విద్యుత్‌ వైర్ల చోరీ కేసులో ఐదుగురి అరెస్ట్‌

25 May, 2023 01:28 IST|Sakshi
విద్యుత్‌ వైర్లను పరిశీలిస్తున్న డీసీపీ రాజేష్‌ చంద్ర

భువనగిరి : విద్యుత్‌ వైర్ల చోరీ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర తన క్యాంప్‌ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట బుధవారం ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని దస్రుతండాకు చెందిన బానోత్‌ చంద్రశేఖర్‌, బానోతు మధుకుమార్‌, మొద్దు కిషన్‌, మరో బాలనేరస్తుడితోపాటు భద్రాది కొత్తగూడెం జిల్లా రోళ్లగడ్డతండాకు చెందిన గుగులోతు పవన్‌ కళ్యాణ్‌ కూలి పనులు చేసుకుంటూనే విద్యుత్‌ వైర్ల చోరీకి పాల్పడుతున్నారు. వీరికి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నివాసం ఉండే పాత సామగ్రి విక్రయించే పిడిగు నవీన్‌ చోరీ చేయడానికి ఉపయోగపడే కట్టర్లు, ఇతర సామగ్రి, రవాణా కోసం వాహనాన్ని సమకూర్చుతున్నాడు. నిందితులు అక్కడక్కడా చోరీ చేసిన వైర్లను నవీన్‌కు విక్రయించేవారు. ఈ ముఠా ఇటీవల బీబీనగర్‌లోని ఎంఆర్‌ఆర్‌ వెంచర్‌లో విద్యుత్‌ వైర్లను చోరీ చేసింది. ఈనెల 20న వెంచర్‌ సూపర్‌వైజర్‌ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా నిందితులను కొండమడుగు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల నుంచి రూ.3.18 లక్షల విలువైన వైర్ల బండిళ్లు, బైక్‌, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ మైనర్‌ ఉండగా అతడ్ని జేజే యాక్ట్‌ మేరకు నోటీసులు అందజేసినట్లు చెప్పారు. దొంగతనానికి పాల్పడేందుకు సహకరించడంతోపాటు చోరీ చేసిన వైర్లను కొనుగోలు చేస్తున్న నవీన్‌ను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. పట్టుబడిన వారు ఇప్పటికే బీబీనగర్‌, భువనగిరితోపాటు ఆత్మకూర్‌(ఎం) మండలాల పరిధిలో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐ వెంకటయ్య, ఎస్సై యుగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.3.18 లక్షల విలువైన వైర్లు,

బైక్‌ స్వాధీనం

నిందితుల్లో బాలుడు

భువనగిరి డీసీపీ రాజేష్‌ చంద్ర

>
మరిన్ని వార్తలు