వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ తిరుగుబావుటా.. మీడియా ముందుకు పుతిన్‌.. సంచలన ప్రకటన

24 Jun, 2023 13:47 IST|Sakshi

క్రెమ్లిన్‌: మాస్కో సహా రష్యా కీలక నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ.. వాగ్నర్‌ సైన్యం చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మండిపడ్డాడు. తాజా పరిణామాల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన పుతిన్‌.. ప్రిగోజిన్‌ రష్యాకు వెన్నుపోటు పొడిచాడని, అలాంటి ద్రోహులు ఫలితం అనుభవించక తప్పదని మండిపడ్డారు.

రష్యా మిలిటరీపై ప్రిగోజిన్‌ తిరుగుబాటు ప్రకటన నేపథ్యంలో రష్యా రాజధాని మాస్కో సహా ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది క్రెమ్లిన్‌. ఈ క్రమంలో అంతర్యుద్ధం తప్పదన్న ఊహాగానాల నడమ.. పుతిన్‌ శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. రష్యాలో అంతర్యుద్ధం జరగకుండా శాయశక్తులా అడ్డుకుంటానన్న ఆయన.. ప్రజలను ఉద్దేశించి ఐక్యత పిలుపు ఇచ్చారు పుతిన్‌. 

వాగ్నర్‌ తిరుగుబాటును రష్యాకు ఘోరమైన ముప్పుగా అభివర్ణించిన పుతిన్‌.. వ్యక్తిగత ఉద్దేశాలతోనే వాగ్నర్‌ చీఫ్‌ ద్రోహానికి పాల్పడ్డాడని పుతిన్‌ మండిపడ్డారు. రష్యా దక్షిణ నగరం రోస్తోవ్‌లో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉందని.. పరిస్థితిని అదుపులోకి తెస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా వీపులో ప్రిగోజిన్‌ కత్తి దింపి వెన్నుపోటు పొడిచి ద్రోహానికి పాల్పడ్డాడని, దానిని శిక్ష అనుభవించక తప్పదని పుతిన్‌ పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. వాగ్నర్‌ పేరిట ప్రైవేట్‌ సైన్యం నడిపిస్తున్న ప్రిగోజిన్‌, గతంలో పుతిన్‌కు చాలా దగ్గరగా ఉండేవారు. అయితే గత కొంతకాలంగా రష్యా రక్షణతో ఆయనకు పడడం లేదు. ఈ తరుణంలోనే తమ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులకు రష్యా మిలిటరీ పాల్పడుతోందని ఆరోపిస్తూ తిరుగుబాటు జెండా ఎగరేశారాయన. ఇప్పటికే పాతిక వేలమందితో కూడిన ఆయన సైన్యం రోస్తోవ్‌లో సెటిల్‌ అయినట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి:  ప్రిగోజిన్‌ ఒక దొంగ.. రోడ్ల మీద అమ్ముకుంటూ.. ఇప్పుడు ఇలా

మరిన్ని వార్తలు