సీత్ల పండుగ; ఆటా, పాటా సంబురం

19 Jul, 2022 12:59 IST|Sakshi

గిరిజనులైన లంబాడీలు (బంజారాలు) ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ. ఆ రోజు సీత్లా భవానీని పూజిస్తారు. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా భవానీ కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటివి పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, అటవీ సంపద తరగకూడదనీ, సీత్ల తల్లికి మొక్కులు తీర్చు కుంటారు. 

వివిధ తండాల్లో ఆయా తండాల పెద్ద మనుషు లంతా కలిసి ఆషాఢమాసంలో ఒక మంగళవారాన్ని ఎంచుకొని సీత్ల పండుగను జరుపుతారు. ఇలా ప్రతి సంవత్సరం మంగళవారం రోజు మాత్రమే జరపడం ఆనవాయితీగా వస్తోంది. తండాల సరిహద్దుల్లోని పొలి మేరల కూడలి వద్ద సీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారు ఉన్న ప్రదేశానికి వెళ్తారు. 

ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. ఓ బంజారా పెద్ద మనిషిని పూజారిగా ఉంచి ఆయన చేతుల మీదుగా దేవత పూజా కార్యక్రమం నిర్వహిం చడం బంజారాల ఆచారం. పూజా కార్యక్రమం అంతా గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.

– నరేష్‌ జాటోత్, నల్లగొండ

మరిన్ని వార్తలు