ఇజ్రాయిల్ దాడుల్లో రాయిట‌ర్స్‌ జ‌ర్న‌లిస్టు మృతి, మరో ఆరుగురికి గాయాలు

14 Oct, 2023 13:49 IST|Sakshi

జెరుస‌లేం: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో రాయిట‌ర్స్‌ వార్తా సంస్థ‌కు చెందిన జ‌ర్న‌లిస్టు మృతిచెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మరో ఆరుగురు జ‌ర్న‌లిస్టులు గాయ‌ప‌డ్డారు. జ్రాయిల్ సరిహద్దు దగ్గరున్న అల్మా అల్-షాబ్ సమీపంలో ఆ దేశ మిలిట‌రీతో పాటు లెబ‌నీస్ మిలిట‌రీ హిజ్‌బుల్లా కాల్పుల‌కు పాల్ప‌డుతోంది. 

అదే ప్రాంతంలో అల్ జెజిరా, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్‌(ఏఎఫ్‌పీ)కు చెందిన జ‌ర్న‌లిస్టులు లైవ్‌ కవరేజ్‌ ఇస్తున్నారు.  ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ దిశ నుంచి వ‌చ్చిన మిస్సైల్ దాడిలో రాయిటర్స్‌ వీడియో జర్నలిస్ట్‌ ఇస్సామ్ అబ్దల్లా హత్య ప్రాణాలు కోల్పోయాడు. జ‌ర్న‌లిస్టు మృతికి ఇజ్రాయిల్ కార‌ణ‌మ‌ని లెబ‌నాన్ ప్ర‌ధాని న‌జీబ్ మికాటి ఆరోపించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్‌ సైన్యం స్పందించలేదు

తమ జర్నలిస్టు మృతిపట్ల రాయిటర్స్‌ వార్తా సంస్థ స్పందించింది. సౌత్‌ లెబనాన్‌ నుంచి లైవ్‌ అందిస్తున్న ఇస్సామ్‌ అబ్దుల్లా మృతిపట్ల సంతాపం ప్రకటించింది. ఇజ్రాయెల్‌ వైపు నుంచి వస్తున్న క్షిపణి కాల్పులను వీడియో తీస్తుండగా, మరో మిస్సైల్‌ దూసుకురావడంతోఅతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.  దీనిపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. రాయిటర్స్‌కు చెందిన మరో ఇద్దరు జర్నలిస్టులు అల్‌ సుడానీ, మహేర్‌ నజే సైతం గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలిపింది. 
చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం

ఇదిలా ఉండగా హ‌మాస్ మిలిటెంట్లకు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య వారం రోజులుగా భీకర పోరు కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ను అంతం చేసి గాజాను చేజిక్కిచుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సేనలు బాంబ్‌లు, వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ దాడుల్లో తాజాగా హమాస్‌కు గ్రూపుకు చెందిన వైమానిక ద‌ళ నేత మురాద్ అబూ మురాద్‌ను ఇజ్రాయెల్‌ అంతమొందించింది.  

శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన వైమానిక దాడుల్లో మురాద్ చ‌నిపోయిన‌ట్లు ఇవాళ ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు పేర్కొన్నాయి. వైమానిక కార్య‌కలాపాల‌ను సాగిస్తున్న హ‌మాస్ ప్ర‌ధాన కార్యాల‌యంపై చేసిన దాడుల్లో మురాద్ హ‌త‌మైన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా హ‌మాస్ మిలిటెంట్లకు మురాద్ దిశానిర్దేశం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. హ్యాంగ్ గ్లైడ‌ర్ల ద్వారా హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఇజ్రాయిల్‌లో అడుగుపెట్టడానికి మురాద్ కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు