విద్యార్థికి హెయిర్‌ కట్‌ చేసిన ప్రిన్సిపల్‌

27 Feb, 2021 16:45 IST|Sakshi
ఆంథోనికి హెయిర్‌ కట్‌ చేస్తున్న జాషన్‌

న్యూయార్క్‌ : గురువు అనే పదానికి సరైన అర్థం చెప్పాడో ఓ ప్రిన్సిపల్‌. స్కూలు నిబంధనలకు విరుద్ధంగా హ్యాట్‌ పెట్టుకుంటున్న విద్యార్థికి హెయిర్‌ కట్‌ చేసి అందరి మన్ననలు పొందాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికా, ఇండియానాకు చెందిన ఆంథోనీ మూరే ఇండియానాపొలిస్‌లోని స్టోనీ బ్రూక్‌ ఇంటర్ ‌మీడియట్‌ అండ్‌ మిడిల్‌ స్కూల్లో చదువుతున్నాడు. అతడు రోజూ  హ్యాట్‌ పెట్టుకుని స్కూలుకు హాజరయ్యేవాడు. స్కూలు యూనీఫాం‌ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థి హ్యాట్‌ పెట్టుకుని తిరగటం ప్రిన్సిపల్‌ జాషన్‌ స్మిత్‌కు నచ్చలేదు. హ్యాట్‌ తీసేయమని అతడ్ని అడిగాడు. ఆంథోనీ అందుకు ఒప్పుకోలేదు. ప్రిన్సిపల్‌ అతడిమీద కోపం తెచ్చుకోకుండా హ్యాట్‌ ఎందుకు తీయనంటున్నాడో అడిగాడు. ‘‘ నా జుట్టు పెరిగినట్లు అనిపిస్తే మా అమ్మానాన్న హెయిర్‌ కట్‌ చేయిస్తారు. ఆ హెయిర్‌ కట్‌ చాలా దారుణంగా ఉంటుంది’’ అని చెప్పాడు. దీంతో బాగా ఆలోచించిన జాషన్‌ తానే ఆంథోనికి హెయిర్‌ కట్‌ చేయటానికి పూనుకున్నాడు.

‘‘చూడు ఆంథోనీ! నేను నీ అంత వయసున్నప్పటినుంచి హెయిర్‌‌ కట్‌ చేస్తున్నాను. నేనింటికెళ్లి ట్రిమ్మర్‌ తెచ్చి నీకు హెయిర్‌ కట్‌ చేస్తాను. సరేనా!’’ అని అడిగాడు. ఆ విద్యార్థి మొదట ఇందుకు ఇబ్బందిపడ్డా.. తర్వాత సరేనన్నాడు. అనంతరం జాషన్‌.. ఆంథోనికి హెయిర్‌ కట్‌ చేశాడు. ఆ పిల్లాడు హ్యాట్‌ పెట్టుకోవటం మానేశాడు. దీనిపై స్పందించిన ఆంథోనీ తల్లి.. కుమారుడి పరిస్థితిని అద్భుతమైన పద్ధతిలో డీల్‌ చేసినందుకు జాషన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. తమ అబ్బాయిని స్కూలు నుంచి సస్పెండ్‌ చేయనందుకు సంతోషం వ్యక్తం చేసింది.

చదవండి : ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు 

  డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిన కొడుకు.. కారణం..

మరిన్ని వార్తలు