పరిశోధనలో ఆయన ఘనాపాఠి

2 Jan, 2022 01:32 IST|Sakshi

ననుమాస స్వామి అనగానే గుర్తొచ్చేవి కుల పురాణాలు. ఎన్నో కులాల పుట్టుపూర్వోత్తరాలను ఆయన జానపద గా«థల ఆధారంగా తెలియజేశారు. ముఖ్యంగా వృత్తి పురాణాలపై ఆయన చేసిన పరిశోధన పండితుల ప్రశంసలను అందుకుంది. అలాగే ఆయన అనేక ఉద్యమ గీతాలను అందించి తెలంగాణ ఉద్యమానికి ఊపును తీసుకొచ్చారు.

1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, అరెస్టయి వరంగల్‌ సెంట్రల్‌ జైలులో శిక్షను అనుభవించిన యోధుడు ననుమాసస్వామి (నమామి). అప్పటినుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తన భుజానెత్తిన తెలంగాణ జెండాను దించలేదు. 2013లో తెలంగాణ పోరాట యోధుల సంఘాన్ని స్థాపించారు. సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, శరద్‌ యాదవ్, ఏబీ బర్దన్‌ లాంటి నాయకులకు విజ్ఞా పన పత్రాలను అందించారు. 

1969లోనే గాదు, 2001 నుండి తెలంగాణా ఉద్యమ గీతాలను రాసి పాడి తొలి తెలంగాణ ఉద్యమ వాగ్గేయ కారుడు అనిపించుకొన్నారు. 1969 లోనే ఉద్యమగీతాలు ‘అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్య’ లాంటి పాటతోపాటు మరో ఏడు పాటలను రాశారు. 2001లో తెరాస ఆవిర్భావసభ సందర్భంగా కూడా నాలుగు పాటలు రాసి 1969 నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటారు.  

నిరక్షరాస్యుల కుటుంబంలో పుట్టిన ననుమాస స్వామి మూడు డాక్టరేట్లు, ఒక ఎం.ఫిల్‌ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూనే 1990లో ‘తెలుగు పరిశోధన’ పత్రికను స్థాపించి, పరిశోధన లను పదునెక్కించారు. ఎంతోమంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఆయన పర్యవేక్షణలో 21 మంది పరి శోధకులు పీహెచ్డీ పట్టాలనూ, తొమ్మండుగురు ఎం.ఫిల్‌ పట్టా లనూ సాధించారు. 

వృత్తి పురాణాల పరిశోధన కోసం ఆయన ఉభయ తెలుగురాష్ట్రాల్లో గ్రామగ్రామాన తిరిగి 14 చిత్రపటం కథా ప్రదర్శనలను, 34 వృత్తి కథా ప్రదర్శనలను వీడియో రూపంలో సేకరించారు. మడేల్, నాయీ, ముదిరాజ్, గౌడ పటంకథలతో సహా 12 పుస్తకాలను ప్రచురించారు. జానపద పురాణాలు, కుల పురాణం పేరుతో వివిధ పత్రికల్లో విస్తారంగా కాలమ్స్‌ రాశారు. ఇవి కొన్ని ఏళ్ల తరబడి కూడా కొనసాగాయి. వృత్తి దేవతలు పేరిట ఎస్వీ భక్తి చానల్లో ధారావాహిక నిర్వహించారు. ‘ఊసెత్తుతే చాలు ఉలిక్కిపడే పురాణాలు’ అంశం మీద 13 గంటలు ధారాళంగా ఉపన్యసించి ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌’ (2015)లోకి ఎక్కారు. అమె రికా, శ్రీలంక, యూకే లాంటి దేశాల్లో జరిగిన సదస్సులలో పాల్గొని, పరిశోధన పత్రాలను సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు అధ్యా పక సంఘంలో 1995 నుండి 2011 దాకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అన్నింటా తెలుగు భోధన ఉండాలని ఉద్యమించి ప్రగతిని సాధించారు. 2011లో ‘భాషా పరిరక్షణ సమితి’ని స్థాపించి మౌలానా ఆజాద్‌ నేషనల్‌ యూనివర్సిటీలో, అంతర్జాతీయ యూనివర్సిటీలో తెలుగు శాఖలను ఏర్పాటు చేయించేందుకు చొరవ తీసుకున్నారు.
– డా. నేతి మాధవి,జానపద పరిశోధకురాలు
(నేడు హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ననుమాస స్వామి మూడు పుస్తకాలు – ప్రవహిస్తున్న జైలుగానం,గాడ్గే బాబా, తెలంగాణ బోనాలు – ఆవిష్కరణ కానున్నాయి) 

మరిన్ని వార్తలు