సాధికారతకు నిలువెత్తు రూపం

18 Sep, 2021 01:12 IST|Sakshi

ఒకటిన్నర దశాబ్దంపైగా జర్మనీ చాన్స్‌లర్‌గా ఉన్న ఏంజెలా మెర్కెల్‌ ఈనెలలో పదవీ విరమణ చేయనున్నారు. తన వాస్తవికమైన, ఏకీకరణ రాజకీయాల కారణంగా ప్రపంచ నేతల్లో ఒకరిగా పేరుపొందారు. దేశ అత్యున్నత పదవిని అలంకరించిన మొదటి మహిళా చాన్స్‌లర్‌గా, తొలి తూర్పు జర్మనీ వ్యక్తిగా చరిత్రలో నిలిచి ఉంటారు. సాధికారతకు ఆమె నిలువెత్తు రూపం. ఆమె వ్యక్తిత్వం, రాజకీయాలు, ఆమె కనిపించే తీరు ఈ సాధికారతకు ప్రతిబింబమై నిలిచాయి. వ్యక్తిత్వపరంగా ఎలాంటి ఆకర్షణా లేని ఒక మహిళ ప్రతీ ఒక్క ప్రతిపక్ష పార్టీని తోసిరాజని, ఎన్నిక తర్వాత ఎన్నికలో ఓటర్ల విశ్వాసాన్ని పొందుతూ రావడం అరుదైన విషయం. మెర్కెల్‌ హయాంలో భారత్‌కి జర్మనీ మద్దతు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. జర్మనీ నాయకత్వం భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకోనుందని మన దేశం నిశితంగా పరిశీలిస్తోంది.

పాశ్చాత్య ప్రపంచంలో సుదీర్ఘకాలం కొనసాగిన రాజకీయ నేతల్లో ఒకరైన ఏంజెలా మెర్కెల్‌ ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మహిళా చాన్స్‌లర్‌ 21వ శతాబ్ది జర్మన్‌ రాజకీయాల్లో నిర్వహించిన పాత్రను రెండు దశలుగా విభజించాలి. 67 సంవత్సరాల వయసున్న మెర్కెల్‌ దేశ అత్యున్నత పదవిని అలంకరించిన మొదటి మహిళా చాన్స్‌లర్‌గా, తొలి తూర్పు జర్మనీ  వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. తన రాజకీయ గురువు హెల్మెట్‌ కోల్‌ తర్వాత ఆధునిక యుగంలో సుదీర్ఘ కాలం జర్మనీ అధినేతగా పనిచేసిన రెండో వ్యక్తి ఈమే. ఒక మహిళా నేతగా, సైంటిస్టుగా, సాధారణ గృహిణిగా మెర్కెల్‌ని వర్ణిస్తూ ఇదివరకే ఎన్నో పుస్తకాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. డజన్లకొద్దీ వ్యాసాలు రాశారు. కానీ జర్మనీకి చెందిన అత్యంత ప్రభావిత చాన్స్‌లర్‌గా ఆమె నాయకత్వం గురించి ఎవరూ సరిగా వర్ణించలేకపోయారు. ఆమె సమకాలీన నేతలు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్లు్యబుష్‌ క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకున్నారు. ఆమె సమకాలిక నేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒక్కరే ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.


జర్మనీ, యూరప్‌ని మెర్కెల్‌ ఎలా నడిపించారు!
మెర్కెల్‌ శక్తియుక్తులు అసామాన్యం. సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ఆమె నాయకత్వ నైపుణ్యాలను జర్మనీ ఇక చూడలేదు. అనేక ప్రాంతాల నుంచి అనేక కారణాలతో వస్తున్న వలస ప్రజలను ఆహ్వానిస్తూ జర్మనీ సరిహద్దులను తెరిచిన సాహస నాయకత్వం ఆమెది. అంతేకాకుండా 2000 సంవత్సరంలో ముంచుకొచ్చిన ఆర్థిక మాంద్యం నుంచి యూరోపియన్‌ యూనియన్‌ని బయటపడేయడంలో మెర్కెల్‌ నిర్ణయాత్మక ప్రభావం వేశారు. అంతర్జాతీయ సంబంధాలను, భౌగోళిక వ్యూహాత్మక, రాజకీయాలను అర్థం చేసుకోవడంలో ఆమె ప్రతిభ ప్రశంసనీయం. అయితే అతి సంక్లిష్టమైన అంతర్జాతీయ సంక్షోభాల పొడవునా ఆమె పాటించిన వాస్తవికవాద ఆచరణ ఆమెను ఆధునిక జర్మనీ రాజకీయాల్లో సమున్నతంగా నిలబెట్టింది.

జర్మన్లు తొందరపాటు స్వభావం కలిగినవారు. కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో జర్మనీని నాయకురాలిగా ప్రపంచం చూస్తుండగా, జర్మన్లు మాత్రం తమ నాయకత్వంపై అనుమానాలు పెట్టుకున్నారు. కానీ భారత్‌ వంటి దేశాల్లో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చూసిన తర్వాత మెర్కెల్‌ నేతృత్వంలోని జర్మనీ పరిస్థితి మరీ అంత తీసికట్టుగా లేదని జర్మన్లు అభిప్రాయానికొచ్చారు. జర్మన్లు తమ నేతను ఎలా చూస్తారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ కూడా. గత 16 సంవత్సరాలలో మెర్కెల్‌ జనామోద రేటింగులు ప్రారంభంలో విమర్శలకు దారితీశాయి. కానీ ఈరోజు జర్మనీ ప్రజలు మెర్కెల్‌కి దన్నుగా ఉన్నారు. ఇప్పుడామె అయిదోసారి చాన్స్‌లర్‌ పదవికి పోటీ చేసినా జర్మన్లు ఆమెనే గెలిపిస్తారంటే సందేహమే లేదు. గత సంవత్సరం కూడా ఆమెను 57 శాతం రేటింగుతో జర్మన్లు ఆమోదించడమే దీనికి తార్కాణం. స్వదేశంలోనే కాదు, యూరోపియన్‌ పౌరులు సైతం మెర్కెల్‌ పట్ల విశేషాదరణ చూపారు. విదేశీ సంబంధాలపై యూరోపియన్‌ కౌన్సిల్‌ నిర్వహించిన సర్వే ప్రకారం, ఈయూ అధ్యక్షుడు కావడానికి మెర్కెల్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌లలో ఎవరికి అవకాశం ఉంది అనే ప్రశ్నకుగాను మెర్కెల్‌కే ఎక్కువమంది ఓటేశారు. ఈయూ సభ్యదేశాల్లో ఆమెకు 52 నుంచి 58 శాతం ఆమోదం లభించగా మెక్రాన్‌కి కేవలం 6 నుంచి 11 శాతం మాత్రమే ఆమోదం లభించడం గమనార్హం.

అమెరికా ఫస్ట్‌ అనే ట్రంప్‌ పాలనా విధానాలకు వ్యతిరేకంగా నిలబడిన మెర్కెల్‌ ప్రపంచ నాయకుల ప్రశంసలందుకున్నారు. అలాగే సమీకృత అభివృద్ధికి, బహుళ సంస్కృతికి ఆమె నిర్వచనంగా నిలి చారు. అత్యంత మితవాద పక్షమైన ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ పార్టీ పార్లమెంటులో మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం లభించిన వాతావరణంలోనూ ఆమె తన విధానాలను కొనసాగించారు. ప్రపంచక్రమాన్ని సమతుల్యం చేయడం వైపుగా ప్రపంచ నాయకత్వం స్పందించడానికి ఆమె ఒక కాంతిరేఖలా మారారు. ఒక మత బోధకుడి కుమార్తెగా సిగ్గును అలంకారంగా చేసుకున్న మెర్కెల్‌ ఆధునిక యూరప్‌ సాధికారికమైన నేతల్లో ఒకరుగా వెలుగొందారు. తన సొంత క్రిస్టియన్‌ డెమోక్రాటిక్‌ యూనియన్‌ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె తన పంథానుంచి వెనుదిరగలేదు.

కొంతమంది జర్మన్లు ఆమెను నిరాసక్తత కలిగిన మహిళగా పిలిచారు. జర్మనీలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆమెకు వ్యతిరేకంగా జనాకర్షక నేతను ఎందుకు నిలబెట్టలేదని కొందరు ప్రశ్నిం చారు. కానీ జర్మనీలో గణనీయ సంఖ్యలో ప్రజలు ఆమెను విశ్వసిం చారు. ఎందుకంటే జర్మన్లకు ఒకరకమైన భద్రతను ఆమె కలిగించారు. ఆమెకు సరిసమాన స్థాయిలో నిలిచే నేతలు ఎవరూ లేరని ఒక తరం ఓటర్లు భావించారు. ఈ జర్మనీ మాత.. సామాజిక, రాజకీయ ప్రభావాలతో పనిచేసే మీడియాను తనకు అనుకూలంగా మార్చుకుని సామరస్యత సాధించారు. సాధికారతకు నిలువెత్తు రూపమై ఆమె నిలి చారు. ఆమె వ్యక్తిత్వం, రాజకీయాలు, ఆమె కనిపించే తీరు ఈ సాధికారతకు ప్రతిబింబమై నిలిచాయి. చివరకు ఆమె వేషధారణ, ఫ్యాషన్‌ కూడా స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. వ్యక్తిత్వపరంగా ఎలాంటి ఆకర్షణా లేని ఒక మహిళ ప్రతీ ఒక్క ప్రతిపక్ష పార్టీని తోసిరాజని, ఎన్నిక తర్వాత ఎన్నికలో ఓటర్ల విశ్వాసాన్ని పొందుతూ రావడం అరుదైన విషయం. ఒక దశలో హెల్మెŠట్‌ కౌల్‌ ‘చిన్నమ్మాయి’గా ఈసడింపునకు గురైన మెర్కెల్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రభావిత నేతల్లో ఒకరుగా ప్రసిద్ధి చెందారు.

మెర్కెల్‌ అనంతరం ఇండో–జర్మన్‌ సంబంధాలు భారత ప్రధాని నరేంద్రమోదీ, జర్మనీ చాన్స్‌లర్‌ మధ్య మిత్రుత్వం గురించి ఇప్పటికే చాలా చెబుతూ వచ్చారు. భారత్‌కి సంబంధించి నంత వరకు ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన జర్మనీ నాయకత్వం భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకోనుందని మన దేశం నిశి తంగా పరిశీలిస్తోంది. మెర్కెల్‌ హయాంలో భారత్‌కి జర్మనీ మద్దతు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా సాంకేతిక, సహకార పథకాల్లో భారత్‌కి సహాయం చేస్తున్న అగ్రదేశాల్లో జపాన్‌తోపాటు జర్మనీ కూడా చేరిపోయింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జర్మనీ మద్దతును భారత్‌ పొందగలి గింది. ఆసియా ప్రాంతంలో సమీకరణల రీత్యా భారత్‌కు ఇక ముందు కూడా జర్మనీ మద్దతు కొనసాగించవచ్చు. 

ఆసియా ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని, దాని దూకుడు ఆర్థిక విధానాలను మెర్కెల్‌ అదుపు చేయలేకపోయింది. తాజాగా జర్మనీ విడుదల చేసిన ఇండో–పసిఫిక్‌ విధాన పత్రం సరైన దిశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఊహాజనితంగానే ఉంటుంది. యూరోపియన్‌–భారత్‌ మధ్య ఎఫ్‌టీఏ చర్చలు దశాబ్ద కాలంగా అసంపూర్తిగా సాగుతున్నాయి. భారత్, జర్మనీలు తమ మధ్య 70 ఏళ్లపాటు సాగుతున్న దౌత్య సంబంధాలకు ఇటీవలే వేడుక చేసుకున్నాయి కానీ ఇరుదేశాల మధ్య లోతైన సంబంధాలు ఇంకా ఏర్పడలేదు. భారత్‌తో కుదుర్చుకున్న పి.75–1 సబ్‌మెరైన్‌ ప్రోగ్రాం నుంచి బయటకు వచ్చింది. దీంతో జర్మనీ రక్షణరంగ కంపెనీలు దాదాపుగా భారత్‌లో లేకుండాపోయాయి. సెప్టెంబర్‌ 26న జర్మనీ తన తదుపరి నేతను ఎంపిక చేసుకోవడానికి సిద్ధపడుతోంది. తనకు ఎంతో అవసరమైన విరామానికి సిద్ధమవుతున్నట్లు ఎంజెలా మెర్కెల్‌ ఇప్పటికే స్పష్టంచేసి ఉన్నారు. దీంతో, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా నేత బెర్లిన్‌లో తన నివాసానికి సమీపంలోని సూపర్‌ మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేస్తూ కనిపించవచ్చు.

సునందారావు ఎర్డెమ్‌
సీఈఓ, సెరఫిమ్‌ కమ్యూనికేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ
(ది క్వింట్‌ సౌజన్యంతో...) 

మరిన్ని వార్తలు