రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. ఎయిరిండియా నిర్వాకం.. మరో విమానంలతో ప్రయాణికుల తరలింపు

8 Jun, 2023 07:55 IST|Sakshi

రష్యా: సాంకేతిక లోపం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో రష్యా మగడాన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోని ప్యాసింజర్లు మరియు సిబ్బందిని శాన్ ఫ్రాన్సిస్కో చేరవేసేందుకు ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్ ను ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. ఈ ఫ్లైట్ రష్యా మగడాన్ ఎయిర్ పోర్టు నుంచి శాన్  ఫ్రాన్సిస్కో ప్రయాణమైనట్లుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.    

ప్రయాణికుల అవస్థలు..  
ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణమైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 777 కు గగనతలంలో ఏర్పడిన చిన్న సాంకేతిక లోపం కారణంగా రష్యాలోని మగడాన్ ఎయిర్ పోర్టులో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 216 ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బందిని అప్పటికప్పుడు సమీప పట్టణంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. అయితే.. అక్కడ వారికి సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. మరో గత్యంతరం లేక నేల మీదే నిద్రకు ఉపక్రమించారు. దీనికి సంబంధించిన కథనాలు సోషల్‌ మీడియా, మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. దీంతో ఎయిరిండియా నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయడంతో ప్రయాణికులందరికీ ఊరట కలిగింది. 

ఫ్లైట్ బయలుదేరింది.. 
ఈ నేపథ్యంలో రష్యా మగడాన్ ఎయిర్ పోర్టు నుండి బయలుదేరిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన ఎయిర్ ఇండియా సాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో ఈ ఫ్లైట్ లోని పాసింజర్లకు మరోసారి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రిసీవ్ చేసుకునేందుకు అక్కడి ఎయిర్ పోర్టులో సహాయక సిబ్బంది సంఖ్యను పెంచి వారిని అప్రమత్తం చేసినట్లు కూడా వెల్లడించింది.   

మరిన్ని వార్తలు