తొలి సూపర్‌నోవాను గుర్తించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌

1 Aug, 2022 08:47 IST|Sakshi

వాషింగ్టన్‌: భూమికి 30 లక్షల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో ఉన్న ఓ పాలపుంతలో భారీ సూపర్‌నోవాను జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తాజాగా గుర్తించింది. జేమ్స్‌ వెబ్‌ కంటికి చిక్కిన తొలి సూపర్‌నోవా ఇదే. నక్షత్రం తన ఉనికిని కోల్పోయే క్రమంలో పేలిపోయినప్పుడు వెలువడే అపారమైన కాంతిని సూపర్‌నోవాగా పిలుస్తారు. అంతరిక్షంలో జరిగే అతి పెద్ద పేలుళ్లు ఇవేనంటారు.

2011లో హబుల్‌ టెలిస్కోప్‌ ఇదే పాలపుంతను క్లిక్‌మనిపించినా ఈ సూపర్‌నోవా మాత్రం దాని కంటికి చిక్కలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జేమ్స్‌ వెబ్‌ను ఇలాంటి అంతరిక్ష పేలుళ్లను గుర్తించేలా డిజైన్‌ చేయలేదు. అయినా దాని కెమెరా కన్ను సూపర్‌ నోవాను బంధించడం విశేషమేనంటూ నాసా శాస్త్రవేత్తలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వయసు మళ్లిన హబుల్‌ టెలిస్కోప్‌ స్థానంలో ఇటీవలే అంతరిక్షంలోకి పంపిన జేమ్స్‌ వెబ్‌ విశ్వపు తొలినాళ్లకు, అంటే దాదాపు 1,350 కోట్ల సంవత్సరాల నాటి విశ్వానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను అందించడం తెలిసిందే.
చదవండి: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..?

మరిన్ని వార్తలు