క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Published Wed, Dec 20 2023 12:48 AM

సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌పై ఎండలో కూర్చున్న క్రీడాకారులు - Sakshi

హన్మకొండ : క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు మూగల (షైన్‌) కుమార్‌యాదవ్‌ సూచించారు. హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో మంగళవారం హనుమకొండ, వరంగల్‌ జిల్లాలస్థాయి సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌ విభాగాల్లో అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. హనుమకొండ, వరంగల్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రమశిక్షణ, పట్టుదలతో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలని సూచించారు. అండర్‌–8, 10, 12, బాలబాలికలకు 50, 100, 300, 400 మీటర్ల రన్నింగ్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌జంప్‌, లాంగ్‌జంప్‌ ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. అండర్‌–14, 16 బాలబాలికలకు జాతీయ అంతర్‌ జిల్లాల జూనియర్స్‌ మీట్‌ (నీర్జమ్‌)లో భాగంగా 60, 100, 400, 600 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌త్రో, ట్రయాత్లన్‌, కిడ్స్‌ జావెలిన్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్‌లో జరగనున్న జాతీయ అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ మీట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. రెండు జిల్లాల నుంచి 650 మంది క్రీడాకారులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్‌ మీట్‌ పరిశీలకుడు పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, అథ్లెటిక్స్‌ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంగిశెట్టి మనోజ్‌కుమార్‌, సంఘం జిల్లా బాధ్యులు సారంగపాణి, యుగేంధర్‌రెడ్డి, ఐలి చంద్రమోహన్‌గౌడ్‌, టెక్నికల్‌ అఫీషియల్స్‌ వాసుదేవరావు, సాంబమూర్తి, రజినీకాంత్‌, కృష్ణమూర్తి, మహేందర్‌, రాజు, డీఎస్‌ఏ కోచ్‌ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

ఎండలోనే ఎంపికలతో ఇబ్బందులు..

ఉదయం నిర్వహించాల్సిన క్రీడాపోటీలను మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిర్వహించడంతో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌పై ఎండను తట్టుకోలేక చాలా మంది క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు. ఈవెంట్‌ సమయంలోనే క్రీడాకారుల పేర్లను ప్రకటించాల్సి ఉండగా అందరిని ఒకేసారి ట్రాక్‌పై గంటల తరబడి కూర్చోబెట్టడంతో నానా అవస్థలు పడ్డారు. ముందుగా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ను అందుబాటులో ఉంచాలి. కానీ, నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ వరంగల్‌

జిల్లా అధ్యక్షుడు షైన్‌ కుమార్‌

జేఎన్‌ఎస్‌లో జిల్లాస్థాయి జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌ ఎంపికలు

Advertisement
Advertisement