ఆండ్రాయిడ్‌ టీవీలో ఆపిల్‌ సినిమాలు

2 Jun, 2021 17:51 IST|Sakshi

ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆపిల్‌ టీవీ లభ్యం

స్మార్ట్‌టీవీ ప్లే స్టోర్‌లో ఆపిల్‌ టీవీ అప్లికేషన్‌

వెబ్‌డెస్క్‌ : ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీ వినియోగదారులకు శుభవార్త ! ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌ మీదే ఇకపై ఆపిల్‌ సినిమాలు చూసే అవకాశం వచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై నడిచే టీవీల్లోనూ ఆపిల్‌ టీవీ అప్లికేషన్‌ను అందించేందుకు ఆపిల్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ 8 ఆపై వెర్షన్లతో నడుస్తున్న స్మార్ట్‌ టీవీలో ఆపిల్‌ టీవీ అప్లికేషన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ప్లే స్టోర్‌లో ఆపిల్‌ టీవీ యాప్‌ డౌన్‌లోడ్‌ ట్రెండ్‌ మొదలైంది.  

పరిధి పెంచుతోంది
టెక్నాలజీలో దిగ్గజ సంస్థల్లో ఒకటి యాపిల్‌. కొత్తదనం, నాణ్యత, బ్రాండ్‌ వాల్యూ అనే పదాలకు పర్యాయ పదంగా ఆపిల్‌ నిలిచిపోయింది. అయితే ఆపిల్‌ సంస్థ అందించే అన్ని సేవలు, అప్లికేషన్లు కేవలం ఐఓఎస్‌ ప్లాట్‌ఫారమ్‌పై పని చేసే మాక్‌పాడ్‌, ఐపాడ్‌, ఐఫోన్‌ తదితర ఆపిల్‌ డివైజ్‌లలోనే లభించేవి. దశబ్ధకాలం పాటు తన అప్లికేషన్లను ఇతర టెక్‌ ప్లాట్‌ఫారమ్‌లకు అందివ్వలేదు యాపిల్‌. అయితే గత కొంతకాలంగా పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది ఆపిల్‌. అందులో భాగంగానే ఐఓఎస్‌కి సంబంధించిన ఆప్‌స్టోర్‌కి ఆవల అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌, ఎల్‌జీ వెబ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకు ఆపిల్‌ టీవీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఆండ్రాయిడ్‌లోనూ  
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ విభాగంలో ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల మధ్యే ప్రధాన పోటీ. అయితే ఆ పోటీని పక్కన పెట్టి ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోనూ ఆపిల్‌ టీవీ అప్లికేషన్‌ను అందించేందుకు ఆపిల్‌ అంగీకరించింది. ఈ మార్పు కేవలం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌టీవీలకే పరిమితం చేసింది. ఆండ్రాయిడ్‌  మొబైల్‌ ఫోన్‌లకు ఆపిల్‌ టీవీని అందివ్వడం లేదు. 

విస్తరించేందుకే
ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మీద నడిచే టీవీలనే ఎక్కువ సంస్థలు తయారు చేస్తున్నాయి. స్మార్ట్‌టీవీ మార్కెట్‌లో వీటిదే సింహభాగం. ధర తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆపిల్‌ టీవీకి విస్త్రృతమైన మార్కెట్‌ కల్పించేందుకు ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ బెటర్‌ ఛాయిస్‌గా ఆపిల్‌ భావించింది. ఇప్పటికే చాలా మంది ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆపిల్‌ టీవీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆపిల్‌ టీవీలో ఉన్న కంటెంట్‌కి చందాదారులుగా మారుతున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు