ఆమ్యామ్యాలకు అడ్డుకట్టపడేనా! | Sakshi
Sakshi News home page

ఆమ్యామ్యాలకు అడ్డుకట్టపడేనా!

Published Wed, Dec 20 2023 12:24 AM

నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ కార్యాలయం  - Sakshi

నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌లో పదేళ్లుగా కొందరు కౌన్సిలర్లు అడ్డూఅదుపు లేకుండా అవినీతికి పాల్పడుతున్నారనేది బహరింగ రహస్యం. అధికారులు సైతం అధికార బలాన్ని చూసి చర్యలు తీసుకోవడంలో కాస్త వెనుకడుగు వేయడంతో కొందరు కౌన్సిలర్లు ఇష్టారాజ్యంగా అన్ని విభాగాల్లోనూ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఇకనైనా మున్సిపాలిటీకి కౌన్సిలర్ల నుంచి విముక్తి లభిస్తుందా లేదా అనే సందేహాలు పట్టణ ప్రజల్లో నెలకొన్నాయి.

నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌కు సంబంధించిన కొందరు కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయం మొత్తం తమ ఆధీనంలో ఉండాలని, తాము చెప్పిందే నడవాలన్నట్టుగా వ్యవహరించారు. దీని కోసం తమ అధికార బలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి అవినీతికి పాల్పడ్డారు. మున్సిపల్‌ పరిధిలో కొన్ని వెంచర్లలో ఒక గ్రూప్‌గా ఏర్పడి అనుమతులకు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మున్సిపల్‌లో ఉద్యోగాల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్‌లో తమ అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించి రూ.లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు గతంలో వినిపించాయి. వీటిపై ఫిర్యాదులు అందినా.. అప్పటి అధికారులు కనీసం విచారణ కూడా చేట్టలేకపోయారు. వీరి అవినీతి ఎంత పరాకాష్టకు చేరుకుందంటే వీరు చేస్తున్న ప్రతి పనికి సహకరించలేక ఇక్కడి నుంచి ఓ అధికారి బదిలీ చేయించుకున్నాడు. డీజిల్‌ వినియోగంలో కూడా పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు గతంలో కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చినా.. వాటిపై కనీసం విచారణ చేపట్టలేదు. కేవలం మున్సిపల్‌లో తిరిగే వాహనాలకు మాత్రమే వాడాల్సిన డీజిల్‌ను కౌన్సిలర్లు పెట్రోల్‌బంకు యామానులతో కుమ్మకై తమ సొంత అవసరాలకు వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఇవేకాకుండా మున్సిపల్‌ అనుమతుల విషయంలోనూ పెద్దఎత్తును డబ్బులు చేతులు మారాయి. కొన్ని వార్డుల్లో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేని నిర్మాణాలు కొనసాగుతున్నా.. వాటిని ఆపకుండా కౌన్సిలర్లు వాటిని ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. అయితే అన్నిశాఖల్లో జరిగిన అవినీతిపై దృష్టిసారిస్తామని అధికార పార్టీ చెప్పడంతో పలువురు కౌన్సిలర్లు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు పార్టీ మారేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది.

అన్నీ ఆరోపణలే..

ఫ కందనూలు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ హయాంలో మెచ్చుమీరిన అవినీతి

ఫ ఎన్నికల్లో ప్రభావం చూపిన కౌన్సిలర్ల తీరు

ఫ అధికార బలంతో అధికారులపై ఒత్తిడి

ఫ కొత్త ప్రభుత్వంపై ఆశలు పెంచుకున్న ప్రజలు

కౌన్సిలర్లపై ఉన్న వ్యతిరేకతతో..

మున్సిపల్‌ ఎన్నికల్లో జరిగిన అవినీతి, అక్రమాలే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయి. మున్సిపల్‌ పరిధిలో ప్రచారం సమయంలో అవినీతికి పాల్పడిన కౌన్సిలర్లపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చాయి. అవినీతి మాత్రమే కాకుండా కొందరు కౌన్సిలర్లు భూ కబ్జాలకు పాల్పడటం కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ పరిధిలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కేవలం కౌన్సిలర్ల మీద ఉన్న వ్యతిరేకతే బీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టం వాటిల్లిందనే ప్రచారం జోరుగా సాగుతుంది.

Advertisement
Advertisement