ఈ మాస్క్ ధర, యజమాని గురించి తెలిస్తే...

10 Aug, 2020 08:50 IST|Sakshi

ప్రపంచంలోనే ఖరీదైన డైమండ్స్ పొదిగిన మాస్క్

ధర  సుమారు 11.2 కోట్లు

 ఆర్డర్ చేసింది ఒక చైనా వ్యాపారి 

కరోనా మహమ్మారి కాలంలో సాధారణ కాటన్ మాస్క్ నుంచి కొంచెం ఖరీదైన ఎన్99 మాస్క్ లు ధరించడం సర్వసాధారణంగా మారిపోయింది. అలాగే బంగారు, డైమండ్ మాస్క్ లు ఇలా.. వారి వారి స్థాయిలను బట్టి ధరించడం కూడా చూశాం. మాస్క్ ధరించడం కేవలం ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాదు. ఇపుడొక స్టేటస్ సింబల్ కూడా. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి ఖరీదైన జిగేల్.. జిగేల్.. మాస్క్ రూపుదిద్దుకుంటోంది. ఇజ్రాయెల్ ఆభరణాల సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కరోనావైరస్ మాస్క్ ను తయారు చేస్తోంది.

టాప్-రేటెడ్ ఎన్99 ఫిల్టర్లు, బంగారం, అతి ఖరీదైన వజ్రాలు పొదిగిన ఈ మాస్క్ ధర 1.5 మిలియన్ డాలర్లు  (సుమారు 11.2 కోట్లు రూపాయలు) గా ఉండనుంది.  అమెరికాలో ఉంటున్న చైనా వ్యాపారవేత్త దీనిని ఆర్డర్ చేశారు. ఇంతకుమించి ఈ మాస్క్ కొనుగోలుదారుని వివరాలను అందించేందుకు జ్యుయల్లరీ సంస్థ  వైవెల్ యజమాని, డిజైనర్ ఐజాక్ లెవీ నిరాకరించారు.  

జెరూసలేం సమీపంలోని తన కర్మాగారంలో ఒక ఇంటర్వ్యూలో ఈ ఖరీదైన మాస్క్ వివరాలను అందించారు డిజైనర్ ఐజాక్ లెవీ. 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో రూపొందిస్తున్న మాస్క్ చుట్టూ, 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని తెలిపారు. అలాగే కొనుగోలుదారుడి అభ్యర్థన మేరకు ఈ స్పెషల్ మాస్క్ తయారుచేస్తున్నట్టు చెప్పారు. ఇది ఈ సంవత్సరం చివరినాటికి పూర్తవుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా తమ  మాస్క్ నిలుస్తుందని పేర్కొన్నారు.

అంతేకాదు కరోనా సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోతూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నసమయంలో తమకు మంచి అవకాశం లభించిందన్నారు. తమ సిబ్బందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందంటూ  కొనుగోలు దారుడికి కృతజ్ఞతలు తెలిపారు లెవీ.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా