మనలో ఉన్న మంచి బ్యాక్టీరియా తెలుసునా? | Sakshi
Sakshi News home page

మనలో ఉన్న మంచి బ్యాక్టీరియా తెలుసునా?

Published Tue, Jan 26 2021 1:59 PM

Know About Good Bacteria Called Probiotics In Your Body - Sakshi

బ్యాక్టీరియా.... ఈ పేరు వినగానే రకరకాల వ్యాధులు, వాటితో వచ్చే బాధలు గుర్తొస్తాయి. కానీ, పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు బ్యాక్టీరియాలో కూడా మంచివి, మేలు చేసేవి కూడా ఉంటాయని చాలా తక్కువమందికి తెలుసు. ఇలా మనకు మేలు చేస్తూ మన శరీరంలో ఉంటూ మనతో సహజీవనం చేసే బ్యాక్టీరియా, ఈస్ట్‌లను ప్రోబయోటిక్స్‌ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే గుడ్‌ బ్యాక్టీరియా అన్నమాట!

సాధారణంగా ఈ ప్రోబయోటిక్స్‌ మన జీర్ణవ్యవస్థలో ఉంటూ, జీర్ణవాహికను ఆరోగ్యంగా ఉంచుతాయి. మన డైజెస్టివ్‌ ట్రాక్‌లో దాదాపు 400 రకాల ‘గుడ్‌’ బ్యాక్టీరియా ఉంటాయి. ఆహారపదార్ధాల జీర్ణం, వాటి చోషణ (టuఛిజుజీnజ), ఇమ్యూనిటీ పెంచడం వంటి అనేక విషయాల్లో ఇవి సాయం చేస్తుంటాయి. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు యాంటీ బయోటిక్స్‌ వాడితే ఆ సమయంలో ఇవి కూడా నశించిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ప్రోబయోటిక్స్‌ తీసుకోవడం ద్వారా ’హెల్తీ గట్‌’(ఆరోగ్యవంతమైన అన్నవాహిక)ను మెయిన్‌టెయిన్‌ చేయవచ్చు. 

వేటి ద్వారా పొందొచ్చు?
ఎక్కువగా ఫర్మెంటెడ్‌ పదార్ధాల్లో ఈ ప్రోబయోటిక్స్‌ లభిస్తాయి. పెరుగు, యాపిల్‌ సిడార్, యోగర్ట్, క్యాబేజీతో చేసే సౌర్‌క్రౌట్, సోయాబీన్స్‌తో చేసే టెంపె, పచ్చళ్లు, మజ్జిగ లాంటివి గట్‌లో గుడ్‌ బ్యాక్టీరియా పెండచడంలో సాయం చేస్తాయి. వీటిలో లాక్టోబాసిల్లస్, బైఫిడో బాక్టీరియం రకాలు ఎక్కువ ప్రయోజనకారులు. 

ఎంత డోసేజ్‌ మంచిది?
సాధారణంగా రోజుకు 30 కోట్ల నుంచి 100 కోట్ల సీఎఫ్‌యూ(కాలనీ ఫామింగ్‌ యూనిట్స్‌– బ్యాక్టీరియా కొలమాని) ప్రోబయోటిక్స్‌ను డాక్టర్లు రికమండ్‌ చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యేకించి జీర్ణవ్యవస్థకు సంబంధించి ఇబ్బందులుంటే ఈ మోతాదు మరికొంత పెంచుతారు. 

లాభాలనేకం: ∙ఇరిటబుల్‌ బౌల్‌ సింట్రోమ్‌(ఐబీఎస్‌)తో పోరాటంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో పాటు గ్యాస్‌ సమస్యలు, మలబద్ధకం, డయేరియాలాంటి జీర్ణకోశ వ్యాధులు తగ్గించడంలో ఉపయోగ పడతాయి. హీలికోబాక్టర్‌ పైలోరి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, అల్సర్లు, జీర్ణకోశ కాన్సర్‌పై యుద్ధంలో ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని ప్రోబయోటిక్స్‌ బరువుతగ్గించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని ఇన్‌ఫ్లమేషన్లపై పోరాటం చేస్తాయి. కొన్ని కీలక బ్యాక్టీరియాలు డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గించడంలో సాయపడతాయి. మరికొన్ని ఎల్‌డీఎల్‌(బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌) తగ్గించేందుకు ఉపకరిస్తాయి.

ప్రొబయోటిక్స్‌ కారణంగా చర్మం కాంతి వంతంగా కావడం, మొటిమలు తొలగిపోవడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. 

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయా?
సాధారణంగా ప్రోబయోటిక్స్‌ వాడకంతో ఎలాంటి ఇబ్బందులుండవు. కొందరికి మాత్రం జీర్ణ సంబంధిత తేలికపాటి సమస్యలు ఎదురుకావచ్చు. ఇవి స్వల్పకాలంలోనే తగ్గిపోతాయి. lఅయితే ఎయిడ్స్‌ పేషంట్లలో మాత్రం ఇవి ఒక్కోమారు తీవ్రమైన ఇన్ఫెక్షన్స్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ∙ఇమ్యూనిటీ సంబంధిత వ్యాధులున్నవారికి సైతం ఇవి కొత్త తలనొప్పులు తెస్తాయి. అందువల్ల తీవ్రమైన వ్యాధులున్నవాళ్లు, గర్భిణులు, పసిపిల్లలు, వయోవృద్దులు ప్రోబయోటిక్స్‌ వాడేముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

Advertisement
Advertisement