పాక్‌... మరో శ్రీలంక

3 Jul, 2022 05:05 IST|Sakshi

కరెంటు సంక్షోభం, ఇంటర్నెట్‌ బంద్‌!

ఇస్లామాబాద్‌: శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్‌ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో గంటల కొద్దీ విద్యుత్‌ కోతలు అమల్లో ఉండటంతో మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పాకిస్తాన్‌ ప్రభుత్వమే ప్రజలను హెచ్చరించింది. విద్యుత్‌ కోతల కారణంగా ఇప్పటికే మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని శుక్రవారం నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బోర్డ్‌ (ఎన్‌ఐబీటీ) ట్విట్టర్‌లో తెలిపింది.

దేశ అవసరాలకు సరిపోను ద్రవీకృత సహజ వాయువు(ఎల్‌ఎన్‌జీ) అందకపోవడంతో జూలైలో ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ కూడా ఇటీవల పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్‌ డిమాండ్‌ ఒక వైపు పెరుగుతుండగా జూన్‌లో దిగుమతులు తగ్గిపోయినట్లు జియో న్యూస్‌ పేర్కొంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కరాచీ తదితర నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్, ఫ్యాక్టరీల్లో పని గంటలను కుదించారు. ఇంధన కొరతను అధిగమించేందుకు ఖతార్‌తో చర్చలు జరుగుతున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా రెట్టింపయింది.

మరిన్ని వార్తలు