకులు ప్రకటించడంతో యావదాంధ్ర అట్టుడుకి పోతున్న సమయం ఇది! కొద్దిరోజుల్లోనే దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు కావస్తున్న శుభ సమయంలో ప్రభుత్వరంగ పరిశ్రమలను పాలకులు ఒక్కటొక్కటిగా ప్రైవేట్‌ గుత్త పరిశ్రమాధి పతులకు కుదువపెట్టాలని విధాన నిర్ణయంగానే ప్రకటించడం హాస్యాస్పదమేగాదు, పారిశ్రామికంగా, వ్యవసాయికంగా పెను అన ర్థాలకు, మార్పులకు నిదర్శనంగా నిలవబోతోంది! 

ఇది ఒక్క విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతోనే ఆగబోదనీ, ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో పాటు ప్రభుత్వరంగంలోని ఆయిల్, గ్యాస్‌ కంపె నీల్లో నూరు శాతం విదేశీ గుత్త సంస్థల ప్రత్యక్ష పెట్టుబడులకు బీజేపీ పాలకులు పూర్తి అనుమతిస్తూ ఈ సంస్థల్లోని ప్రభుత్వ మెజారిటీ వాటాలను అమ్మేసేందుకు నిర్ణయించారు! అదే మోతాదులో ప్రజా బాహుళ్యం జనరల్‌ బీమా సౌకర్యార్థం ఏర్పడిన వ్యవస్థను చట్ట సవ రణ ద్వారా పక్కదారులు పట్టిస్తోంది. ప్రభుత్వం ఈ చర్యలన్నింటికీ ఒక ‘ముద్దుపేరు’ తగిలించి, తనవన్నీ ‘వ్యూహాత్మక విక్రయా’లని చాటుకుంది’ ఇలా ఒక్కటొక్కటిగా ప్రజలందించిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ వాటాను 2008 నాటికే విదేశీ ప్రయివేట్‌ గుత్త కంపెనీలకు అనుగుణంగా తగ్గించేసి, విదేశీ కంపెనీల ప్రత్యక్ష పెట్టుబడులను 26 నుంచి 49 శాతానికి పెంచింది! ఇక ఐడీబీఐ ప్రభుత్వ బ్యాంకులో తన మిగిలిన వాటాలనూ అమ్మేసుకోవడానికి ప్రభుత్వం వెరవలేదు! ఈ విక్రయ దస్తావేజులకు పాలకులకు ఆది గురువు– ఆంగ్లో–అమెరికన్‌ వలస సామ్రాజ్య పాలకులు కాగా, వారి కనుసన్నల్లో ఎదిగి ఇండియాలాంటి బడుగు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలను నమిలి మింగడానికి అవతరించిన సంస్థలు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. అన్నింటి కన్నా అవమాన కరమైన అంశం–భారత ఆర్థికమంత్రిగా డాక్టర్‌ మన్మోహన్‌సింగ్, ప్రధానిగా పీవీ నరసింహారావులు పదవుల్ని అధిష్టించడానికి ముందు వర్ధమాన దేశాలు స్వతంత్ర ఆర్థిక విధానాలు అనుసరించడానికి ఏర్పడ్డ సౌత్‌ కమిషన్‌ నిర్ణయాలను పక్కదారులు పట్టించడం! 

టాంజానియా రిపబ్లిక్‌ పాలకుడు జూలియస్‌ నైరేరి అధ్యక్షతన ఆసియా, ఆఫ్రికా, లాటిన్, అమెరికా వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థి తుల్ని  క్షుణ్ణంగా పరిశీలించడానికి ఏర్పడిన విశిష్ట సంస్థ ‘సౌత్‌ కమి షన్‌’ ఈ కమిషన్‌కు ప్రధాన కార్యదర్శిగా భారత ఆర్థికమంత్రిగా మన్మోహన్‌ ఉండేవారు! కానీ, ఏ ప్రపంచబ్యాంక్‌ విషమ షరతుల్ని వర్ధమాన దేశాల తరఫున నైరేరి కమిషన్‌ తన నివేదికలో ఎండ గట్టిందో ఆ షరతులనే ఆ తరువాత భారత ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్‌ తలదాల్చవలసి రావడం ఒక విషాదం. ఏ పరిస్థితుల్లో ఈ పరిణామం జరిగింది? ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఇబ్బం దులపాలైనా ఫర్వాలేదుగానీ సోషలిజం మాత్రం మళ్లీ తలెత్తకూడ దనీ, ఆ వైపుగా జనం మళ్లకూడదని, ఏమాత్రం వ్యవధి దొరికినా అలా మళ్లిపోయే ప్రమాదం వుందని అమెరికా బాహుటంగానే ప్రకటి స్తున్న సమయం అది. ఆ పరిస్థితుల్లో ఇండియాలాంటి వర్ధమాన దేశాల స్వతంత్ర ఆర్థికాభ్యున్నతికి ఏ మార్గం శ్రేయస్కరమైనదో ‘సౌత్‌ కమిషన్‌’ ఆనాడే చేసిన హెచ్చరిక ఈ నాటికీ శ్రేయస్కరం. ఆ నివేది కలో ఇలా స్పష్టమైన ముందుచూపుతో చేసిన హెచ్చరికలున్నాయి.

వలస విధానాన్ని వలస దేశాల ప్రజలు తిరస్కరించారు కాబట్టే ఆ విధానాన్ని వారు పాతిపెట్టించగలిగారు. తమకున్న వనరుల సహాయంతోనే వలస దేశాల ప్రజలు విదేశీ పెత్తనానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరానికి సమాయత్తం కాగలిగారు. తమకు నచ్చిన, తృప్తికరమైన షరతులపైన మాత్రమే బయటివారి సహాయాన్ని ఆమో దించారు. అందువల్ల నేటి వర్ధమాన దేశాలలో విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వివిధ రూపాల్లో అనుభవిస్తున్న దేశాలు కూడా దృఢచిత్తంతో, స్వావ లంబనపైన ఆధారపడిన కార్యాచరణ ద్వారా విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వదిలించుకోవచ్చు. దేశ నిరంతరాభివృద్ధి అనేది దిగుమతి చేసుకోగలి గిన వస్తువు కాదు సుమా! ఉత్పత్తి అయ్యే సంపద పంపిణీ న్యాయ బద్ధంగా జరగడం ద్వారానే ఆర్థికాభ్యుదయం సాధించగలగాలి. వర్ధ మాన దేశాల శీఘ్రపురోభివృద్ధికి సైన్స్‌ టెక్నాలజీ రంగాలు పునాది కావాలి. ఈ ప్రగతి సొంతంగానే జరగాలి. న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న ఆదర్శాలను తమ తమ దేశాలకు, తమ సమా జాలకు వర్ధమాన దేశాలు వర్తింపజేయాలి. అప్పుడే వాటికి విలువ. 

ప్రజాస్వామ్య విలువలను ప్రాథమిక హక్కులను గౌరవించి, అచ రించడం, భిన్నాభిప్రాయ ప్రకటన హక్కును గౌరవించడం, మైనారిటీ లకు న్యాయం చేకూర్చడం, పేదసాదల పట్ల ఆర్ద్రత, ఆచరణలో వారి ఉన్నతికి కృషి చేయడం, పబ్లిక్‌లో నిలబడిన వారి జీవితాలను విచార ణకు అనుమతించడం, యుద్ధాలకు పోకుండా వివాదాలను పరిష్క రించుకోవటం– వర్ధమాన దేశాల ప్రభుత్వాలకు కనీస ప్రణాళికగా ఉండాలి. 21 శతాబ్దంలోకి అడుగిడబోతున్న వర్ధమాన దేశాలు, పరి వర్తనా దశలో చేతులు ముడుచుకుని కూర్చోరాదు. తాము కలలు కంటున్న నూతన ప్రపంచ వ్యవస్థ ఇందుకు వాటిని ప్రోత్సహించాలి. ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలే ఈ దేశాల ప్రాపంచిక దృష్టికి వెలుగు దివ్వెలు కావాలి. మానవ జాతిలో నాల్గింట మూడొంతుల జనాభా వర్ధమాన దేశాలలోనే ఉన్నందున ప్రపంచ పరిణామాలను ప్రభా వితం చేయగల హక్కు ఈ దేశాలకు ఉంది. ఈ చారిత్రక మహోద యాన్ని తగిన రూపురేఖలిచ్చి ఆవిష్కరించడానికి రాజకీయంగానూ, ఆర్థికంగానూ, మేథో సంపత్తిలోనూ వర్ధమాన దేశాలకు తగినన్ని శక్తియుక్తులున్నాయి’’!
ఇదే ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమస్ఫూర్తి, రేపటి భారత స్వాతంత్య్ర  సందేశమూ కావాలి. అందుకే మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇలా ‘సందేశించి’ ఉంటాడు: ‘‘జీవితం ఆశతో కాదు. కసితో, కోపంతో బత కాలి. మరి బతకాలంటే పోరాడాలి. యుద్ధం చేయాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది’’!!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు