చైనా సంచలన నిర్ణయం: బిలియనీర్‌కు భారీ షాక్‌

28 Jul, 2021 17:24 IST|Sakshi

అగ్రికల్చరల్‌ టైకూన్‌పై పంతం నెగ్గించుకున్న జిన్‌పింగ్‌ ప్రభుత్వం

బిలియనీర్‌ సన్‌ దావూకు 18 నెలల జైలు శిక్ష

475 000 డాలర్ల  జరిమానా

బీజింగ్‌: బిలియనీర్‌, అగ్రికల్చరల్‌ టైకూన్‌ సన్‌ దావూకు (66) చైనా భారీ షాక్‌ ఇచ్చింది. ఇటీవల పలువురు ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు జైలు శిక్ష విధించిన జిన్‌పింగ్‌ ప్రభుత్వం తాజాగా సన్‌దావూకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వ పరిపాలనను అడ్డుకోవడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల ​​ఆక్రమణ, అక్రమ నిధుల సేకరణ  లాంటి నేరాల్లో సన్ దావూ దోషిగా తేలారని బీజింగ్ సమీపంలోని గావోబీడియన్‌ కోర్టు ప్రకటించింది.  దీనిపై సన్‌  న్యాయవాదులు  అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

గ్రామీణ సంస్కరణల మద్దతుదారుడుగా పేరొందిన సన్‌ను రహస్యంగా విచారించిన అనంతరం చైనా కోర్టు  అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాదు 3.11 మిలియన్ యవాన్ల (475,000 డాలర్ల) జరిమానా విధించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుభవజ్ఞుడైన సన్, తన సొంత సంస్థను స్థాపించడానికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాలో పనిచేశారు. ఆ తరువాత భార‍్యతో కలిసి 1980లలో అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ గ్రూప్ అనే భారీ సంస్థను నెలకొల్పారు. ఇందులో ప్రస్తుతం వేలాది మంది ఉద్యోగులున్నారు. అలాగే హెబీ ప్రావిన్స్‌లో 1,000 పడకల ఆసుపత్రి, ఇతర  సౌకర్యాలతో దావు సిటీ అనే నగరాన్ని కూడా నిర్మించారు సన్‌ దావూ.

ప్రభుత్వ బ్యాంకులపై విమర్శలు గుప్పిస్తూ 2000లో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రధానంగా గ్రామీణ పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తూ, గ్రామీణుల పొదుపు సొమ్మును పట్టణ ప్రాజెక్టులవైపు మళ్లిస్తున్నారని సన్‌ ఆరోపించారు. దశాబ్దాలుగా చైనా గ్రామీణ విధానాలను తీవ్రంగా విమర్శించడంతోపాటు, రైతుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలనేవారు. గ్రామీణ సంస్కరణలపై  గొంతెత్తే సన్‌ 2019లో చైనాలో స్వైన్ ఫీవర్ విజృంభణపై  కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

2003లో అక్రమ నిధుల వసూళ్లు ఆరోపణలతో సన్‌ను అరెస్ట్‌ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు మానవహక్కుల నేతలు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పాత్రికేయుల నిరసనల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  అయితే 2021 మేలో సన్‌ను మరోసారి అరెస్ట్‌ చేసిన ప్రభుత్వం, అతని వ్యాపారాలను సీజ్‌ చేసింది. కాగా రియల్ ఎస్టేట్ మొగల్ రెన్ జికియాంగ్‌కు గత సంవత్సరం చైనా 18 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు