చైనాలో విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. అంతా సర్వనాశనం

27 Jul, 2021 14:20 IST|Sakshi

ప్రకృతి కోపిస్తే.. దాన్ని తట్టుకోడం కష్టం. ఎన్నడూలేని విధంగా చైనాలో ఆకాశానికి చిల్లు పడినట్లు కురిసే వర్షం. ఉధృతంగా ప్రవహించే వరద. అనుకోకుండా విరుచుకుపడే ఇసుక తుఫాన్లు. ఏం జరుగుతుందో.. తెలియని ప్రజల పరిస్థితి. ఏ దేవుడైనా కాపాడకపోతాడా.. అని ఎదురు చూసే జనం. కళ్ల ముందే కన్న వారు, అయిన వారు కొట్టుకుపోవడం. ఇలా ఒకటా.. రెండా.. చెప్పలేనిని కష్టాలు. ఊహకందని విపత్తులు చైనాను వెంటాడుతున్నాయి.

బీజింగ్‌: చైనాలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. ఓ విపత్తు నుంచి మరో విపత్తు వచ్చి పడుతూ అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చైనాలోని వాయువ్య ప్రాంతంలో 100 మీటర్ల పొడవున ఎత్తైన ఇసుక తుపాను డున్హువాంగ్ నగరాన్ని ముచ్చెత్తింది. ఆకాశమే విరిగిపడిందా అన్నట్టు అంతెత్తున ఇసుక తుపాన్‌ నగరాన్ని కమ్మేసింది. క్షణాల్లో నివాస సముదాయాలు, దుకాణాలు, ఆఫీసులు, రోడ్లు మొత్తం ఇసుక, దుమ్ముతో నిండిపోయాయి.  

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇసుక ప్రభావంతో స్థానికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక మంది పౌరులకు, ముఖ్యంగా వృద్ధులకు శ్వాసకోశ సమస్య ఉన్న రోగులకు కష్టకాలంగా దాపురించింది. గోబీ ఎడారి అంచున ఉన్న ఈ నగరం తరచుగా ఇలాంటి విపత్కర పరిస్థితులకు గురవుతూనే ఉంది.

మరిన్ని వార్తలు