మన మందులు మంచివేనా?

24 Oct, 2022 00:32 IST|Sakshi

కామెంట్‌ 

ఒక భారతీయ కంపెనీ తయారుచేసిన దగ్గు సిరప్‌ల వల్ల గాంబియా దేశంలో 66 మంది పిల్లలు చనిపోయారన్న వార్త దేశ ప్రతిష్ఠను దెబ్బతీసింది. భారతదేశంలో తయారయ్యే ఔషధాలు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తున్నాయా? భారతీయ తయారీ జనరిక్‌ ఔషధాలు ఒరిజినల్‌ మందులంత మంచివేనా? దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నలకు సమాధానం ‘అవును’ కాదు. మన తయారీ నాసిరకపు ఔషధాల వల్ల పేద దేశాల్లోని రోగులే కాదు, లక్షలాది మంది భారతీయులు కూడా ప్రభావితం అవుతున్నారు.

లేబుల్‌ మీద ప్రకటించినంత మందు తీరా మాత్రలో ఉండకపోవడం, ఔషధాల్లో కలిసే అవకాశమున్న విష రసాయనాలను గుర్తించే యంత్రసామగ్రి లేకపోవడం, అసలు మొత్తంగానే ఒక కఠినమైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు దేశీయుల ఉసురు తీస్తున్నాయి. భారతీయ ఔషధ పరిశ్రమలోని లోపాలను ఎత్తిచూపుతూ దినేష్‌ ఎస్‌. ఠాకూర్, టి.ప్రశాంత్‌ రెడ్డి రాసిన ‘ద ట్రూత్‌ పిల్‌: ద మిత్‌ ఆఫ్‌ డ్రగ్‌ రెగ్యులేషన్‌ ఇన్‌ ఇండియా’ ఎన్నో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. 

మెయిడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన దగ్గు సిరప్‌లు గాంబియా దేశంలో 66 మంది పిల్లల మరణాలకు దారితీశాయని వచ్చిన వార్తలు ఇండియాను ఇబ్బందికి గురిచేశాయి. భారతదేశంలో ఔషధాలను ఎలా తయారుచేస్తున్నారో, ఎలా క్రమబద్ధీకరిస్తున్నారో తెలిపే దుర్భరమైన వాస్తవానికి ఇది ఒక సంకేతం మాత్రమే.

ఈ నెలలోనే ప్రచురితమైన ‘ద ట్రూత్‌ పిల్‌: ద మిత్‌ ఆఫ్‌ డ్రగ్‌ రెగ్యులేషన్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకం దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని వెల్లడించింది. ఈ పుస్తక రచయితలు దినేష్‌ ఎస్‌. ఠాకూర్, టి. ప్రశాంత్‌ రెడ్డి రెండు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. ఒకటి, భారతీయ మందులు ఎల్లవేళలా సురక్షితంగానూ, సమర్థంగానూ పనిచేస్తు న్నాయా? రెండు, భారతీయ తయారీ జనరిక్‌ ఔషధాలు ఒరిజినల్‌ మందులంత మంచివేనా?

సమాధానం ‘లేదు’ అనే చెప్పాల్సి ఉంటుంది. తొలి ప్రశ్నకు ఈ పుస్తక రచయితలు చెప్పిన సమాధానం ఏమిటంటే... ‘‘మార్కెట్లో పంపిణీ అవుతున్న నాసిరకపు మందుల సునామీని భారతదేశం విప్పారిన నేత్రాలతో చూస్తోంది...  దీనివల్ల ప్రభావితులైన రోగుల మొత్తం సంఖ్య... వందలు, వేలు మాత్రమే కాదు బహుశా లక్షల్లో ఉంటుందని మేం అనుమానిస్తున్నాం.’’ ఇక రెండో ప్రశ్నకు జవాబుగా వారు సింపుల్‌గా చెప్పిందేమిటంటే: ‘‘మేము అలా భావించడం లేదు’’ అనే.

ఈ పుస్తకంలోని వివరణాత్మకమైన, చక్కటి పరిశోధనతో కూడిన 500 పేజీల అధ్యయనం విస్తృతమైన అంశాలను తడిమింది. దేశంలో ఔషధాలు తయారు చేస్తున్న విధానం ఎంత లోపభూయిష్ఠంగా ఉందో ఈ పుస్తకం వివరించింది. కొన్ని కంపెనీలు తప్పుడు ప్రక టనలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే ఎలాంటి లైసెన్సు లేకుండానే మందులను ఉత్పత్తి చేస్తున్నాయి. అవసరమైన పరీక్షలు చేయడానికి సమర్థమైన యంత్ర సామగ్రి కూడా వీటివద్ద లేకపోవడం గమనార్హం. అనేక తప్పుడు విధానాలు అవలంబిస్తున్న కొన్ని కంపెనీల బండారం బయటపడుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.

భారతీయ మందుల దుర్భరమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ గురించిన సమగ్ర వివరాలను కూడా ఈ పుస్తకం పొందుపర్చింది. మన రెగ్యులేటర్లు అరుదుగా, ఎప్పుడో తప్ప ఔషధ తయారీ కర్మా గారాలను భౌతికంగా తనిఖీ చేయరు. దీనికి బదులుగా వాళ్లు ప్రశ్నించదలచిన మందుల తయారీ బ్యాచ్‌ రికార్డుల కాపీని మాత్రమే అడుగుతుంటారు. వారు అనుసరించే మార్గదర్శకాలు న్యాయ విచారణను సైతం నిరుత్సాహపరుస్తుంటాయి. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, వ్యవ హారం కోర్టు వరకూ వెళ్లిన ప్పుడు, చాలా మామూలు శిక్షలు మాత్రమే పడుతుం టాయి. ‘కోర్టు ముగిసే వరకూ విధించే సాధారణ శిక్ష’ లాంటిది. అది అసలు శిక్షే కాదని చెప్పవచ్చు కూడా! 

ఈ పుస్తక రచయితలు తమ ముందుమాటలో ఇచ్చిన ఉదాహరణతో ఒక భయానక స్థితి గురించి నన్ను వర్ణించనివ్వండి. 2019 సంవత్సరంలో డైయాథిలిన్‌ గ్లైకాల్‌ (డీఈజీ)ను కలిగివున్న దగ్గు సిరప్‌ తీసుకున్న 21 మంది చిన్నపిల్లల చనిపోయారు. దీన్ని తయారుచేసింది డిజిటల్‌ విజన్‌ కంపెనీ. డైయాథిలిన్‌ గ్లైకాల్‌ అనేది పారిశ్రామిక ద్రావణి(సాల్వెంట్‌). దీన్ని ‘ఆంటీఫ్రీజ్‌’గానూ, ‘బ్రేక్‌– ఫ్లూయిడ్‌’గానూ ఉపయోగిస్తుంటారు.

1972 నుంచి డీఈజీ అనేది పిల్లలకు విషంగా మారిన ఘటనలు అయిదుసార్లు సంభవించాయి. అయినప్పటికీ ఔషధాల్లో దీని జాడను ఎవరూ కనుగొనలేక పోతున్నారు. కారణం... భారతీయ ఔషధ కంపెనీలు ఔషధ తయా రీకి ముందు తమ ముడి సరుకును గానీ, తయారయ్యాక ఉత్పత్తిని మార్కెట్లోకి పంపడానికి ముందుగానీ పరీక్షించడంలో తరచుగా విఫలమవుతుండటమే!

ఇది డిజిటల్‌ విజన్‌ కంపెనీ తొలిసారి చేసిన క్షమించరాని తప్పేమీ  కాదు. 2012–19 మధ్యకాలంలో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన మందులు నాణ్యతా పరీక్షల్లో మొత్తంమీద 19 సందర్భాల్లో విఫల మయ్యాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ పరిధిలోకి వచ్చే డిజిటల్‌ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఆ డ్రగ్‌ కంట్రోలర్‌ డీఈజీ మిశ్రమాలను పరీక్షించడానికి తగిన ఏర్పాట్లు కంపెనీ చేయనేలేదని హైకోర్టుకు తెలిపారు.

అయితే ఆ డ్రగ్‌ కంట్రోలర్‌ ఈ విషయాన్ని కనుగొనడానికి అంతకుముందు 19 సార్లు అవకాశాలు వచ్చినప్పటికీ అలా పరీక్షించడంలో విఫలమయ్యారు. డ్రగ్‌ కంట్రో లర్‌ తనిఖీ సమయంలోనే ఈ లోపాలను కనిపెట్టి ఉండాలనీ, అలా చేసివుంటే కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్‌ లైసెన్సును తక్షణమే రద్దు చేసి ఉండేవారనీ ఈ పుస్తక రచయితలు పేర్కొన్నారు.

ఇంకోసంగతి. మరి, ఒక ఔషధం దాని లేబుల్‌ మీద ప్రకటించిన మేరకు లేకపోతే దాని పరిణామాలేమిటి? ఈ పుస్తకం అజిత్రో మైసిన్‌కు సంబంధించి ఒక విషయం పేర్కొంటోంది. ఆల్కేర్‌ లేబొ రేటరీస్‌ తయారుచేసే అజిత్రోమైసిన్‌లో లేబుల్‌ ప్రకారం నిజానికి 200 మిల్లీగ్రాముల అజిత్రోమైసిన్‌ ఉండాలి. కానీ అందులో ఉన్నది 25.69 గ్రాములే. అంటే కేవలం 12.85 శాతమే. ఇలాంటి మందులు వాడినప్పుడు ఉండదగిన పరిణామం గురించి రచయితలు ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘‘రోగి చనిపోవడానికి అత్యధిక అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆ మాత్రలో ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించడానికి అవసరమైన ‘చాలినన్ని’ యాక్టివ్‌ ఇన్‌గ్రేడియెంట్లు లేవన్న మామూలు కారణంతో.’’

భారతదేశంలో చౌక ధరలకు లభ్యమవుతూ జనాదరణ పొందిన జనరిక్‌ మందులు నిజానికి అసలు మందులతో సమానం కాకపోతే జరిగేదేమిటో కూడా ఈ పుస్తకం వివరించింది. నిర్దిష్టంగా చెప్పాలంటే జనరిక్‌ మందులపై జీవ సమానత్వ (బయో ఈక్వలెన్స్‌) పరీక్ష చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పరీక్ష అరుదుగానే జరుగు తుంది. ‘‘తప్పనిసరిగా చేయవలసిన జీవసమానత్వ పరీక్ష లేమి కారణంగా దేశంలో వందలాది కాదు, వేలాది జనరిక్‌ మందుల బ్రాండ్లను ఆమోదించవలసి వచ్చింది. ఇలా ఆమోదం పొందిన చాలా బ్రాండ్లు ఎందరో రోగుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంది’’ అని ఈ పుస్తక రచయితలు చెబుతున్నారు.

అనేక భారతీయ ఔషధ ఉత్పత్తి సంస్థలు నాణ్యతతో పాటు, విధానపరమైన నియంత్రణ, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించా యన్నదే ఈ పుస్తకానికి ముగింపు అని నేను చెబుతాను. అయిన ప్పటికీ, ప్రజలను దెబ్బతీస్తున్న లేదా చంపుతున్న నేరాలకు పాల్పడిన ఈ కంపెనీలు అరుదుగా కూడా భౌతిక శిక్షలు ఎదుర్కోవడం లేదు. ఇదే నిజానికి అత్యధికంగా భయపెడుతోంది. కానీ ప్రభుత్వం ఏ చర్యలకూ ఉపక్రమించకపోతే, మనం చేయగలిగేది ఏమీ ఉండదు కదా!

కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు 

మరిన్ని వార్తలు