నిలిచిన బందీల విడుదల!

26 Nov, 2023 05:52 IST|Sakshi

జెరుసలేం: ఇజ్రాయెల్‌–హమాస్‌ బందీల విడుదల ఒప్పందానికి రెండో రోజే అవాంతరం ఎదురైంది. శనివారం దాదాపు 14 మంది ఇజ్రాయెలీలను వదిలేయాల్సిన హమాస్‌ అడ్డం తిరిగింది. గాజాకు అత్యవసర సాయం అందడంలో ఆలస్యంపై కినుక వహించింది. ఒప్పందంలో భాగంగా గాజాకు మరింత సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించడం తెలిసిందే.

ఆ మేరకు గత రెండు రోజుల్లో 340కి పైగా ట్రక్కులు ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్‌ దాటాయి. కానీ ఇప్పటికీ అవి గాజాకు చేరుకోకపోవడంపై హమాస్‌ ఆగ్రహంగా ఉంది. వాటన్నింటినీ అనుమతించడంతో పాటు మరింత సాయం కూడా అందాల్సిందేనని పట్టుబడుతోంది. అప్పటిదాకా బందీలను వదిలేది లేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. అయితే గాజాలోకి వెళ్తున్న ట్రక్కులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి గానీ పోనిచ్చేది లేదని ఇజ్రాయెల్‌ సైన్యం చెబుతోంది. దానికి సమయం పడుతోంది తప్ప మరేమీ లేదని చెప్పింది.

ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా ఒప్పందం మేరకు బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ విశ్వాసం వెలిబుచి్చంది. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య బుధవారం నాలుగు రోజుల కాల్పుల విరామణ ఒప్పందం కుదరడం తెలిసిందే. అందులో భాగంగా 50 మంది ఇజ్రాయెలీ బందీల విడుదలకు హమాస్, ప్రతిగా 150 మంది పాలస్తీనియా ఖైదీలను వదిలేసేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించాయి. గాజాకు మరింత అత్యవసర సాయాన్ని అనుమతించేదుకు కూడా ఇజ్రాయెల్‌ ఒప్పుకుంది. శుక్రవారం తొలి రోజు 24 మందిని హమాస్, 39 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ విడుదల చేశాయి. శనివారం 14 మందిని వదిలేయనున్నట్టు హమాస్‌ ప్రకటించింది. 42 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు