-

Israel-Palestine War Latest Updates: హమాస్‌ నుంచి బందీల విడుదల.. నెతన్యాహు షాకింగ్‌ కామెంట్స్‌

27 Nov, 2023 08:46 IST|Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య బందీల విడుదల కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో సాఫీగా సాగింది. ఇక, తాజాగా 17 మంది బంధీలను విడుదల చేసింది. దానికి ప్రతీగా ఇజ్రాయెల్‌.. దాదాపు 75 మంది పాలస్తీనా ఖైదీలను వదిలిపెట్టింది. 

వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య రెండు, మూడు విడతల బందీల విడుదల కొనసాగింది. మూడో విడతలో భాగంగా ఆదివారం 14 మంది ఇజ్రాయెలీలతోపాటు ముగ్గురు విదేశీయులను హమాస్‌ విడిచిపెట్టింది. వీరిలోనూ కొంత మంది ఈజిప్టునకు వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఇజ్రాయెల్‌కు రెడ్‌క్రాస్‌ అప్పగించింది. ప్రతిగా 39 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ విడుదల చేస్తోంది. ఆదివారం నాటికి మొత్తం 63 మందిని హమాస్‌, 114 మందిని ఇజ్రాయెల్‌ విడిచిపెట్టినట్లయింది. ఇక, బంధీల తరలింపు ప్రకియ నాలుగు రోజలు పాటు కొనసాగనుంది. 

ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం గాజాలో అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్‌ బయట పెట్టిన హమాస్‌ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్‌ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను సరిచేయడం’ అని అన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఉత్తర గాజాలో పర్యటించారు.

మరిన్ని వార్తలు