ప్రమాదకరంగా బీఏ5 వేరియంట్‌.. వ‍‍్యాక్సిన్‌ తీసుకున్నా సోకుతోంది

11 Jul, 2022 21:21 IST|Sakshi

కాలిఫోర్నియా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త రూపంలో మానవాళిని భయపెడుతోంది ఈ మహమ్మారి. కొద్ది రోజులుగా భారత్‌తో పాటు పలు దేశాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌పై విస్తుపోయే విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవటం వల్ల, గతంలో వైరస్‌ బారినపడి కోలుకోవటం వల్ల ఏర్పడిన రోగనిరోధక శక్తిని సైతం ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ బీఏ.5 హరిస్తోందని తేల్చారు. వారాల వ్యవధిలోనే మళ్లీ సోకుతోందని వెల్లడించారు. బీఏ.4తో పాటు బీఏ.5 వేరియంట్‌ కారణంగానే భారత్‌, అమెరికా, యూకే, ఇటలీ, చైనాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయని అంచనాకు వచ్చారు. 

కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అది మళ్లీ వైరస్‌ సోకకుండా కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తెలిపాయి. అయితే.. రోగనిరోధక శక్తిని హరిస్తూ బీఏ.5 వేరియంట్‌ ప్రమాదకరంగా మారుతోంది. సులభంగా ఒకరి నుంచి ఒకరికి సోకుతోంది. 'ఈ వేరియంట్‌ ఎందుకు ప్రమాదకరంగా మారుతోందంటే.. గతంలో వచ్చిన ఇమ్యూనిటీని ఎదుర్కొని సులభంగా శరీరంలోకి ప్రవేశించటమే. 2020లో వచ్చిన డెల్టా, ఒమిక్రాన్‌ బీఏ1 వేరియంట్‌ బారినపడి కోలుకోగా వచ్చిన రోగనిరోధక శక్తి సైతం ఎలాంటి రక్షణ కల్పించదు' అని తెలిపారు కాలిఫోర్నియా యూనివర్సిటిలో పని చేస్తున్న అంటువ్యాధులు నిపుణులు బ్లూమ్‌బెర్గ్‌. 

ఇటీవల సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక సైతం బీఏ5 వేరియంట్‌పై హెచ్చరించింది. మూడు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనూ ఈ వేరియంట్‌ మళ్లీ సోకుతున్నట్లు పేర్కొంది. రోగనిరోధక శక్తిని రహస్యంగా ఎదురుకునే వేరియంట్‌గా అభివర్ణించారు లండన్‌లోని ఇంపీరియల్‌ కళాశాల పరిశోధకులు. గతంలోని వేరియంట్ల కంటే ప్రమాదకరమని, ఈ వేరియంట్‌ను ఇమ్యూన్‌ వ్యవస్థ గుర్తించలేకపోతోందని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'సూపర్‌ మూన్‌'గా జాబిల్లి.. మరో రెండ్రోజుల్లోనే.. 

మరిన్ని వార్తలు