శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?

27 Jun, 2022 00:42 IST|Sakshi

విశ్లేషణ 

పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇండియా పనితీరు అట్టడుగున ఉందని యేల్‌ యూనివర్సిటీ విడుదల చేసిన ‘ది ఎన్విరాన్‌మెంటల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇండెక్స్‌’ బయటపెట్టింది. దీన్ని కేంద్రం విమర్శించినప్పటికీ, ఇది దేశంలోని శాస్త్ర పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది. సామాజిక స్థాయిలో కోవిడ్‌ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు కూడా వార్తలున్నాయి. దేశ రక్షణ ప్రాజెక్టులను మినహాయిస్తే, మిగిలిన పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు స్వాతంత్య్రముండాలి.

పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా అట్టడుగున ఉందని ఇటీవలే విడుదలైన ‘ది ఎన్విరాన్‌మెంటల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇండెక్స్‌’ (ఈపీఐ) తెలపడం దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల స్వయం ప్రతిపత్తిపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమెరికాలోని సుప్రసిద్ధ యేల్‌ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన ఈ జాబితాపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితి వంటి పదకొండు వర్గాల్లో సుమారు 40 అంశాలను పరిశీలించి యేల్‌ యూనివర్సిటీ ‘ఈపీఐ’ని సిద్ధం చేయగా కేంద్రం మాత్రం ఈ అంశాల ఎంపికే తప్పని విమర్శించింది. అత్యధిక సమాచారం అవసరమయ్యే అంశాల ఆధారంగా ఒక దేశం పర్యావరణం, వన్యప్రాణి ఆవాస పరిరక్షణలకు చేస్తున్న ప్రయత్నా లను మదింపు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అయితే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను ఇక్కడ మనం పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. 

ఈపీఐ విడుదలైన నేపథ్యంలోనే కేంద్రం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వ్యవహారం ఒకటి వెలుగు లోకి వచ్చింది. డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది.

అంటే యేల్‌ లాంటి సంస్థలు తప్పుడు అవగాహనతో, సమాచారాన్ని ఊహించుకుని ఈపీఐ వంటి జాబితాలను రూపొందిస్తున్నాయని ఆరోపిస్తూనే... ఇంకోవైపు పర్యావరణ సంబంధిత శాస్త్రీయ సమాచారాన్నిచ్చే సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం కేంద్ర మంత్రిత్వ శాఖ చేస్తోందన్నమాట!

నిజానికి ఇలా మంత్రిత్వ శాఖలు పరిశోధన సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. డబ్ల్యూఐఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినప్పటికీ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోనే పనిచేస్తూం టుంది. ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ ఇలాంటి సంస్థలు చాలానే ఉన్నాయి. నిధుల వితరణ మొదలుకొని అనేక అంశాల్లో మంత్రిత్వ శాఖలు సంస్థల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తూంటాయి.

కరోనా మహమ్మారి ప్రబలిన సందర్భంలోనూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), వైద్య పరిశోధన విభాగాలు 2020 మే నెలలోనే దేశంలో సామాజిక స్థాయిలో కోవిడ్‌ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు వార్తలున్నాయి. ఈ వివరాలు ప్రచురి తమై ఉంటే వైరస్‌ నియంత్రణలో కేంద్రం భేషుగ్గా పనిచేస్తోందన్న ప్రచారంలోని డొల్లతనం ఇట్టే బయటపడేది. ఆ తరువాతి కాలంలో ఇదే విషయం రుజువైన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోకి రాని పరిశోధనా సంస్థలపై కూడా పెత్తనం చలాయించే ప్రయత్నాలు చేసిన సందర్భాలు బోలెడు. భారత్‌లో ఎన్‌డీఎం–1 సూపర్‌ బగ్‌ ఉనికిని బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు బట్టబయలు చేసినప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ రెండూ ఈ అంశంపై వ్యాఖ్యానించకుండా ప్రైవేట్‌ సంస్థ లనూ హెచ్చరించినట్లు సమాచారం ఉంది.

వైద్యం కోసం పలువురు విదేశీయులు భారత్‌కు విచ్చేస్తున్నారన్న ‘మెడికల్‌ టూరిజం’ దెబ్బ తినకుండా ఈ ప్రయత్నం అన్నమాట. అయితే కొన్ని నెలల తరువాత ఆరోగ్య శాఖ స్వయంగా ఎన్‌డీఎం–1 కారణంగా కొన్ని మందులకు నిరోధకత ఏర్పడుతున్నట్లు అంగీకరించాల్సి వచ్చింది. ఈ అంశంపై ఒక టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నావీ1సీ పేరుతో ప్రయోగించిన ఓ ఉపగ్రహంలో తీవ్రస్థాయి లోపాలున్నాయనీ,వైఫై సిగ్నళ్లకు స్పందిస్తోందనీ 2018లో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల శాస్త్రవేత్తలు గుర్తించగా... ఇస్రో వారి గొంతును నొక్కేసిందని సమాచారం. 

డబ్ల్యూఐఐ, నాగ్‌పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నీరి) వంటివి ఈ దేశానికి చాలా కీలకమైనవి. ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, పర్యావరణ పర్యవేక్షణకూ అవసరమైన పలు అంశాలపై ఈ సంస్థలు పరిశోధనలు చేస్తూంటాయి. భారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు వాటి కారణంగా వన్యప్రాణులకు, పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై కూడా ఈ సంస్థలే నివేదికలివ్వాలి. 1990ల మధ్యలో డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు దేశంలో ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల దయనీయ పరిస్థితిపై ఓ శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురించడం ఒక రకంగా సంచలనం సృష్టించిం దని చెప్పాలి.

తూర్పు తీర ప్రాంతంలో ఈ తాబేళ్లకు భారీ ప్రాజెక్టులు, యాంత్రిక ట్రాలింగ్‌ల కారణంగా మరింత విపత్తు రానుందని డబ్ల్యూఐఐ హెచ్చరించింది కూడా! గహిర్‌మాత బీచ్‌లో వేల తాబేళ్లు సంతానోత్పత్తి చేస్తూంటాయి. అయితే ఈ ప్రాంతానికి దగ్గరలోని ఓ ద్వీపంలో క్షిపణి పరీక్షా కేంద్రం ఒకటి ఏర్పాటు కావడంతో తాబేళ్ల ఉనికి ప్రశ్నార్థకమైంది. ‘‘డీఆర్‌డీవో వాడే ప్రకాశవంతమైన లైట్లు ఆ తాబేళ్లకు ప్రాణాంతకంగా మారాయి’’ అని డబ్ల్యూఐఐ శాస్త్రవేత్త ఒకరు విస్పష్టంగా తన పరిశోధనా వ్యాసంలో రాశారు. ఆ తరువాత డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు లైట్ల కాంతిని నియంత్రిస్తామని ప్రకటించాల్సి వచ్చింది.

పర్యావరణ సంబంధిత వ్యాజ్యాల్లో చాలా సందర్భాల్లో న్యాయ స్థానాలు కూడా పరిశోధనా సంస్థల, ఆయా రంగాల్లో నిపుణుల ‘స్వతంత్ర’ నివేదిక కోసం అడుగుతూంటాయి. చార్‌ధామ్‌ హైవే డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుల విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటే... జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పినా పర్యావరణ సంబంధిత ఆందోళనలను సమాధాన పరిచేందుకు ఓ పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సాంకేతిక సహాయం డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ‘నీరి’ అందించాయి.

ఐఐటీ రూర్కీ వంటి సంస్థలు తయారు చేసిన నివేదికలు పలు జలవిద్యుత్‌ కేంద్రాలకు అనుమతు లివ్వడంలో ఉపయోగపడ్డాయి. అయితే గతంలో ‘నీరి’ నివేదికలపై కూడా చాలా విమర్శలు వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రాజెక్టును ప్రతిపాదించిన వారికి అవి అనుకూలంగా ఉన్నాయని పలువురు వేలెత్తి చూపారు. మధుర రిఫైనరీ వల్ల జరుగుతున్న వాయు కాలుష్యాన్ని తక్కువగా చూపి, చిన్న పరిశ్రమలనే తాజ్‌మహల్‌ కాలుష్యానికి నిందించినట్టుగా ‘నీరి’పై ఆరోపణలున్నాయి. ‘నీరి’ డైరెక్టర్‌ సేవలను అవినీతి ఆరోప ణల నేపథ్యంలో అర్ధంతరంగా ముగించాల్సి రావడం, కొత్త డైరెక్టర్‌ నియామకంలో విపరీతమైన జాప్యం జరగడం ఇటీవలి పరిణామాలే. 

ఏతావాతా... దేశ పర్యావరణ పరిరక్షణకు కీలకమైన సేవ లందిస్తున్న జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల వ్యవహారాల్లో వేలు పెట్టడం ఏ ఒక్కరికీ మంచి చేసే విషయం కాదు. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో అన్ని స్థాయుల్లోనూ ఈ రకమైన ధోరణి పెరిగి పోతోంది. లక్ష్యిత ప్రయోజనాలు ఏమైనప్పటికీ శాస్త్రీయ పరిశోధన లను మాత్రం స్థిరంగా కొనసాగించాలి. దేశ రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులను మినహాయిస్తే మిగిలిన పరిశోధనల వివ రాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి.

తమ పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు పూర్తి స్వాతంత్య్రం ఉండాలి. అయితే దేశంలో అత్యున్నత విధాన నిర్మాతలైన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌తో పాటు ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ వంటి సంస్థలు ఈ స్వయం ప్రతిపత్తి విషయంలో మౌనంగా ఉంటున్నాయి. పరిస్థితి చేయి దాటక మునుపే మేలుకోవడం ఎంతైనా అవసరం! 

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

మరిన్ని వార్తలు