అఫ్గాన్‌ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి

12 Aug, 2021 05:18 IST|Sakshi

కాబూల్‌: అఫ్గాన్‌ భూభాగాలను తాలిబన్‌ సేనలు మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ప్రావిన్స్‌లపై పట్టుకోసం అఫ్గాన్‌ సైన్యం, తాలిబన్‌ మూకల మధ్య పోరుతో దేశంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. తాజాగా మరో మూడు ప్రావిన్స్‌ల రాజధానులను తాలిబన్‌ దళాలు ఆక్రమించాయి. తాజాగా బదఖ్‌షాన్‌ రాజధాని ఫైజాబాద్, బాగ్‌లాన్‌ రాజధాని పోలి–ఖుమ్రీ, ఫరాహ్‌ ప్రావిన్స్‌ రాజధాని తాలిబన్‌ వశమయ్యాయి. దీంతో అఫ్గాన్‌ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి వచ్చింది.

కుందుజ్‌ ఎయిర్‌పోర్ట్‌లోని సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. దీంతో తాలిబన్లపై ప్రతిదాడులు చేసి వారు తోకముడిచేలా చేసేందుకు అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ రంగంలోకి దిగారు. బాల్ఖ్‌ ప్రావిన్స్‌లోని స్థానికసైన్యాల నేతలైన అబ్దుల్‌ రషీద్‌ దోస్తుమ్‌ తదితరులను సాయం కోరేందుకు అక్కడికి చేరుకున్నారు. వారం వ్యవధిలోనే ఆరు ప్రావిన్స్‌ల రాజధానులు తాలిబన్‌ చేతచిక్కాయి. మరోవైపు, కీలక దేశ ‘కస్టమ్స్‌ ఆదాయ మార్గాలను’ తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆర్థికమంత్రి ఖలీద్‌ పయేందా పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయారని ఆర్థికశాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్‌ రఫీ తబే చెప్పారు.

ఉపసంహరణ ఆగదు: బైడెన్‌
అఫ్గాన్‌ సైన్యానికి తోడుగా ఉండేందుకు ఆ దేశంలోనే అమెరికా సేనలు ఉండబోతున్నాయని, సేనల ఉపసంహరణకు బ్రేక్‌ పడుతుందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొట్టిపారేశారు. ‘మా బలగాలు అమెరికాకు రావడం ఖాయం. ఇప్పటికే అఫ్గాన్‌లో 20ఏళ్లకాలంలో దాదాపు రూ.74లక్షల కోట్లు ఖర్చుపెట్టాం. 3లక్షల మంది అఫ్గాన్‌ సైనికులకు శిక్షణ ఇచ్చాం. ఇకపై అఫ్గాన్‌ సేనలు తమ కోసం, తమ దేశం కోసం పోరాడాల్సిందే’అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. కాగా, దేశ సైన్యంలో మరింతగా పోరాటస్ఫూర్తిని పెంచేందుకు ఆర్మీ చీఫ్‌ స్టాఫ్‌గా జనరల్‌ హిబాతుల్లా అలీజాయ్‌ను రక్షణశాఖ నియమించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది.

మరిన్ని వార్తలు