చైనాను టెన్షన్‌ పెడుతున్న కరోనా.. జిన్‌పింగ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

22 Dec, 2022 14:53 IST|Sakshi

డ్రాగన్‌ కంట్రీ చైనాను కరోనా వైరస్‌ వేరియంట్స్‌ టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7 కారణంగా చైనాలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో చైనాలో ఆసుప్రతులు పూర్తిగా పేషెంట్స్‌తో నిండిపోయాయి. 

ఇదిలా ఉండగా.. కరోనా వైరస్‌ను అడ్డుకుని, పేషెంట్స్‌ రికవరీ కోసం చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు.. ప‌లు సిటీల్లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా యాంటీ ఫీవ‌ర్ డ్ర‌గ్స్ అందిస్తున్నారు. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోవడంతో స్పెష‌ల్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయ‌డంతో పాలుగా మందుల త‌యారీ, స‌ర‌ఫ‌రాను వేగ‌వంతం చేసేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు సాగిస్తోంది. ఇక, వైర‌స్ వ్యాప్తితో బీజింగ్‌, వుహాన్‌, షెంజెన్‌, షాంఘై న‌గ‌రాల్లో స్ధానిక ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు ఉచితంగా యాంటీ ఫీవ‌ర్ డ్ర‌గ్స్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి.

మరోవైపు.. జీరో కోవిడ్ పేరుతో క‌ఠిన నియంత్ర‌ణ‌ల‌ను స‌డ‌లించిన అనంత‌రం చైనాలో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చైనా ఆసుపత్రుల్లో శ‌వాల గుట్ట‌లు పేరుకుపోయాయ‌నే వార్త‌లు బయటం రావడం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా.. చైనా ప్రభుత్వం, మీడియా మాత్రం దేశంలో కోవిడ్‌ మరణాలు సంభవించలేదని అధికారికంగా పేర్కొంది. దీంతో, కరోనా తీవ్రత, మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, చైనాలో క్రిస్మస్‌, న్యూ వేడుకల నేపథ్యంలో పాజిటివ్‌ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక, మంగ‌ళ‌వారం చైనాలో 3,89,306 కేసుల్లో క‌రోనా ల‌క్ష‌ణాలు గుర్తించామ‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు