ఇలా.. వార్డు పాలన

26 May, 2023 04:54 IST|Sakshi
వార్డు పాలన నియమావళి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మేయర్‌, కమిషనర్‌ తదితరులు

వివిధ విభాగాలకు ఆఫీసర్లు

ఇన్‌చార్జిగా పరిపాలనాధికారి

సాక్షి, సిటీబ్యూరో: త్వరలో కొత్తగా అమల్లోకి రానున్న వార్డు పాలనలో పరిపాలనాధికారి అన్ని విభాగాలనూ సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. స్థానికంగా ప్రజల సమస్యలపై విభాగాల వారీగా ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించనున్నా రు. వార్డుల వారీగా అధికారులు, వారు చేయాల్సిన ముఖ్యమైన పనుల వివరాలిలా ఉన్నాయి.

వార్డు పరిపాలనాధికారి: వార్డు పాలనకు సంబంధించిన అన్ని అంశాలకూ వీరే ఇన్‌చార్జులు. వివిధ విభాగాల అధికారులకు సహకారం అందించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక విధుల్లో నియమించాలి. ఫిర్యాదు లు సత్వరం పరిష్కారమయ్యేలా చూడాలి. పరిష్కారాలను (ఏటీఆర్‌) నమోదు చేసేలా చూడాలి.

వార్డు ఇంజినీర్‌: గుంతలు, ఫుట్‌పాత్‌లు, క్యాచ్‌పిట్లపై మూతల సమస్యల్లేకుండా చూడాలి. రోడ్లపై సిల్ట్‌, నీటినిల్వలు లేకుండా చూడాలి. వీధిదీపాల సమస్యలను సంబంధిత అధికారికి పంపించాలి.

వార్డు టౌన్‌ప్లానర్‌ : వార్డులో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరగకుండా చూడాలి. వీటిపై అందే ఫిర్యాదులపై తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా నివేదికలు పంపాలి. అధికారులు అప్పగించే పనులు చేయాలి.

వార్డు ఎంటమాలజిస్టు: దోమల నివారణ బృందాలు సక్రమంగా పనిచేసేలా చూడాలి. దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

కమ్యూనిటీ ఆర్గనైజర్‌: పేద కుటుంబాల్లోని మహిళలు పొదుపుసంఘాల్లో సభ్యులయ్యేలా చూడాలి. వారికి బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వమందించే సంక్షేమ ఫలాలు అందేలా చేయాలి. అనాథలు, యాచకులు తదితరులకు పునరావాస సదుపాయం, సదరం సర్టిఫికెట్లు అందేలా చూడాలి. సీనియర్‌ సిటిజెన్లకు ఐడీ కార్డులందజేయాలి. వారికి డే–కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి.

శానిటరీ జవాన్‌ : పారిశుద్ధ్య కార్మికులు సమయానికి విధులకు హాజరయ్యేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు సవ్యంగా జరిగేలా చూడాలి. ఇంటింటినుంచి చెత్త సేకరణ నూరు శాతం అమలుచేయాలి. వార్డులో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా చెత్త, డెబ్రిస్‌ లేకుండా చేయాలి. వివిధ మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులను పరిష్కరించాలి.

యూబీడీ సూపర్‌వైజర్‌: ప్రజలనుంచి అందే ఫిర్యాదులపై చెట్లకొమ్మలు నరికి వేయాలి. పార్కులు, ఇతరత్రా ప్రాంతాల్లో పచ్చదనం కార్యక్రమాలు తనిఖీ చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో వార్డుల్లో పచ్చదనం పెంచాలి.

వేదికేదైనా..ఫిర్యాదులు పరిష్కరించాలి..

ఎలక్ట్రానిక్‌, సోషల్‌మీడియా, ఆన్‌లైన్‌, కంట్రోల్‌రూమ్‌, డయల్‌–100 ద్వారా అందే ఫిర్యాదులను సంబంధిత వార్డు అధికారులు పరిష్కరించాలి. కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఫిర్యాదులు నమోదుచేసి, ఎక్నాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వాలి.

సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

ప్రజల సమస్యలను స్థానికంగానే సత్వరం పరిష్కరించేందుకే ప్రభుత్వం వార్డు స్థాయిలో పాలనను ప్రారంభించాల్సిందిగా ఆదేశించిందని మేయర్‌ విజయలక్ష్మి, అధికారులు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న వార్డు కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు