Vemana: లోకకవి మన వేమన!

19 Jan, 2023 13:18 IST|Sakshi

సందర్భం

వానకు తడవని వారూ, ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారూ ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పార బట్టిన మనో వైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘసంస్కర్త, విప్లవకారుడు వేమన. 1839లో తొలిసారిగా బ్రౌన్‌ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనేకమంది ఆయనపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషలలోకి అనువదించడానికి కారకులయ్యారు. ఆంగ్ల, ఐరోపా భాషల్లోకీ; అన్ని ద్రవిడ భాషల్లోకీ వేమన పద్యాలు అనువాదమయ్యాయి. సి.ఇ. గోవర్‌ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్ధులై ఆయనను లోక కవిగా కీర్తించారు. 

వేమన 1602–1730 మధ్య కాలానికి చెందిన వాడనీ కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వాడనీ అంటారు. జనబాహుళ్యంలో ఉన్న వివరాల ప్రకారం, వేమన అసలు పేరు బెధమ కోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెధమ కోమటి పెదవేమారెడ్డి. వేమన జన్మించిన ప్రాంతంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చివ రిగా ఆయన అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న కటారు పల్లె ప్రాంతానికి చెందిన వారని నిర్ధారించారు. అందుకే ఆ ప్రాంతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకుంది. 

వేమన భోగలాలసుడుగా తిరుగుతూ ఒకానొక దశకు వచ్చేటప్పటికి ఓ సాధువు ద్వారా ఆత్మ జ్ఞానం పొంది అన్నింటినీ త్యజించి యోగిలా మారిపోయాడని అంటారు. సంసార బాధలనుండి ఉపశమనం పొందడానికి తనను ఆశ్రయించే అభాగ్యులకు తన పద్యాల ద్వారా తత్వాన్ని బోధించడం మొదలు పెట్టాడు. తన మాటల ద్వారా తనలో జ్ఞానజ్యోతిని మొట్ట మొదటగా వెలిగించిన తన ప్రేయసి విశ్వద పేరును, తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు అభిరాముడి పేరును తన పద్యాలకు మకుటంలో చేర్చి వారికి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు వేమన అనేది కొందరి అభిప్రాయం. అయితే అసలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలనీ... వేమన చిన్న నాటి నుంచే జ్ఞానశీలి అనీ, తదనంతరం స్నేహితుల ప్రభావంవల్ల దారితప్పి, ఆపై పరివర్తన వచ్చి యోగిగా మారాడనీ అంటారు. ఆయన పద్యమకుటానికి ‘సృష్టి కర్తకు ప్రియమైన వేమా వినుము’ అని పండితులు మరో అర్థాన్ని చెప్పారు. బ్రౌన్‌ ఈ అర్థాన్నే తీసుకొని వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. 

వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కవిత్వంలో స్పృశించని అంశమే లేదు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు; మతం పేరిట జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు... ఒకటే మిటి? కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తనకలం ఝుళిపించాడు. 

సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్లు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా శక్తిమంతంగా వ్యక్తీకరించారు. వేమన పద్యా లన్నీ ఆటవెలది చందస్సులోనే చెప్పాడు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గుర జాడ అంటాడు శ్రీశ్రీ. ‘వేమన కవిత్వం గాయానికి మందు రాసినట్లు కాక, ఆ గాయం చేసిన కత్తికే ముందు మందు పూసినట్లుంటుంది’ అంటారు రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ. తన పద్యాలలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎలిగెత్తి చాటిన సామ్యవాద ప్రజా కవి వేమన. (క్లిక్ చేయండి: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట)

- పి. విజయబాబు 
అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ
(జనవరి 19 వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా) 

మరిన్ని వార్తలు