తుపానులో ‘పెళ్లి’ తంటాలు.. ఫోటోలు వైరల్

28 Oct, 2020 11:44 IST|Sakshi

కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదన్నట్టు.. వానొచ్చినా...వరదొచ్చినా.. తమ పెళ్లి ముచ్చట కాస్తా జరిగి తీరాల్సిందే అని ఒక జంట నిశ్చయించుకుంది. భారీ వరదల మధ్య ప్రమాదకరమైన నదిని దాటి మరీ ఈ జంట వివాహ వేడుకను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పెళ్లి దుస్తుల్లో వధూవరుల ఇబ్బందులకు సంబంధించిన  ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఒక్కటైన జంటను నెటిజన్లు అభినందిస్తున్నారు.

స్థానిక వార్తాపత్రిక ఫిలిప్పీన్ స్టార్ ప్రకారం,టైఫూన్ క్వింటా కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా వివాహబంధంతో ఒక్కట వ్వాలనుకున్నారు  రోనీ గుళీపా, జెజిల్ మసూలా. వరదలతో పోటెత్తిన లుయాంగ్ నదిని దాటుకుని చర్చికి వెళ్లి అక్టోబర్ 23న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి గౌనులో వధువు, సూట్ ధరించిన వరుడు ఇద్దరూ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ జంటతో పాటు స్నేహితులు, బంధువులు కూడా ఇబ్బందులు పడుతూ పెళ్లికి హాజరు కావడం విశేషం. వేడుక అనంతరం అంతా ఆనందంతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పెళ్లి ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. బంధువుల్లో ఒకరైన జోసెఫిన్ బోహోల్ సబనాల్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

మరిన్ని వార్తలు