10 బిలియన్‌ ఏళ్ల రాతి గ్రహం.. సూపర్‌ ఎర్త్‌గా పేరు.‌.

26 Jan, 2021 14:00 IST|Sakshi

భూమిని పోలిసి ఓ రాతి గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి కంటే 50 శాతం, మూడు రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్న అత్యంత వేడి, రాతి గ్రహంగా నాసా టెస్‌ మిషన్‌(ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్‌) కనుగొంది. అయితే ఇది భూమికి సమాన సాంద్రతలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి TOI-561b అని పేరు పెట్టారు. మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్నందున దీనిని ఎక్స్‌ప్లానెట్‌గా  నాసా సైంటిస్టులు పేర్కొన్నారు. సూపర్‌ ఎర్త్‌గా పలిచే ఈ గ్రహం సూర్యునిలా ఎర్రగా, మండిపోతున్న గోళంలా కనిపిస్తోంది. మన పాలపుంతలో ఈ కొత్త గ్రహం ఈ నాటిది కాదని, ఎన్నో బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహంగా నాసా పేర్కొంది. అంటే.. ఈ గ్రహం వయస్సు దాదాపు 1000 కోట్ల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.

అంతేకాదు.. మన భూమికి 280 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పురాతన గ్రహం (TOI-561b) రాతి ప్రపంచంలో ఉంటుందని, ఇది భూమికి మూడంతలు పెద్దదిగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 24 గంటలకు కంటే ఎక్కువ సమయంలో ఈ గ్రహం స్టార్ కక్ష్యలో తిరుగుతుందట. అందువల్లే దీనిని సూపర్‌ ఎర్త్‌గా పేర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. నాసా ప్రకారం..  విశ్వంలో చాలా వరకు రాతి గ్రహాలు ఏర్పడి ఉండవచ్చని, ఈ TOI-561b అనేది పురాతన రాతి గ్రహాలలో ఒకటై ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 14 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం ప్రారంభమైనప్పటి నుండి రాతి గ్రహాలు ఉన్నాయని ఈ గ్రహం ఆధారంగా అంచనా వేస్తున్నారు. పాలపుంతలోని ప్రధాన నక్షత్రాలకు మొదటి నుంచే 10 బిలియన్ల ఏళ్ల వయస్సు ఉన్న ఈ గ్రహం ప్రకాశిస్తోందని,  సౌర వ్యవస్థ కంటే రెండు రెట్లు పాతదని భావిస్తున్నారు. ఈ పాలపుంత సుమారు 12 బిలియన్ ఏళ్ల నాటి పురాతనమైనదిగా నాసా వివరించింది.

మరిన్ని వార్తలు