JK Rowling-Putin: ఆమెకు సపోర్ట్‌గా పుతిన్‌ వ్యాఖ్యలు.. కానీ, క్రెమ్లిన్‌కు సెటైర్‌తో బదులిచ్చింది

26 Mar, 2022 18:54 IST|Sakshi

రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పై ప్రముఖ బ్రిటిష్ రచయిత్రి,  హ్యారీ పోటర్ ఫేమ్ జేకే రోలింగ్(56) ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరమైన వివాదంలోకి తనను లాగినందుకు ఆమె పుతిన్ పై మండిపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. రోలింగ్‌కు అనుకూలంగా పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు బూమరాంగ్‌ అయ్యాయి.

లింగమార్పిడి(ట్రాన్స్ జెండర్ ఇష్యూ) సమస్యలపై.. తన అభిప్రాయాలను తెలియజేసినందుకే రచయిత జెకె రౌలింగ్‌ స్వేచ్ఛను ఈయూ దేశాలు అడ్డుకున్నాయంటూ పుతిన్‌ ఈమధ్య ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. రష్యా సాహిత్యం, సంగీతంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ దేశాలు నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆ వర్చువల్‌ మీటింగ్‌లో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన జేకే రోలింగ్‌ పేరును ప్రస్తావించారు. 

అయితే అసందర్భంగా తనను ఈ వివాదంలోకి లాగినందుకు ఆమెకు మండిపోయింది.  ‘‘పాశ్చాత్య రద్దు సంస్కృతిపై ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో.. అమాయకుల ప్రాణాల్ని బలిగొంటున్నవాళ్లు, వాళ్లను ఎవరైతే విమర్శిస్తారో వాళ్లను జైలులో పెట్టేవాళ్లు,  విమర్శకులకు విషం పెట్టేవాళ్లు.. విమర్శలకు అర్హులు కాదేమో’’ అంటూ పరోక్షంగా పుతిన్‌ను ఉద్దేశించి కామెంట్‌ చేశారామె. అంతేకాదు.. పుతిన్‌ను విమర్శించినందుకు జైల్లో ఉంచిన ఓ విశ్లేషకుడికి సంబంధించిన కథనాన్ని సైతం ఆమె ట్యాగ్‌ చేశారు. #IStandWithUkraine హ్యాష్‌ ట్యాగ్‌ పోస్ట్‌ చేసిన ఆమె.. ఉక్రెయిన్‌కే తన మద్ధతు ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. తన ఫౌండేషన్‌ తరపున ఉక్రెయిన్‌లో అందుతున్న సాయంపైనా కొన్ని పోస్ట్‌లు చేశారు. 

పాశ్చాత్య దేశాలు చివరికి రష్యా సంస్కృతిపై సైతం ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యాకు చెందిన ఎంతో మంది రచయితలను, వాళ్లు రాసిన పుస్తకాలనూ నిషేధించారు. ఇది నాజీ జర్మనీ చేష్టల్లాగే ఉన్నాయి. ఇంతకు ముందు పిల్లలు అభిమానించే రచయిత్రి జేకే రౌలింగ్‌ కూడా  జెండర్‌ ఫ్రీడమ్‌ పేరుతో ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ వ్యాఖ్యానించాడు పుతిన్‌. కానీ, ఆమె మాత్రం పుతిన్‌కు మద్ధతు ఇవ్వకుండా ఇలా నెగెటివ్‌ పోస్ట్‌ చేసింది.

మరిన్ని వార్తలు