హైకోర్టు ఆదేశాలు అసాధారణం

24 Sep, 2020 00:47 IST|Sakshi

విశ్లేషణ 

దర్యాప్తు నిలిపివేయడమే కాకుండా, ఎఫ్‌ఐఆర్‌ గురించిగానీ, ఎఫ్‌ఐఆర్‌లోని విషయాలనుగానీ ఏ మాధ్యమంలో కూడా ప్రచురించకూడదన్న అసాధారణ ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసింది. ఇలాంటి ఉత్తర్వులు ఏ కారణాలతో జారీ చేసిందో అర్థం కాలేదు. కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వు, ప్రతి తీర్పు సహేతుక కారణాలతో ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడు కోర్టులమీద విశ్వసనీయత పెరుగుతుంది. న్యాయపరిపాలనలో అత్యంత ముఖ్యమైన అంశం సహేతుక కారణాలు. అప్పుడే ప్రజాస్వామ్యయుతంగా కన్పిస్తుంది. సహేతుక కారణాలతో ఉత్తర్వులు, తీర్పులు అనేవి సహజ న్యాయసూత్రాలకి వెన్నెముక లాంటివి. అప్పీలుకి వెళ్లడానికి, పోకుండా ఉండటానికి ఆ కారణాలు మార్గనిర్దేశనం చేస్తాయి.
నా గొంతు కింద 
ఆర్టికల్‌ 19 నలిగిపోతుంది
నేనిక మాట్లాడను / ధిక్కారమో, దండనో 
నన్ను పరుగెత్తిస్తుంది / భయపడుతుంది

అంటాడు ఓ తెలుగు కవి. ఆ విధంగా అంటూనే ఆయన చెప్పా ల్సింది చెబుతాడు. భావ ప్రకటనా స్వేచ్ఛని, పత్రికా స్వేచ్ఛని పాల కులు అణిచివేసే అవకాశాలు ఉంటాయి. కోర్టులు రక్షిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇందుకు భిన్నమైన పరిస్థితి మన దేశంలో కనిపిస్తూ ఉంది. అమరావతిలో జరిగిన భూమి అమ్మకాల్లో జరిగిన అవకతవక కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పోలీసుల దర్యాప్తుని నిలిపివేయడంతో పాటు ప్రథమ సమాచార నివేదికలోని విషయాలని పత్రికల్లో కానీ, ఎలెక్ట్రానిక్‌ సాంఘిక మాధ్యమాల్లో కానీ ప్రచురించకూడదని, హైకోర్టు ఇటీవల ఆదరాబాదరాగా ఆదేశాలను జారీ చేసింది.

రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి తన క్లయింట్‌ అయిన మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ మీద క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, అతని న్యాయవాది ముకుల్‌ రోహత్గీ హైకోర్టు ముందు వాదనలు చేశారు. తన క్లయింట్‌ రిట్‌ పిటిషన్‌ వేసిన తర్వాత ఈ కేసు నుంచి ఓ న్యాయమూర్తి వైదొలిగిన తర్వాత ప్రథమ సమా చార నివేదికను విడుదల చేశారని, దాన్ని పత్రికలకూ పంపించి నానా హంగామా సృష్టించారని, అందుకని అతడిని అరెస్టు చేయ కూడదనీ, దర్యాప్తుని కూడా నిలిపివేయాలని ఇంకా కొన్ని ఉపశమనాలని ఇవ్వా లని కోర్టుని కోరారు. ప్రథమ సమాచార నివేదికలోని అంశాలను ప్రింట్, ఎలక్ట్రానిక్‌ సాంఘిక మాధ్యమాల్లో ప్రచురించ కుండా ఆదే శాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

ఇదివరకే ఈ విషయాలు అన్ని మాధ్యమాల్లో వచ్చేశాయని అందుకని ఇప్పుడు అలాంటి ఉత్తర్వులు జారీ చేసినా అవి నిష్ఫలమని ప్రతివాదుల న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. ఆరోపణలు ఉన్నాయి కాబట్టే కేసుని నమోదు చేశారని, దర్యాప్తులో ఇప్పుడు జోక్యం చేసుకోవడం తగదని ప్రతివాదుల న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు దరఖాస్తుదారు కోరిన ఉపశమనాలని మంజూరు చేసింది. దర్యాప్తుని నిలిపివేసింది. ప్రథమ సమాచార నివేదికలో ఆరోపించిన విషయాలని ఏ మాధ్యమాల్లో ప్రచురించకూడదని నిషేధిస్తూ ఉత్తర్వులని హైకోర్టు జారీ చేసింది. ఇందులో విశేషం ఏమంటే కోర్టు ముందు దరఖాస్తు చేసుకోని వ్యక్తులకి కూడా ఈ ఉపశమనాలు వర్తిస్తాయని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. గతంలో ఇలాంటిది ఏ కోర్టూ ఇచ్చిన సందర్భం నాకేతే కనిపించలేదు. ఇది చాలా అరుదైన ఆదేశం. ఈ నేపథ్యంలో ప్రథమ సమాచార నివేదికని పోలీసులు ఎప్పుడూ విడుదల చేయాల్సి ఉంటుంది? పోలీసుల దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అదేవిధంగా పత్రికా స్వేచ్ఛని, భావ ప్రకటనా స్వేచ్చని నిలిపి వేయవచ్చా? ఇవి అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు.

ప్రాథమిక దృష్టితో చూసినప్పుడు విచారణకు అర్హమైన (కాగ్నిజ బుల్‌) నేర సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి జాప్యం లేకుండా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి, దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సెక్షన 154 చెబుతున్న విషయం ఇదే. ఈ విషయంలో ఎంపిక చేసుకునే అవ కాశాన్ని చట్టం పోలీసు అధికారికి ఇవ్వలేదు. అది విశ్వసనీయమైన సమాచారమా? కాదా అనే విషయంలో కూడా పోలీసు అధికారికి ఎలాంటి విచక్షణాధికారం లేదు. సమాచారంలో విశ్వసనీయత కన్పిం చడం లేదన్న కారణంగా కానీ, అవసరమైన వివరాలు లేవని గానీ ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయకుండా ఉండే అవకాశం లేదు. కేసు ప్రాథమిక దశలో కాగ్నిజబుల్‌ సమాచారం అన్నదే కీలక మైన విషయం. అందులోని విశ్వసనీయత గురించి చూడాల్సిన అవసరం లేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్న విషయం దర్యాప్తులో తేలితే కేసుని పోలీసు అధికారి మూసివేసి, ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తిపై చర్య తీసుకోవచ్చు. (తులసీరామ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎం.పి. 1993, క్రిమినల్‌ లా జర్నల్‌ 1165 సుప్రీం కోర్టు).

ప్రథమ సమాచార నివేదిక విడుదల అయిన తరువాత దర్యాప్తుని కోర్టు నిలిపివేయవచ్చా? ప్రథమ సమాచార నివేదికలను నిలిపివేసే అధికారం, కొట్టివేసే అధికారం రాష్ట్ర హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి ఉన్నాయి. అయితే ప్రథమ సమాచార నివేదికలోని ఆరోపణల్లో ఎలాంటి కాగ్నిజబుల్‌ నేరం లేనప్పుడు మాత్రమే ఈ కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. దేశ పౌరులను అన్యా యంగా కేసుల్లో ఇరి కించకుండా, వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండటా నికి హైకోర్టు తన స్వయంసిద్ధ అధికారాలని ఉపయోగించవచ్చు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.482 ప్రకారంగా రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారంగా హైకోర్టుకి ఈ అధికారాలు ఉంటాయి.

కాగ్నిజబుల్‌ నేరాలని, కోర్టు అనుమతి లేకుండా పోలీసులు నేరుగా దర్యాప్తు చేసుకోవచ్చు. తమ స్వయంసిద్ధ అధికారాలని ఉప యోగించి కోర్టులు ఈ దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదు. కోర్టులు వ్యక్తిగత స్వేచ్ఛని చట్టం పరిధిలో నియంత్రించాలి. కోర్టుకి తన విచక్షణాధికారాలని అవసరమైన కేసులో వినియోగించవచ్చు. ఇదే విషయాలని స్టేట్‌ ఆఫ్‌ హరియాణా వర్సెస్‌ భజన్‌ లాల్‌ 1992, ఏఐఆర్‌ 604 సుప్రీంకోర్టు కేసులో కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు ఎలా చేయాలి? ఎవరు చేయాలి అన్నది పోలీసుల విచక్షణను బట్టి ఉంటుంది తప్ప హైకోర్టు నిర్దేశించకూడదు. ఏ విధంగా దర్యాప్తు చేయాలన్న విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు యం.సి. అబ్రహాం వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (2003) 2 ఎస్‌సిసి 649 కేసులో చెప్పింది. ఇదే విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టు స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌ వర్సెస్‌ అమన్‌ మిట్టల్‌ మరి ఒకరు (తీర్పు తేది సెప్టెంబర్‌ 4, 2019) కేసులో మళ్లీ చెప్పింది. అరుదైన కేసులో మాత్రమే కోర్టులు దర్యాప్తులో జోక్యం చేసు కొని దర్యాప్తుని నిలిపివేయవచ్చు. కోర్టుని ఆశ్రయించిన వ్యక్తులకే ఉపశమ నాలని ఇవ్వడం ఇంతకాలం వస్తూ ఉంది. ఇప్పుడు అది మారుతుం దేమో వేచి చూడాలి.

రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం హైకోర్టు తన అసా ధారణ అధికారాలని ఉపయోగించి, అవసరమైనప్పుడు న్యాయాన్ని రక్షించడానికి దర్యాప్తుని నిలిపివేయవచ్చు. చాలా కేసుల్లో దర్యాప్తులని నిలిపివేయడాన్ని గమనించిన సుప్రీంకోర్టు తన ఆందోళనని వ్యక్తపరి చింది. ఇంతియాజ్‌ అహ్మద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యూపీ (2012) కేసులో దర్యాప్తు నిలుపుదల గురించిన ప్రాముఖ్యతని కోర్టు ఇలా వివరిం చింది. ‘ప్రథమ సమాచార నివేదిక విడుదల అయిన తరువాత అదే విధంగా కేసు విచారణ జరుగుతున్నప్పుడు అవసరమైన కేసుని నిలుపుదల చేసే హైకోర్టు అధికారం విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ అధికారాన్ని బాధ్యతాయుతంగా హైకోర్టులు నిర్వ ర్తించాలి. దర్యాప్తుని, అదే విధంగా కోర్టుల్లో విచారణని నిలిపివేయడ మన్నది చాలా అసాధారణ ప్రక్రియ. దీన్ని చాలా అవసరమైన కేసుల్లో మితంగా ఉపయోగించాలి. అది కూడా అధికార దుర్వినియోగం అయిన కేసుల్లో, న్యాయహితం కోసం మాత్రమే ఉపయోగించాలి’. ఏది అధికార దుర్వినియోగం? ప్రథమ సమాచార నివేదిక విడు దల కావడం అధికార దుర్వినియోగం అవుతుందా? ఒకవేళ అయితే ప్రతి కేసులో ఇలాంటి పరిస్థితే ఉంటుందేమో.

స్టేలు మంజూరు చేసినప్పుడు వాటిని సత్వరంగా విని పరిష్కరిం చాలి. అలాంటి పరిస్థితి మన దేశంలో ఉందా? దర్యాప్తు నిలిపివేయ డమే కాకుండా, ఎఫ్‌ఐఆర్‌ గురించిగానీ, ఎఫ్‌ఐఆర్‌లోని విషయాలను గానీ ఏ మాధ్యమంలో కూడా ప్రచురించకూడదన్న అసాధారణ ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసింది. ఇలాంటి ఉత్తర్వులు ఏ కారణాలతో జారీ చేసిందో అర్థం కాలేదు. కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వు, ప్రతి తీర్పు సహేతుక కారణాలతో ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడు కోర్టులమీద విశ్వసనీయత పెరుగుతుంది. న్యాయపరిపాలనలో అత్యంత ముఖ్యమైన అంశం సహేతుక కార ణాలు. అప్పుడే ప్రజాస్వామ్యయుతంగా కన్పిస్తుంది. సహేతుక కార ణాలతో ఉత్తర్వులు, తీర్పులు అనేవి సహజ న్యాయసూత్రాలకి వెన్నె ముక లాంటివి. అప్పీలుకి వెళ్లడానికి, పోకుండా ఉండటానికి ఆ కార ణాలు మార్గనిర్దేశనం చేస్తాయి.

ప్రతి ఉత్తర్వూ తీర్పు మూడు విషయాలని సంతృప్తి పరచాలి. అది ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఇరుపక్షాలకి అందుబాటులో ఉండాలి. మూడవది ముఖ్యమైనది తగు కారణాలు కలిగి ఉండాలి. ప్రథమ సమాచార నివేదిక అనేది పబ్లిక్‌ డాక్యుమెంట్‌. ఎవరైనా దాన్ని చూడవచ్చు.

వ్యాసకర్త: మంగారి రాజేందర్‌, (గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులుగా పనిచేశారు)
మొబైల్‌ : 94404 83001

మరిన్ని వార్తలు