కరోనా యాంటీ బాడీస్‌తో పాప పుట్టింది

18 Mar, 2021 07:18 IST|Sakshi

ఫ్లొరిడా: కరోనా పేరు తలిస్తేనే గుండె గుభేలుమనే పరిస్థితి. దాన్నుంచి రక్షణకు టీకా వేసుకోవడమే మార్గం. కోవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో, వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో కరోనా యాంటీ బాడీస్‌ తయారవుతాయి. శరీరంలోకి వైరస్‌ ఎంటరవకుండా పోరాడుతాయి. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని ఫ్లారిడాలో ఓ చిన్నారి కరోనా యాంటీ బాడీస్‌తోనే పుట్టింది. వైరస్‌ వచ్చినా గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా జన్మించింది.

పాప పుట్టాక బొడ్డుతాడు నుంచి తీసిన రక్తంతో పరీక్షలు చేసిన వైద్యులు పాల్‌ గిల్బర్ట్, చాడ్‌ రుడ్నిక్‌ ఈ విషయాన్ని నిర్ధారించారు. చిన్నారి కడుపులో ఉన్నప్పుడే ఆమె తల్లి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకుందని, దానివల్ల చిన్నారిలోనూ యాంటీ బాడీస్‌ ఏర్పడ్డాయని తేల్చారు. అయితే ఈ యాంటీ బాడీస్‌ ఎంతకాలం ఉంటాయి, వీటి నుంచి ఎంత వరకు రక్షణ ఉంటుం దన్నది పరిశోధకులు తేల్చాల్సి ఉందని వారు చెప్పారు. దానివల్ల గర్భంతో ఉన్న మహిళలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల ఏర్పడే పరిస్థితులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు