ఈ జీఓతో సమస్య మళ్లీ మొదటికి!

4 Jan, 2022 13:21 IST|Sakshi

ఘన చరిత్ర గల తెలంగాణ ఉద్యమం ముల్కీ నిబంధనలతో  మొదలై 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సుఖాంతం అయిందని అను కున్నాం. కానీ  317  జీ.ఓ తో సమస్య మళ్లీ మొదటికి వస్తుందని అనుకోలేదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గలవారి ప్రభుత్వంలో ఈ విధమైన పరిస్థితి దాపురించడం శోచనీయం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 371డి అధికరణ అవసరం లేదని కొందరు, భౌగోళిక తెలంగాణలో కూడ చాలా అంతరాలు ఉన్నాయని 371డి అధికరణ కొత్త రాష్ట్రంలో కూడా అవసరమని మెజార్టీ సమాజం అభి ప్రాయం వ్యక్తం చేసింది. దానికి అనుగుణంగానే కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో వెలువడ్డాయి. అయితే ఇక్కడే అసలు సమస్య ప్రారంభమయ్యింది. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు– 95:5 ప్రకారం కొత్త నియామకాలు చేపట్టనున్నందువల్ల స్థానికతకు పెద్దపీట వేస్తున్నట్లు అర్థమయింది. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కూడా అదే. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 124 తేదీ 30–8–2018 ప్రకారం 31 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా ఏర్పరచడం, తదుపరి 128 జీవో ప్రకారం ముప్పై మూడు జిల్లాలకు అనుమతి పొందడం చాలా మంచి పరిణామమే. అయితే 10 జిల్లాల ఉద్యోగ, ఉపాధ్యాయులను 33 జిల్లాలకు కేటాయించడానికి  కొత్తగా విడుదలైన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికత అనే పదం లేకపోవడం సీనియార్టీ అనే పదం మాత్రమే ఉండటంతో ఏ స్థానికత కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో,  ఏ స్థానికులకు ప్రయోజనం కల్పించాలని కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయో... ఆ స్థానికులే ఉద్యోగ, ఉపాధ్యాయ కేటాయింపుల్లో స్థానికేతరులు అవుతున్నారు. స్థానికతను వదిలిపెట్టి సీనియారిటీని కొలమానంగా తీసుకోవడం వల్ల సీనియర్లు రంగారెడ్డి లాంటి నగర జిల్లాలకు, ఉమ్మడి జిల్లా కేంద్ర పట్టణాలకు పరిమితమై జూనియర్లు గ్రామీణ ప్రాంతాలకే కాకుండా ఏకంగా సొంత జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు కేటాయింపునకు గురయ్యారు.

సర్వీస్‌లో సీనియర్‌ అయినా, క్యాడర్లో జూనియర్‌ ఉపాధ్యాయులు అయితే కూడా వేరే జిల్లాలకు వెళ్లవలసిన అవసరం లేదు. వీరందరూ పదవీ విరమణ పొందే వరకు అదే జిల్లాలో పని చేయాల్సి వస్తుంది. మల్టీ జోనల్‌ పోస్టులు నిర్ణయించేటప్పుడు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాన్ని తీసుకుని స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు జోనల్‌ పోస్టులుగా పేర్కొని ఉండాల్సింది. ఏఎన్‌ఎం,హెడ్‌ కానిస్టేబుల్, సీనియర్‌ అసిస్టెంట్‌ లాంటి పోస్టులు జోనల్‌ పోస్టులు చేసి ఆయా పోస్టులతో సమానమైన, అంతకంటే ఎక్కువ బేసిక్‌ పే ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు జిల్లా పోస్ట్‌ చేయడం వల్ల ఆందోళన ఇంత తీవ్ర స్థాయిగా రూపుదిద్దుకుంది.

ప్రస్తుతం మరో ప్రధాన సమస్య స్పౌజ్‌ కేటగిరి. సీనియర్‌ అయిన ఉద్యోగి, ఈ కేటగిరీ ద్వారా జీవిత భాగస్వాములను తమ ప్రాంతాలకు తెచ్చుకునే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని జిల్లాలో మొత్తం సీనియర్లు, మరికొన్ని జిల్లాలో మొత్తం జూనియర్లు కేటాయింపునకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే రాబోయే కాలంలో కొన్ని జిల్లాల్లో ఉద్యోగ ప్రకటన ఉండకపోవచ్చు. కొన్ని జిల్లాల్లో పెద్ద మొత్తంలో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉండొచ్చు. ఈ విధానం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. 

ఈ సమస్యను  పరిష్కరించాలంటే ఉద్యోగ, ఉపాధ్యా యుల కేటాయింపుల్లో సీనియార్టీ ప్రాతిపదిక కాకుండా 80:20 ప్రకారం స్థానిక, స్థానికేతరులకు పాఠశాల బోనఫైడ్‌ ఆధారంగా ఆయా జిల్లాలను కేటాయిం చినట్లయితే 90 శాతం సమస్య పరిష్కారం అవుతుంది. ఏ జిల్లాలో కూడా 20 శాతం కన్నా ఎక్కువ స్థానికేతరులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉన్నా అందులో సీనియర్లకు అవకాశం ఇచ్చి స్థానికేతరులైన జూనియర్లను వారి సొంత జిల్లాలకు పంపడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కార మార్గం.  

- జుర్రు నారాయణ యాదవ్‌ 
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌

మరిన్ని వార్తలు