అలా జరుగుతుందని ఊహించలేదు: సుధా సుందరి

27 Aug, 2020 14:06 IST|Sakshi

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ బుధవారం ఓ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచిన సంగతి తెలిసిందే.  భార‌తీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ సుధా సుందరి నారాయణ్‌తో పాటు బొలీవియా, లెబ‌నాన్‌, సూడాన్‌, ఘ‌నా దేశాల‌కు చెందిన మ‌రో న‌లుగురికి పౌర‌స‌త్వం ఇచ్చే కార్య‌క్ర‌మం వైట్‌హౌస్‌లోనే జ‌రిగింది.  ఈ కార్యక్రమం గురించి సుధా సుందరి నారాయణ్‌ మాట్లాడుతూ, రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమం టీవీలో ప్రసారమవుతుందని తనకు తెలియదని పేర్కొన్నారు. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదని ఒక మీడియా సంస్థకు తెలిపారు. తన స్నేహితురాలు తనకు ఫోన్‌ చేసి చెబితే ఆ విషయం తనకు తెలిసిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తాను ఒక సాధారణ మహిళనని పేర్కొన్నారు. 

వైట్‌హౌస్‌లో అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ పౌర‌స‌త్వ ప్ర‌దాన కార్య‌క్ర‌మానికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ చాలా ఆదరణ చూపారని, మంచి మనిషి అని అన్నారు. ఆయనను కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమెరికా ఎప్పుడైనా దేశం, రంగు, మతం అనే బేధాలు చూడ‌దనడానికి ఈ పౌరసత్వం ప్ర‌దానం చేయడమే నిదర్శనమని ట్రంప్‌ అన్నారు.  అమెరికా ఒక‌ అద్భుత దేశమని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: సుధా సుందరి నారాయణన్‌కు యూఎస్‌ పౌరసత్వం

మరిన్ని వార్తలు