Russia-Ukraine War: తూర్పు ఉక్రెయిన్‌లో భీకర పోరు

23 Jun, 2022 04:56 IST|Sakshi

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతోంది. డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌ ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా సేనలు భారీ స్థాయిలో బాంబు దాడులు చేస్తున్నాయి. వాటిలో పలు నగరాల్లో భవనాలు తదితరాలు నేలమట్టం కావడంతో పాటు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించినట్టు ఉక్రెయిన్‌ వర్గాలు చెబుతున్నాయి. రష్యా దాడుల తీవ్రతను పెంచిన నేపథ్యంలో సెవెరోడొనెట్స్‌క్‌లో కెమికల్‌ ప్లాంటులో చిక్కుకున్న వందలాది పౌరులు, ఉక్రెయిన్‌ సైనికుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

తనను యూరోపియన్‌ యూనియన్‌లో చేర్చుకోవడంపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వస్తాయని ఉక్రెయిన్‌ ఆశాభావం వెలిబుచ్చింది. ఈ మేరకు త్వరలో నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్టు దేశ ఉప ప్రధాని ఓలా స్టెఫానిష్నా అన్నారు. మరోవైపు యుద్ధం మొదలైన తొలినాళ్లలో మరణించిన ఉక్రెయిన్‌ ఫొటో జర్నలిస్టును రష్యా సేనలు సజీవంగా పట్టుకుని దారుణంగా హతమార్చినట్టు తాజాగా వెలుగు చూసింది.  రష్యా తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ఓ ఉక్రెయిన్‌ అధికారిని, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు